
ఆంధ్రప్రదేశ్ మచిలీపట్నంలో దారుణం చోటుచేసుకుంది. కోడలిపై మామ కత్తితో దాడి చేశాడు. ఈ దాడిలో తృటిలో తప్పించుకోవడంతో ప్రాణాలతో బయటపడింది కోడలు. తీవ్రంగా గాయపడిన నాగశ్వేతను ఆసుపత్రికి తరలించారు స్థానికులు. అనంతరం దాడి చేసిన మామ సోమరాజును పోలీసులకు అప్పగించారు. ఈ ఘటన స్థానికంవగా కలకలం రేపింది. వివరాల ప్రకారం.. మచిలీపట్నం పరాస్ పేటకు చెందిన ఆకూరి శ్వేతకు వలందపాలెంకు చెందిన వెంకన్న అనే వ్యక్తితో కొన్నేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరి కాపురం కొంతకాలం సజావుగా సాగింది. అయితే కొన్ని రోజులుగా భార్యాభర్తలతో పాటు రెండు కుటుంబాల మధ్య కలతలు మొదలయ్యాయి. పంచాయితీలు సైతం జరిగినట్లు పేర్కొంటున్నారు. ఈ క్రమంలోనే.. గొడవలు తారాస్థాయికి చేరాయి.. దీంతో మామ సోమరాజు ఆమెపై దాడి చేసేందుకు ప్లాన్ చేశాడు..
బుధవారం రాత్రి నాగశ్వేత మామ సోమరాజు మచిలీపట్నం పోలీస్ స్టేషన్ కు కోతవేటు దూరంలోని ఓ మెడికల్ షాపు ఎదుట పదునైన కత్తితో ఆమెపై దాడి చేశాడు. ఆమెను హత్య చేసేందుకు తలపై బలంగా నరికాడు. శ్వేత చేయి అడ్డుపెట్టుకోవడంతో చేతితోపాటు తలకు బలమైన గాయాలయ్యాయి. ఈ సంఘటనను ప్రత్యక్షంగా చూసిన స్థానికులు సోమరాజును పట్టుకుని చితకబాదారు. ఆ తర్వాత పోలీసులకు అప్పగించారు. బాధితురాలు శ్వేతను మచిలీపట్నంలోని సర్వజన ఆస్పత్రిలో చేర్పించారు.
అయితే.. నాగశ్వేత మెడికల్ షాపు సమీపంలో నివాసం ఉంటున్నట్లు పేర్కొంటున్నారు.. కుటుంబ కలహాల నేపథ్యంలోనే ఈ దాడి జరిగినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి.. దర్యాప్తు చేస్తున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..