రాష్ట్రపతి ఎన్నికలకు(President Elections) నగారా మోగడంతో అధికార విపక్షాలు తమ అభ్యర్థి ఎంపిక కోసం కసరత్తు ముమ్మం చేశాయి. కాగా.. ప్రతిపక్షాల తరఫున రాష్ట్రపతి అభ్యర్థిని ఎంపిక చేసేందుకు పశ్చిమ్ బంగ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ(Mamata Banerjee) నేతృత్వంలో సమావేశం జరిగింది. ఈ సమావేశానికి తెలుగు రాష్ట్రాల నుంచి ఆహ్వానం అందలేదు. అయితే.. తాజాగా ఆమె రాసిన లేఖ రాజకీయాల్లో సంచలనంగా మారింది. బుధవారం నిర్వహించిన సమావేశానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్.జగన్ ను(AP CM Jagan) ఆహ్వానించారు. దీనికి సంబంధించి మమతా బెనర్జీ ఆమె ఈ నెల 11న లేఖ రాశారు. మన దేశ ప్రజాస్వామ్య పరిరక్షణకు సమర్థవంతమైన ప్రతిపక్షం అవసరమని లేఖలో పేర్కొన్నారు. అన్ని ప్రగతిశీల పార్టీలూ కలిసికట్టుగా వ్యవహరించాల్సిన అవసరం ఉందని కోరారు. ప్రతిపక్షాలన్నీ గొంతు కలపాల్సిన అవసరం ఉందన్న మమతా.. ఇందుకోసం ఈ నెల 15న ఢిల్లీలో జరిగే సమావేశానికి మీరు రావాలని లేఖలో ఆహ్వానించారు. అయితే.. తృణమూల్ కాంగ్రెస్ విడుదల చేసిన అధికారిక ప్రకటనలో 22 పార్టీల నేతల పేర్లలో జగన్‌మోహన్‌రెడ్డి పేరు కనిపించకపోవడంతో ఆయనకు ఆహ్వానం అందలేదని అందరూ అనుకున్నారు. కాగా ఆహ్వాన లేఖ ప్రత్యక్షం కావడం పలు అనుమానాలకు తావిస్తోంది. కావాలనే గైర్హాజరయ్యారా.. లేక రాజకీయ కారణాల వల్ల రాలేకపోయారా అనే సందేహాలు వస్తున్నాయి.
మరోవైపు.. దేశంలోని అన్ని భాజపాయేతర పార్టీలతో చర్చించాలని నిర్ణయించినందున జగన్ వద్దకు మమతాబెనర్జీ ప్రతినిధులను పంపే అవకాశం ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రతిపక్షాల సమావేశంలో తెలుగు రాష్ట్రాల్లోని ఏ ఒక్క పార్టీ పాల్గొనలేదు. మమతాబెనర్జీ ఆహ్వానించని కారణంగా టీడీపీ, ఎంఐఎంలు దూరంగా ఉన్నాయి. కాగా.. రాష్ట్రపతి అభ్యర్థి ఎంపికపై ప్రతిపక్షాల సమావేశంలో కీలక ఘట్టం చోటుచేసుకుంది. మమతాబెనర్జీ ఆధ్వర్యంలో నిర్వహించిన భేటీకి 17 పార్టీల ప్రతినిధులు హాజరయ్యారు. ఎన్సీపీ అధ్యక్షుడు శరద్‌పవార్‌పేరును అన్ని పార్టీల సమ్మతితో మమతాబెనర్జీ ప్రతిపాదించారు. ఆ ప్రతిపాదనను ఆయన సున్నితంగా తిరస్కరించారు. తానింకా క్రియాశీల రాజకీయాల్లో కొనసాగాలనుకుంటున్నట్లు చెబుతూ ఉమ్మడి అభ్యర్థిగా ఇంకెవరినైనా ప్రతిపాదించాలని పవార్ సూచించారు.
మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..