Visakhapatnam: విశాఖలో పెరుగుతున్న భూమి విలువ.. స్మశానాల్లో కూడా ఇల్లులు.. అక్రమాలు చెక్ పెట్టేదిశగా కొత్త వ్యవస్థ

Visakhapatnam: విశాఖలో పలు మురుగు కాలువలు ప్రస్తుతం కనపడడం లేదు. వీటిల్ని విశాఖలో గెడ్డ లు అంటారు. గతంలో ఈ గెడ్డలపై కొన్ని చోట్ల షెడ్ల లాంటి నిర్మాణాలు ఉండేవి, కానీ ప్రస్తుతం షెడ్ల దశ దాటి పెద్ద పెద్ద..

Visakhapatnam: విశాఖలో పెరుగుతున్న భూమి విలువ.. స్మశానాల్లో కూడా ఇల్లులు.. అక్రమాలు చెక్ పెట్టేదిశగా కొత్త వ్యవస్థ
Visakhapatnam
Follow us

|

Updated on: Apr 17, 2022 | 9:24 PM

Visakhapatnam: విశాఖలో పలు మురుగు కాలువలు ప్రస్తుతం కనపడడం లేదు. వీటిల్ని విశాఖలో గెడ్డ లు అంటారు. గతంలో ఈ గెడ్డలపై కొన్ని చోట్ల షెడ్ల లాంటి నిర్మాణాలు ఉండేవి, కానీ ప్రస్తుతం షెడ్ల దశ దాటి పెద్ద పెద్ద భవంతులు(Buildings నిర్మితమవుతుండడంతో అసలు అవి ఎక్కడ ఉన్నాయో వెతకాల్సిన పరిస్థితి అధికారులకు వచ్చింది. ఒక్క గెడ్డలే కాదు, కొన్ని చెరువులు కూడా వాటి రూపు రేఖలను కోల్పోయాయి. ఇక స్మశానాల సంగతి సరేసరి, స్మశానల్లో కూడా ఇల్లు వెలుస్తున్నాయి. దీంతో వీటన్నింటికి చెక్ పెట్టాలని నిర్ణయించారు అధికారులు. అందుకోసం కొత్త ఆడిట్ వ్యవస్థను రూపొందించారు. ఆ వ్యవస్థ ఏంటి, ఎలా పనిచేయబోతోందో పూర్తి వివరాలను తెలుసుకుందాం..

విశాఖ లో ఇప్పడని కాదు కానీ మొదటినుంచి భూమి విలువ చాలా ఎక్కువ. ఒకవైపు సముద్రం, మరోవైపు ఎత్తైన కొండ ప్రాంతాల మధ్య ఉండడంతో సాధారణంగానే భూ విస్తీర్ణం చాలా తక్కువ. దీంతో భూములకు విపరీతమైన డిమాండ్ ఉంటుంది. ఇక ఈ మధ్య ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పరిపాలనా రాజధానిగా కూడా చేస్తామన్నారు కాబట్టి ఇంకాస్త డిమాండ్ పెరిగింది. భూములకు అలా విలువ పెరగడంతో ఆక్రమణలు పెరిగిపోయాయి. అవి ప్రైవేట్ స్థలాల ను దాటి ప్రభుత్వ స్థలాలను సైతం కబ్జా చేసే పరిస్థితి ఎప్పటినుంచో ప్రారంభం అయింది. తాజాగా ఆ వ్యవహారాలు మరింత ఊపందుకున్నాయి. ఖాళీ ప్రాంతం కనిపిస్తే చాలు అక్రమ నిర్మాణాలు వెలుస్తున్నాయి. కొన్నిచోట్ల ప్రైవేటు స్థలాలను ఆనుకొని ఉన్న ప్రభుత్వ స్థలాలపై కన్నేసి తమ స్థలాల్లో కలిపేసుకుంటున్నారు. ఇలాంటి పరిస్థితి విశాఖ శివారు ప్రాంతం అంతా ఉంది. మిగతా ప్రాంతాలకంటే ఇప్పుడు ఎండాడ రెవెన్యూ గ్రామంలో ఇలాంటి ఫిర్యాదులు ఎక్కువ అందుతున్నాయి. ఇక్కడ చెరువులు, గెడ్డలు ఆక్రమణకు గురవుతున్నాయి. సుప్రీంకోర్టు ఉత్తర్వుల ప్రకారం చెరువుల్లో నిర్మాణాలు చేపట్టకూడదు. ఎండాడలో మాత్రం ఇందుకు భిన్నమైన పరిస్థితి కనిపిస్తోంది.

