
మందుబాబులకు బిగ్ అలర్ట్.. జనవరి 26న దేశవ్యాప్తంగా గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరగనున్నాయి. ప్రభుత్వ కార్యాలయాలు, ప్రైవేట్ ఆఫీసులు, కాలేజీలు, స్కూళ్లల్లో మువ్వెన్నల జెండా రెపరెపలాడనుంది. అన్నీ చోట్ల త్రివర్ణ పతాకాలు ఎగురవేసి స్వీట్లు పంచుకోనున్నారు. భారత రాజ్యంగం అమల్లోకి వచ్చిన సందర్భగా జనవరి 26న ప్రతీ ఏడాది రిపబ్లిక్ డే జరుపుకుంటున్నాం. ఈ వేడుకల క్రమంలో తెలుగు రాష్ట్రాల్లో మద్యం షాపులను మూసివేయాలని ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు నిర్ణయించాయి. దీంతో సోమవారం రెండు తెలుగు రాష్ట్రాల్లోని మద్యం దుకాణాలన్నీ మూతపడనున్నాయి. వైన్ షాపులతో పాటు బార్లు, పబ్బులు, క్లబులు, రెస్టారెంట్లలో మద్యం విక్రయాలు బంద్ కానున్నాయి. రిపబ్లిక్ డే సందర్భంగా రేపు డ్రై డేగా ప్రభుత్వాలు ప్రకటించాయి. వేడుకలు సజావుగా జరిగేలా చూడటం, శాంతి భద్రతలు కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నారు.
గణతంత్ర దినోత్సవం సందర్భంగా సోమవారం ఎలాంటి ఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలో భాగంగా మద్యం దుకాణాలను మూసివేయాలని రెండు రాష్ట్రాల ఎక్సైజ్ శాఖలు ప్రకటన విడుదల చేశాయి. ఎవరైనా నిబంధనలను ఉల్లంఘించి మద్యం షాపులను ఓపెన్ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించాయి. ఈ నిబంధనలు వైన్ షాపులతో పాటు బార్లు, పబ్బులు, క్లబ్‌లు, రెస్టారెంట్లకు వర్తిస్తాయని పేర్కొంది. దీంతో వైన్ షాపుల యజమానులు రేపు మద్యం షాపులు క్లోజ్ చేసి ఉంటాయంటూ నోటీసులు ఏర్పాటు చేశారు. రిపబ్లిక్ డే సందర్భంగా సోమవారం మద్యం దుకాణాలు మూసివేస్తున్నామని, తిరిగి మంగళవారం తెరుచుకుంటాయంటూ షాపు ముందు బోర్డులు పెడుతున్నారు.
స్వాతంత్ర, గణతంత్ర దినోత్సవం, గాంధీ జయంతి లాంటి ప్రాముఖ్యత కలిగిన రోజుల్లో మద్యం విక్రయాలు ప్రతీ ఏడాది నిలిపివేస్తారు. ఈ వేడుకలను హుందాగా జరుపుకోవాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం అమలు చేస్తున్నారు. దీంతో సోమవారం మద్యం దుకాణాలు మూతపడనుండగా.. తిరిగి మంగళవారం ఉదయం 10 గంటలకు తెరుచుకుంటాయి. ఇక పలు రాష్ట్రాల్లో రేపు మాంసం దుకాణాలు కూడా బంద్ కానున్నాయి. అలాగే హోటళ్లల్లో నాజ్ వెజ్ విక్రయాలు ఆపివేయనున్నారు.