Kollu Ravindra gets Bail మాజీ మంత్రి టీడీపీ నేత కొల్లు రవీంద్రకు బెయిల్ మంజూరైంది. నిన్న ఎన్నికల విధుల్లో ఉన్న ఒక పోలీస్ అధికారిని నెట్టడంతోపాటు, ఎన్నికల విధులకు ఆటంకం కలిగించారనే ఆరోపణల కింద ఆయనపై కేసు నమోదైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇవాళ ఆయనకు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఈ కేసుకు సంబంధించి గురువారం ఉదయం కొల్లు రవీంద్రను పోలీసులు అరెస్ట్ చేశారు. విధి నిర్వహణలో ఉన్న ఎస్‌ఐపై చేయి చేసుకున్నారంటూ కొల్లు రవీంద్రపై కేసు నమోదైంది. ఆయనను ఇనుకుదురు పీఎస్‌కు పోలీసులు తరలించారు. కొల్లు రవీంద్రపై 506, 341, 188 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. కొల్లు రవీంద్ర బుధవారం పోలింగ్ సెంటర్ వద్ద వీరంగం సృష్టించిన సంగతి విదితమే. ఓటింగ్ ప్రక్రియను అడ్డుకునేందుకు ప్రయత్నించడంతో పాటు, తనను పోలింగ్ కేంద్రంలోకి వెళ్లకుండా అడ్డుకున్నందుకు ఏకంగా విధుల్లో ఉన్న ఎస్‌ఐపై చేయి చేసుకున్నారు.
కాగా, నిన్న మచిలిపట్నం 25వ డివిజన్ సర్కిల్‌పేటలోని పోలింగ్ కేంద్రానికి టీడీపీ నేత కొల్లు రవీంద్ర, మరి కొందరి కార్యకర్తలతో కలిసి వచ్చారు. తాను లోపలికి వెళ్లి పోలింగ్ సరళిని పరిశీలించాలంటూ కోరారు. దాంతో అక్కడ విధులు నిర్వహిస్తున్న పోలీసులు 144 సెక్షన్ అమల్లో ఉందని.. లోపలికి వెళ్లడానికి కుదరదని కొల్లు రవీంద్రకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో కొల్లు రవీంద్ర.. పోలీసులపై విరుచుకుపడ్డాడు.. ‘చంపుతావా.. చంపు’ అంటూ ఎస్‌ఐ మీదకు వెళ్లాడు. వారిని వెనక్కి నెట్టాడు. ఈ క్రమంలో పోలీసులు ఆయన్ను అరెస్ట్ చేసి కేసు నమోదు చేశారు.
కాగా, కొల్లు రవీంద్ర అరెస్టుతో మచిలీపట్నంలో తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. రవీంద్ర నివాసానికి టీడీపీ శ్రేణులు భారీగా చేరుకుంటున్నారు. రవీంద్ర అరెస్టు కారణంగా మచిలీపట్నంలో టెన్షన్ వాతావరణం నెలకొనడంతో పోలీసులు భారీగా చేరుకుంటున్నారు. ఎలాంటి అల్లర్లు చోటు చేసుకోకుండా ముందు జాగ్రత్తగా పోలీసులు చర్యలు చేపడుతున్నారు. రవీంద్రను పోలీసులు అరెస్టు చేయడం మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్రంగా ఖండించారు. ముఖ్యమంత్రి బీసీ వ్యతిరేకి.. బీసీలను పండగ రోజు సంతోషంగా ఉండనివ్వడం లేదంటూ మండిపడ్డారు. వెంటనే కొల్లు రవీంద్రను విడుదల చేయాలని చంద్రబాబు డిమాండ్ చేసిన సంగతి తెలిసిందే.