జీవీఎంసీ పరిధి ఎండాడ సర్వే నంబరు 67లోని చెరువులో ఏకంగా సిమెంటు రోడ్ల నిర్మాణాలు జరిగాయి. ఓ భవంతికి రాకపోకలకు వీలుగా చదును చేసి రోడ్డు వేశారు. భవనానికి సంబంధించిన కొంత నిర్మాణం అందులోనే ఉంది. సాధారణ రహదారిని తలపించేలా దాని స్వరూపాన్ని మార్చేశారు. నీరు నిల్వ ఉండడానికి వీలు లేకుండా మెరక చేసి మరీ రోడ్డు నిర్మించేశారు. గతంలో అనుసంధానంగా ఉండే గెడ్డల నుంచి నీరు చెరువులోకి నీరు వచ్చేది. ప్రస్తుతం అవన్నీ మూసుకుపోవడంతో పాటు మధ్యలో రోడ్డు కూడా నిర్మించడంతో చెరువు నామరూపాల్లేకుండా పోయింది. రెవెన్యూ రికార్డుల ప్రకారం మొత్తం 1.62 ఎకరాల్లో ఉండాల్సిన ఈ జలవనరుకు దక్షిణ వైపు సుమారు 480 గజాల మేర ఆక్రమణకు గురైంది. బహిరంగ మార్కెట్లో దాని ప్రస్తులు విలువ సుమారు రూ.3 కోట్ల వరకు ఉంటుంది. ఇదే చెరువులో 13 సెంట్ల స్థలంపై కల్వర్టు కట్టి రోడ్డు నిర్మించుకోవచ్చని గతంలో కలెక్టరు అనుమతించారు. అయితే నిబంధనలకు విరుద్ధంగా నీరు ప్రవహించడానికి వీలు లేకుండా కీర రాళ్లు, మట్టితో కప్పేయడంతో చెరువు మరింత బక్కచిక్కింది. దీంతో అక్కడ ఇపుడు ఇక్కడ నీరు వెళ్లేందుకు వీలుగా కల్వర్టునిర్మాణం జరగలేదు. ఇటీవల రెవెన్యూ అధికారులు ఈ చెరువు స్థలం ఆక్రమణకు గురైనట్లు గుర్తించారు. అందులో సుమారు పది సెంట్లలో నిర్మాణాలున్నాయని స్వయంగా భీమిలి ఆర్డీవో తెలిపారు. ఇటీవల దీనిపై పలు ఆరోపణలు రావడంతో కలెక్టర్ విచారణకు ఆదేశించారు. దీంతో అక్రమాలు వెలుగు చూశాయి.

దీంతో చెరువులు, గడ్డలు, స్మశానల తో పాటు ప్రభుత్వ భూముల విషయంలో సరైన ఆడిటింగ్ వ్యవస్థను ఏర్పాటు చేయాలని జిల్లా అధికార యంత్రాంగం నిర్ణయించింది. క్షేత్ర స్థాయి సిబ్బంది నిరంతరం వీటిని ప్రత్యక్షంగా సందర్శించే విధంగా కార్యాచరణను రూపిందించింది. స్థానిక విఆర్వో, ఎమ్మార్వో లకు ఈ బాధ్యత అప్పగించింది. ఆయా ప్రాంతాల్లో ఉండే రెవిన్యూ క్షేత్ర సిబ్బంది రోజూ ఏదో ఒకసమయంలో వాళ్ళ పరిధిలోని ప్రభుత్వ భూములను సందర్శించాలి. వారానికి ఒకసారి వీటి స్థితిగతులపై నివేదిక ఇవ్వాలి. ఈ తరహా ఓరియెంటెషన్ ను సిబ్బంది లో నింపడానికి ప్రత్యేక శిక్షణాతరగతులను నిర్వహించాలని నిర్ణయించినట్టు అధికారులు తెలుపుతున్నారు.

ఈ చెరువులు, గెడ్డలు, స్మశానాలు అక్రమించుకుంటున్న వారిలో ఎక్కువగా అధికార పార్టీ నేతలతో పాటు అన్ని పార్టీల నేతలు ఉండడంతో వీటిపై ఇక నిరంతర పర్యవేక్షణ లేకపోతే వీటిని కాపాడడం సాధ్యం కాదన్న ఆలోచనకు వచ్చారు అధికారులు. ఈ నేపధ్యంలోనే క్షేత్ర స్థాయి పర్యవేక్షణ కమిటీలు వేసి అన్ని స్థాయిల్లో నిరంతరం మోనిటర్ చేయాలని తలపెట్టారు.

Reporter: Eswar , TV9 Telugu

Read Also: Chanakya Niti: జీవితంలో ఆర్ధిక కష్టాలు రాకూడదంటే ఈ విషయాలను గుర్తుంచుకోమంటున్న చాణక్య