
Chandrababu Arrest: స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో అరెస్టైన చంద్రబాబు విచారణ ముగిసింది. తాడేపల్లిలోని సిట్ కార్యాలయంలో దాదాపు 10 గంటల పాటు సీఐడీ విచారణ జరిపింది. అనంతరం వైద్య పరీక్షల నిమిత్తం విజయవాడలోని ప్రభుత్వాస్పత్రికి తరలించారు అధికారులు. నిపుణుల పర్యవేక్షణలో ఆయనకు వైద్య పరీక్షలు చేయించారు అధికారులు. దాదాపు గంటపాటు చంద్రబాబుకు బీపీ, షుగర్, ఎక్స్‌రే, ఛాతి సంబంధిత పరీక్షలన్నీ నిర్వహించారు అధికారులు. మరికాసేపట్లో చంద్రబాబును సీఐడీ కోర్టు జడ్జి ముందు ప్రవేశపెట్టనున్నారు అధికారులు.
ఇక చంద్రబాబును విజయవాడ ప్రభుత్వాస్పత్రికి తరలించిన నేపథ్యంలో.. ప్రభుత్వాస్పత్రి వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు పోలీసులు. ప్రభుత్వాస్పత్రిలో అప్పటికే వైద్యులను సిద్ధం చేసిన అధికారులు.. చంద్రబాబుకు వైద్య పరీక్షలను ఎలాంటి అంతరాయం లేకుండా పూర్తి చేశారు. సీపీ క్రాంతి రాణా భద్రతాపరమైన అంశాలను స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. పోలీసుల రిమాండ్ రిపోర్ట్‌లో కీలకంగా మారనుంది ఈ వైద్య పరీక్షలు.
చంద్రబాబును మరికాసేపట్లో ఏసీబీ కోర్టులో ప్రవేశపెట్టనున్నారు అధికారులు. ఈ నేపథ్యంలో నారా లోకేష్, ఆయన తరుఫున లాయర్స్ కోర్టు వద్దకు చేరుకున్నారు.
చంద్రబాబు నాయుడి అరెస్ట్‌ను సవాల్ చేస్తూ ఆయన తరఫున న్యాయవాదులు ఏసీబీ కోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు. సీఐడీ పోలీసులు ఎలాంటి ప్రొసీజర్‌ను ఫాలో కాలేదని, ముందుగా నోటీసులు ఇవ్వలేదని జడ్జికి తెలియజేశారు లాయర్లు. కనీసం కుటుంబ సభ్యులకు కూడా సమాచారం ఇవ్వలేదన్నారు. అయితే, ఆ పిటిషన్‌ను కోర్టు జడ్జి తిరస్కరించారు. రిమాండ్ రిపోర్ట్ లేకుండా హౌస్ మోషన్ పిటిషన్ ఎలా దాఖలు చేస్తారంటూ ప్రశ్నించారు. రిమాండ్ రిపోర్ట్ వచ్చాక మరోసారి పిటిషన్ వేసుకోవాలని న్యాయవాదులకు సూచించారు జడ్జి.
చంద్రబాబు నాయుడిపై అక్రమ కేసులు పెట్టారని, ఇలాంటి కేసులు నిలబడవని రాజ్యసభ సభ్యుడు కనకమేడల అన్నారు. పోలీసుల రిమాండ్ రిపోర్ట్‌కు ఇంత సమయం ఎందుకు ? అని ప్రశ్నించారు. కోర్టు అనుమతి లేకుండానే చంద్రబాబుని విచారణ చేస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వ పైశాచిక ఆనందానికి ఇది పరాకాష్ట అని వ్యాఖ్యానించారు కనకమేడల. ఆధారాలున్నాక ఇంత సాగదీత ఎందుకు? అని ప్రశ్నించారు. జరుగుతున్నదంతా కక్షపూరిత చర్యలే అని ఆరోపించారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..