దేశ వ్యాప్తంగా లోక్‌సభ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల అయ్యింది. లోక్‌సభ ఎన్నికలతోపాటు, నాలుగు రాష్ట్రాల అసెంబ్లీలకు ఎన్నికలు జరగనున్నాయి. 7 విడతల్లో జరిగే లోక్‌సభ ఎన్నికలు ఏప్రిల్ 19 నుంచి మొదలు కానున్నాయి. ఏప్రిల్ 19న అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలతో పాటు లోక్‌సభ ఎన్నికలు ప్రారంభమువుతాయి.
ఈ క్రమంలోనే తెలుగు రాష్ట్రాలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో ఒకే రోజున మే 13న లోక్‌సభ ఎన్నికలు జరుగనున్నాయి. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలతో పాటు లోక్‌సభ స్థానాలకు పోలింగ్ జరుగనుంది. రాష్ట్రంలోని మొత్తం 175 అసెంబ్లీ స్థానాలకు, 25 లోక్‌సభ స్థానాలకు ఒకే రోజు పోలింగ్ నిర్వహిస్తారు. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. ఇటు తెలంగాణలో లోక్‌సభ ఎన్నికలకు మే13వ తేదీన పోలింగ్ నిర్వహిస్తారు. తెలంగాణలో ఇటీవలే అసెంబ్లీ ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. కాగా, దేశవ్యాప్తంగా ఏడు విడుతల్లో పోలింగ్ పూర్తి అయ్యాక, జూన్ 4న కౌంటింగ్ నిర్వహించనున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్ రాజీవ్ కుమార్ వెల్లడించారు. మరోవైపు ఎన్నికల షెడ్యూల్ వెలువడిన నేపథ్యంలో దేశ వ్యాప్తంగా ఎన్నికల నియమావళి అమల్లోకి వచ్చింది.
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, లోక్‌సభతోపాటు తెలంగాణ లోక్‌సభ ఎన్నికలు మే 13వ తేదీన జరుగుతాయని కేంద్ర ఎన్నికల సంఘం తెలిపింది. రెండు రాష్ట్రాలకు సంబంధించిన ఎన్నికల నోటిఫికేషన్ ఏప్రిల్ 18వ తేదీన వెలువడుతుంది. ఏప్రిల్ 25 వరకూ నామినేషన్లు దాఖలు చేసుకునేందుకు అనుమతిస్తారు. ఏప్రిల్ 26న నామినేషన్ల పరీశీలన జరుగుతుంది. ఏప్రిల్ 29న నామినేషన్ల ఉపసంహరణకు గడువు విధించారు. మే 13వ తేదీన ఎన్నికల పోలింగ్ జరుగుతుంది. ఇక దేశవ్యాప్తంగా లోక్‌సభ పోలింగ్ ముగిసిన తర్వాత, జూన్ 4వ తేదీన కౌంటింగ్ ఉంటుంది. అదే రోజు తుది ఫలితాలను వెల్లడిస్తారు. జూన్ ఆరు నాటికి ఎన్నికల ప్రక్రియ పూర్తవుతుంది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…