Mahasamprakshan: అమరావతిలో టీటీడీ నిర్మించిన శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయ మహాసంప్రోక్షణ కార్యక్రమాలు జూన్ 4 నుండి 9వ తేదీ వరకు జరుగనున్నాయని, ఇందుకోసం విస్తృతంగా ఏర్పాట్లు చేపట్టాలని టీటీడీ (TTD)ఈవో శ్రీ ఎవి.ధర్మారెడ్డి అధికారులను ఆదేశించారు. మహాసంప్రోక్షణ ఏర్పాట్లపై సోమవారం తిరుపతిలోని శ్రీ పద్మావతి విశ్రాంతి గృహంలో ఈవో అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ.. దూరం నుంచి చూసినా కనిపించేలా ఈ ఆలయం వద్ద శంఖుచక్రనామాలు ఏర్పాటు చేయాలని ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. ఆలయ వైదిక కార్యక్రమాల నిర్వహణకు ఎలాంటి ఆటంకం కలగకుండా పబ్లిక్ అడ్రస్ సిస్టమ్, ఫ్యాన్లు ఏర్పాటు చేయాలన్నారు. ఆలయాన్ని సులువుగా గుర్తించేలా అవసరమైన ప్రాంతాల్లో సైన్‌బోర్డులు ఏర్పాటు చేయాలని సూచించారు. నిరంతరాయంగా విద్యుత్ సరఫరా ఉండేలా చూడాలన్నారు. జూన్ 9న మహాసంప్రోక్షణ రోజు ఎక్కువ మంది భక్తులు వచ్చే అవకాశం ఉండడంతో అన్నప్రసాదాలు, తాగునీరు, మరుగుదొడ్లు, షెడ్లు ఏర్పాటుచేయాలని ఆదేశించారు.
ఆరు రోజుల పాటు జరుగనున్న ఆలయ మహాసంప్రోక్షణ కార్యక్రమాలకు తగినంతమంది అర్చక సిబ్బందిని, ఇతర సిబ్బందిని డిప్యూటేషన్‌పై పంపాలని, ఎలాంటి ఇబ్బందులు లేకుండా బస తదితర ఏర్పాట్లు చేయాలని సూచించారు. పరిసరాలను పచ్చని మొక్కలతో సుందరంగా తీర్చిదిద్దాలని కోరారు. మహాసంప్రోక్షణకు ముఖ్యమైన ప్రముఖులు విచ్చేసే అవకాశం ఉండడంతో తగిన భద్రత ఏర్పాట్లు చేపట్టాలని సూచించారు. ఆలయానికి అవసరమైన ఆభరణాలు అందించాలని సంబంధిత అధికారులను ఈవో ఆదేశించారు. క్యూలైన్ల నిర్వహణ కోసం, భక్తులకు సేవలందించేందుకు శ్రీవారి సేవకుల సేవలను వినియోగించుకోవాలన్నారు. జిల్లా యంత్రాంగంతో సమన్వయం చేసుకుని నిర్ణీత సమయంలోపు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని ఈవో ఆదేశించారు. ఈ సమీక్షలో జెఈవోలు శ్రీమతి సదా భార్గవి, శ్రీ వీరబ్రహ్మం, సివిఎస్వో శ్రీ నరసింహకిషోర్, ఎఫ్ఏసిఏవో శ్రీ ఓ.బాలాజి, చీఫ్ ఇంజినీర్ నాగేశ్వరరావు ఇతర అధికారులు పాల్గొన్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి