ఆడవాళ్ళు ఎంత జాగ్రత్తగా ఉన్నా ఎక్కడోచోట ఉన్మాదుల బారిన పడకతప్పడం లేదు. అనంతపురం జిల్లా ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో జరిగిన ఓ ఘటన మహిళా సిబ్బందిని ఆందోళనకు గురిచేస్తోంది. యాడికి మండలం రాయలచెరువు పీహెచ్‌సీలో మహిళా సిబ్బంది దుస్తులు మార్చుకునేటప్పుడు నరేంద్ర అనే టెండర్ రహస్యంగా వీడియోలు తీస్తున్న ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఓ బాక్స్ కు రంద్రం చేసి.. అందులో సెల్ ఫోన్ పెట్టి వీడియో తీసినట్లు ఆరోపణలు వస్తున్నాయి. మహిళా సిబ్బంది బట్టలు మార్చుకునే గదిలో రహస్యంగా సెల్‌ఫోన్ అమర్చి గత కొంతకాలంగా నరేంద్ర ఈ దారుణానికి పాల్పడుతున్నట్టు స్పందన కార్యక్రమంలో 40 మంది మహిళా సిబ్బంది కంప్లైంట్ చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఇంకా ఎవరెవరి వీడియోలు అందులో ఉన్నాయో తెలియక ఆందోళనకు గురవుతున్నారు మహిళా ఉద్యోగులు.
ఈ ఘటనపై ఉన్నతాధికారులు సీరియస్ అయ్యారు. వెంటనే దర్యాప్తుకు ఆదేశించారు. షీ టీమ్స్‌కి ఈ కేసు హ్యాండోవర్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అతడి వద్ద ఉన్న ఫోన్ సీజ్ చేసి.. తమ పరువుకు భంగం కలగకుండా చూడాలని మహిళాా సిబ్బంది కోరుతున్నారు. నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని రిక్వెస్ట్ చేస్తున్నారు. స్థానికంగా ఈ ఘటన చర్చనీయాంశమైంది. ఆరోపణల్లో నిజం ఎంత..? ఆ వీడియోలు.. అతడి వద్ద మాత్రమే ఉన్నాయా..? ఎవరికైనా షేర్ చేశాడా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేయనున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం