కడప జిల్లాలో ఓ యువకుడు ఉన్మాదిలా మారాడు..13 ఏళ్ల తమ్ముడిపై విచక్షణా రహితంగా కత్తితో దాడి చేశాడు. అన్న చేతిలో తీవ్రంగా గాయపడిన తమ్ముడి పరిస్థితి విషమంగా ఉండటంతో..వైద్యులు చికిత్స అందజేస్తున్నారు. ఈ సంఘటన జిల్లాలోని పెండ్లిమర్రి మండలం వెల్లటూరు గ్రామంలో చోటు చేసుకుంది. జరిగిన ఘటనతో గ్రామంలో భయానక పరిస్థితులు నెలకొన్నాయి.
వెల్లటూరు గ్రామానికి చెందిన భాస్కర్ రెడ్డి..నరసింహరెడ్డి ఇద్దరూ అన్నాతమ్ముళ్లు, కాగా భాస్కర్ రెడ్డి కుమారుడు రమణారెడ్డి బీటెక్ వరకు చదువుకున్నాడు. కానీ మతిస్థిమితం సరిగా లేకపోవడంతో..తరచూ తండ్రి భాస్కర్‌రెడ్డితో గొడవలు పడుతూ దాడి చేసేవాడు. దీంతో నరసింహరెడ్డి తన అన్న కొడుకైన రమణారెడ్డిని పలు సందర్భాల్లో మందలిస్తూ వచ్చేవాడు. అంతేకాదు, ఒకటీ రెండు సార్లు చెయి కూడా చేసుకున్నట్లుగా తెలుస్తోంది. అదంతా మనసులో పెట్టుకున్న రమణారెడ్డి బాబాయ్‌పై కక్ష పెంచుకున్నాడు. ఈ క్రమంలోనే నరసింహరెడ్డి..కొడుకు నందకిషోర్‌పై తన ప్రతాపం చూపించాడు. ఏడవ తరగతి చదువుతున్న నందకిషోర్‌ను రమణారెడ్డి గొంతుకోసి పరారయ్యాడు. రక్తపు మడుగులో పడివున్న బాధితున్ని హుటాహుటినా కడప రిమ్స్‌కు తరలించి చికిత్స అందజేశారు. ప్రమాదం తప్పి నందకిషోర్ పరిస్థితి నిలకడగా ఉండటంతో తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు. జరిగిన సంఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.