ఈ నియోజకవర్గంలో ఎంపీ అభ్యర్థిగా తనయుడికి నో చాన్స్.. మరోసారి ఆయనకే సీటు..

| Edited By: Srikar T

Mar 26, 2024 | 3:00 PM

ఒంగోలు టిడిపి ఎంపిగా మాగుంట శ్రీనివాసులురెడ్డి పోటీ చేసేందుకు టిడిపి అధిష్టానం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. టిడిపి టికెట్‌పై ఒంగోలు ఎంపిగా తన కుమారుడు మాగుంట రాఘవరెడ్డిని పోటీ చేయించేందుకు ఎంపి మాగుంట చివరి నిమిషం వరకు ప్రయత్నించారు.

ఈ నియోజకవర్గంలో ఎంపీ అభ్యర్థిగా తనయుడికి నో చాన్స్.. మరోసారి ఆయనకే సీటు..
Magunta Family
Follow us on

ఒంగోలు టిడిపి ఎంపిగా మాగుంట శ్రీనివాసులురెడ్డి పోటీ చేసేందుకు టిడిపి అధిష్టానం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చింది. టిడిపి టికెట్‌పై ఒంగోలు ఎంపిగా తన కుమారుడు మాగుంట రాఘవరెడ్డిని పోటీ చేయించేందుకు ఎంపి మాగుంట చివరి నిమిషం వరకు ప్రయత్నించారు. అయితే ఢిల్లీ లిక్కర్‌ కేసులో మాగుంట రాఘవరెడ్డి అరెస్ట్, బెయిల్‌పై విడుదల వంటి అంశాలు, తాజాగా ఇదే కేసులో ఢిల్లీ సిఎం అరవింద్‌ కేజ్రీవాల్‌, తెలంగాణా ఎమ్మెల్సీ కవిత అరెస్టులు కావడంతో మాగుంట రాఘవరెడ్డి అభ్యర్ధిత్తంపై టిడిపి అధిష్టానం అంత సుముఖత వ్యక్తం చేయలేదని సమాచారం. తాజాగా ఒంగోలు ఎంపి సీటు ఖరారు చేసే విషయంలో ఎంపి మాగుంట కుటుంబంతో భేటీ అయిన చంద్రబాబు ఈసారి టిడిపి ఎంపిగా మాగుంట శ్రీనివాసులురెడ్డి పోటీ చేయాలని సూచించినట్టు సమాచారం. ఇక విధిలేని పరిస్థితుల్లో టిడిపి నుంచి ఎంపిగా తానే బరిలో దిగేందుకు ఎంపి మాగుంట సుముఖత వ్యక్తం చేసినట్టు చెబుతున్నారు. ఇక అధికారికంగా ఒంగోలు ఎంపి అభ్యర్ధిగా మాగుంట శ్రీనివాసులురెడ్డి పేరును టిడిపి అధిష్టానం ప్రకటించే అవకాశం ఉంది.

చిక్కులు తెచ్చిపెట్టిన ఢిల్లీ లిక్కర్‌ కేసు..

ఒంగోలు వైసిపి సిట్టింగ్‌ ఎంపి మాగుంట శ్రీనివాసులురెడ్డి ఈసారి తన తనయుడు, రాజకీయ వారసుడు మాగుంట రాఘవరెడ్డి ఒంగోలు నంచి పార్లమెంట్‌కు వైసిపి టికెట్‌పై పోటీ చేస్తారని రెండేళ్ళ క్రితమే ప్రకటించారు. ఒంగోలులో వైసిపి ప్లీనరీలో ఈ మేరకు ప్రకటన కూడా చేశారు. అప్పటి నుంచి ఒంగోలు పార్లమెంట్‌ పరిధిలోని అసెంబ్లీ నియోజకవర్గాల్లో పర్యటిస్తూ మాగుంట రాఘవరెడ్డి రాజకీయాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. అయితే అనూహ్యంగా ఢిల్లీ లిక్కర్‌ కేసులో మాగుంట రాఘవరెడ్డితో పాటు ఎంపి మాగుంట శ్రీనివాసులురెడ్డి పేరు కూడా వినిపించింది. ఈ నేపథ్యంలో మాగుంట రాఘవరెడ్డి అరెస్ట్‌ కావడం, బెయిల్‌పై విడుదలవడం అలా జరిగిపోయాయి. మరోవైపు మాగుంట కుటుంబానికి ఈసారి టికెట్‌ లేదని వైసిపి అధిష్టానం ప్రకటించిన నేపధ్యంలో ఫిబ్రవరి 28న ఎంపి మాగుంట వైసిపిపార్టీకి రాజీనామా చేసి ఇటీవల చంద్రబాబు సమక్షంలో టిడిపిలో చేరిపోయారు. టిడిపి నుంచి తన తనయుడు మాగుంట రాఘవరెడ్డిని ఎంపిగా బరిలో దించేందుకు ప్రతిపాదించారు. అయితే ఎంపి అభ్యర్ధుల ఎంపిక విషయంలో బిజెపి, టిడిపి, జనసేన నేతల భేటీలో ఒంగోలు ఎంపిగా మాగుంట రాఘవరెడ్డి పోటీచేసే విషయంలో బిజెపి నుంచి సానుకూలత వ్యక్తం కాలేదట. దీంతో ఒంగోలు ఎంపి టికెట్‌ మాగుంట కుటుంబానికే కేటాయిస్తూ అభ్యర్ధిగా మాత్రం ఈసారికి మాగుంట శ్రీనివాసులురెడ్డినే పోటీ చేయాలని టిడిపి అధిష్టానం సూచించినట్టు తెలిసింది. మాగుంట రాఘవరెడ్డికి పరిస్థితులు అనుకూలంగా లేకపోవడంతో ఈసారి తానే పోటీ చేసేందుకు మాగుంట శ్రీనివాసులురెడ్డి ఒప్పుకున్నట్టు సమాచారం. ఇక నేడో రేపో ఒంగోలు టిడిపి ఎంపి అభ్యర్ధిగా మాగుంట శ్రీనివాసులురెడ్డి పేరును చంద్రబాబు ప్రకటించమే తరువాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..