AP News: అఘోరీ వీర విహారం.. తాళ్లతో బంధించిన పోలీసులు…
అఘోరీలు అంటే.. దేవుడి చిత్రపటాలు పట్టుకుంటారు. రుద్రాక్షలతో ప్రత్యేక పూజలు చేస్తారు. కానీ తెలుగురాష్ట్రాల్లో చక్కర్లు కొడుతున్న ఆఘోరీ రూటే వేరు. ఎక్కడికెళ్తే అక్కడ నానా రచ్చ చేస్తోంది. అక్కడ ఉండే వాళ్లతో వాగ్వాదానికి దిగుతూ మతి పొగొడుతోంది. తాజాగా....
తెలుగు రాష్ట్రాల్లో అఘోరీ హల్‌చల్ ఇప్పట్లో ఆగేట్లు కనిపించడంలేదు. మంగళగిరి బైపాస్ రోడ్డు మీద అఘోరి హల్‌చల్ చేసింది. తాను కార్ సర్వీసింగ్ కి వచ్చిన సందర్భంలో పోలీసులు అడ్డుకుంటున్నారని నిరసన వ్యక్తం చేస్తూ హైవేపై బైఠాయించింది. వాహనాలకు రాకపోకలకు ఇబ్బంది అవుతుందని చెప్పేందుకు వచ్చిన పోలీసుల వారితో అఘోరీ దురుసుగా వ్యవహరించింది. అక్కడ నుంచి తరలించేందుకు ప్రయత్నించగా.. పోలీసులపై దాడికి యత్నించింది. తక్షణమే పవన్ కళ్యాణ్ తన వద్దకు రావాలని డిమాండ్ చేసింది. రూరల్ సీఐ శ్రీనివాసరావు, ఎస్ఐ వెంకటేశ్వరావు పై దాడి చేసింది. అఘోరీ. దీంతో తప్పనిసరి పరిస్థితిలో అఘోరీని తాళ్లతో బంధించారు పోలీసులు.
అఘోరా.. ఈ పేరు విన్నా.. వాళ్లను చూసినా కొంతమందికి ఒల్లు జలదరిస్తుంది. అఘోరాల గురించి తెలిసిన వాళ్లకు మాత్రం భక్తి కలుగుతుంది. అఘోరగా మారాలనుకోవడం ఆషామాషీ వ్యవహారం కాదు. చూడ్డానికి అలా కన్పించినా ప్రతీ అఘోరా ఓ సాధకుడు. హిమాలయాల్లాంటి ప్రాంతాల్లో కఠోర తపస్సు చేస్తారు. పబ్లిక్‌గా వాళ్లు ప్రధానంగా కన్పించేది కుంభమేళాలో మాత్రమే.
ఒంటి నిండా విభూది.. జడలు కట్టుకుపోయిన జుట్టు.. అయితే అఘోరాలు వేరు.. నాగ సాధువులు వేరు. మార్గాలు వేరైనా శివరాధాన, కాళిమాతా ప్రసన్నమే ఇద్దరి లక్ష్యం. వీళ్లలో మహిళలుంటే అఘోరీలంటారు. పేరులో చిన్నతేడా మాత్రమే. సాధనలో ఎవరికి వారే సాటి. అయితే ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో అఘోరీ పచార్లు హాట్ టాపిక్‌గా మారింది.
చూడ్డానికి మనలాంటి వాళ్లే.. మనలోని వాళ్లే. కానీ మనలా ఒకలా ఉండరు.. భయం -భక్తి ఆ రెండింటీకి మించిన శక్తి.. నిప్పు కణికల్లాంటి ఆ కళ్లలో కదలాడుతుంటుంది. కానీ ఈ అఘోరీ మాత్రం టోటల్ డిఫరెంట్. జనంలో కలుస్తుంది.. ఖరీదైన కార్లలో తిరుగుతుంది.. గొప్పలకు పోతుంది. నేను వేరే లెవెల్ అంటూ లెక్చర్లు దంచేస్తుంది. అఘోరీ అంటే ఇలా కూడా ఉంటారా అన్న అనుమానాలు కలిగేలా నడుచుకుంటోంది.
మహబూబ్‌నగర్‌లో అఘోరీ హల్‌చల్‌తో పోలీసులు అలర్టయ్యారు. హౌస్ అరెస్ట్ చేశారు. తర్వాత సెక్యూరిటీ ఇచ్చి బార్డర్ దాటించేశారు. ఏపీకి షిఫ్ట్ అయిన అఘోరీ అక్కడా సేమ్‌సీన్‌తో రచ్చ రేపింది. అనకాపల్లి నక్కపల్లి టోల్‌ప్లాజా దగ్గర నానా హంగామా చేసింది. టోల్‌గేట్ పేమెంట్ విషయంలో సిబ్బందికి శాపనార్ధాలతో చెమటలు పట్టించింది. దుస్తులు లేకుండా ఆలయ సిబ్బంది శ్రీకాళహస్తి ఆలయంలోకి అనుమతించం అని చెప్పడంతో ఆత్మహత్యాయత్నం చేసింది.
ఇంతకీ అఘోరీ తాపత్రయమంతా సనాతనం కోసమేనా? అదే నిజమైతే ఇంత బిల్డప్‌లు ఎందుకు? నిజానికి అఘోరాలైనా.. అఘోరీలైనా ఏళ్ల తరబడి హిమాలయాల్లో తపం ఆచరించి ఒక్క కుంభమేళా సమయంలో మాత్రమే జనం మధ్యకు వస్తారు. మరీ ఈ అఘోరీ ఇప్పుడెందుకు ప్రత్యక్షం అయినట్టు? కార్లలో షికార్లు ఎందుకు చేస్తున్నట్టు? చూసేవాళ్లందరికీ ఎందుకు చికాకు తెప్పిస్తుందనేది అర్థం కాని ప్రశ్న.
అఘోరాలంటే శివ భక్తి.. సాధన శక్తి తప్ప మరే ఏ చింతన ఉండదు. ఒకవేళ జనబాహుళ్యంలోకి వస్తే శ్మశానాలే ఆవాసాలుగా మల్చుకుంటారు. ఈ అఘోరి మాత్రం ఇళ్ల మధ్యలో ఉంటుంది. యూట్యూబ్ ఛానళ్లకు ఇంటర్వ్యూలు ఇస్తుంది. దేవుడు, దైవం అంటూ ఆధ్యాత్మిక పాఠాలు వివరిస్తోంది. నిజానికి గతంలో అఘోరీలెవరూ ఇలా చేసిన సందర్భాలు లేవు. మరి ఈ ఆఘోరీ మాత్రమే ఎందుకిలా చేస్తుందన్నది అర్థంకాని ప్రశ్న.
అఘోరీది సనాతన ధర్మం కోసం చేస్తున్న పోరాటమా? ఆ పేరుతో న్యూసెన్స్ క్రియేట్ చేస్తోందా? ఈ రెండూ కాకుండా పబ్లిసిటీ పిచ్చేమైనా ఉందా? కారణం ఏదైనా అఘోరీ చేస్తున్న హడావుడి తెలుగు ప్రజల్ని బిత్తరపోయేలా చేస్తోంది.