విశాఖలో హత్యాయత్నం కేసులో మహిళా ఎస్ఐ నాగమణిని అరెస్ట్ చేశారు పోలీసులు. ఆమెతోపాటు మహిళా మెజిస్ట్రేట్ కారు డ్రైవర్ అప్పల రెడ్డిని కూడా కటకటాల వెనక్కు నెట్టారు. ఈ కేసులో ఇప్పటి వరకు పది మందిని అరెస్ట్ చేశారు పోలీసులు. మహిళా ఎస్ఐ సోదరి అయిన మహిళా మేజిస్ట్రేట్‌కు సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగా పోలీసులు నోటీసులు అందజేశారు. జూన్ 18న రియల్టర్ రాజేష్ పై హత్యాయత్నం జరిగింది.
రియల్టర్ రాజేష్ పై హత్యాయత్నానికి పురిగొల్పారన్న ఆరోపణలపై నమోదైన కేసులో విశాఖలోని మహారాణిపేట పోలీసులు క్రైమ్ ఎస్ఐ నాగమణిని అరెస్ట్ చేశారు. భీమిలి మేజిస్ట్రేట్ వ్యక్తిగత డ్రైవర్ అప్పుల రెడ్డిని కూడా అరెస్ట్ చేసి పోలీసులు రిమాండ్ కు తరలించారు. ఎస్సై నాగమణి.. మహిళా మెజిస్ట్రేట్ స్వయానా అక్కచెల్లెళ్ళు. మహారాణిపేట లోని అఫీషియల్ కాలనీకి చెందిన రాజేష్ రియల్ ఎస్టేట్ వ్యాపారి. ఓ మహిళా మేజిస్ట్రేట్ తో అతనికి విభేదాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో జూన్ 18న టూ వీలర్ పై వెళ్తున్న రాజేష్ పై కలెక్టరేట్ డౌన్ లో దాడి జరిగింది. గాయాలతో ఆసుపత్రిలో చేరిన రాజేష్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అనుమానాస్పద కేసుగా నమోదు చేసిన పోలీసులు ఆ తర్వాత హత్యాయత్నం కేసుగా తేల్చారు. ఈ కేసులో మహిళా మేజిస్ట్రేట్‌తో పాటు, ఎస్సై నాగమణి, కానిస్టేబుల్ ప్రమోద్ కుమార్ సహా.. పలువురిపై కేసు నమోదు అయింది.
తన చెల్లెలు ఎస్ఐ నాగమణి సహకారంతో.. రాజేష్ పై దాడి చేయించినట్లు పోలీసులు విచారణలో తేలింది. ఇందుకు ఆనందపురం క్రైమ్ కానిస్టేబుల్ ప్రమోద్ కుమార్ సహకరించాడు. వీరికి.. తరుణ్ కుమార్, రాజు, అప్పలరాజు, క్రాంతి కుమార్, జ్యోతి రఘునాథ్, మహేష్ అలియాస్ ఎలక, హరి అలియాస్ ఫకీర్ లను మొబిలైజ్ చేసి హత్యాయత్నం చేసినట్టు పోలీసుల విచారణలో తేలింది. ఈ కేసులో ఇప్పటికే ఎనిమిది మందిని అరెస్ట్ చేసిన పోలీసులు.. పరారీలో ఉన్న ఎస్ఐ నాగమణి, మహిళా మెజిస్ట్రేట్ కారు డ్రైవర్ అప్పల రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. దీంతో ఈ కేసులో అరెస్టు అయిన వారి సంఖ్య పదికి చేరింది. సుప్రీంకోర్టు ఆదేశాలతో మహిళా మేజిస్ట్రేట్ కు నోటీసులు అందజేశారు పోలీసులు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..