
ఏంటి అన్న.. మరి ఇలా ఉన్నావ్.. నంద్యాల జిల్లాలో ఓ వ్యక్తి ప్రవర్తన.. పోలీసులకు ఆశ్చర్యాన్ని కలిగించింది. అతను అత్తారింటికి వెళ్లడానికి బస్సు కోసం ఎదురుచూశాడు. ఎంతసేపటికి బస్సు రాకపోవడంతో.. దగ్గర్లో పార్క్ చేసిన ఉన్న ఆర్టీసీ బస్సు వేసుకుని వెళ్లిపోయాడు. వివరాల్లోకి వెళ్తే… వెంకటాపురానికి చెందిన దుర్గయ్య అనే వ్యక్తి… ఆత్మకూరు నుంచి తన అత్తగారి ఊరు.. ముచ్చుమర్రి వెళ్లేందుకు బస్టాండ్‌కు వచ్చాడు. ఎంత ఎదురుచూసినా బస్సు రాకపోవడంతో అతనికి చిర్రెత్తుకొచ్చింది. దగ్గర్లోని పెట్రోల్ బంక్ దగ్గర RTC బస్సు కనిపించడంతో దాని దగ్గరకు వచ్చాడు. బస్సులో ఎవరూ లేరు.. తాళం కూడా ఉండటంతో.. వెంటనే ఆ బస్సు ఎక్కి తోలుకుంటూ అత్తగారి ఊరు వెళ్లిపోయాడు.
ముచ్చుమర్రి వెళ్లిన తర్వాత బస్సును తీసుకెళ్లి.. లోకల్ పోలీస్ స్టేషన్‌లో అప్పగించాడు. బస్సు ఎందుకు తీసుకొచ్చావ్ అని పోలీసులు ప్రశ్నించగా… ఎంత సేపు ఎదురుచూసినా బస్సు రాకపోవడంతో.. ఈ బస్సును వేసుకుని వచ్చానని అతను చెప్పడంతో.. పోలీసులు అవాక్కయ్యారు. దీంతో పోలీసులకు కాసేపు ఏం చేయాలో పాలుపోలేదు. దుర్గయ్యను కాసేపు పోలీస్ స్టేషన్‌లో కూర్చోబెట్టి.. ఆ బస్సును మళ్లీ ఆత్మకూరుకు పంపించారు. బస్సు ప్రయాణం చేసేందుకు డబ్బులు లేకపోవడంతోనే.. అతను ఇలా చేసి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. బస్సు పోయిందని ఎలాంటి ఫిర్యాదు రాకపోవడంతో.. దుర్గయ్యపై ఎలాంటి కేసు నమోదు చేయలేదు. స్థానికంగా ఈ ఘటన చర్చనీయాంశమైంది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.