Home minister Sucharita on Lokesh comments : కర్నూలు జిల్లాలో జరిగిన హత్యలు వ్యక్తిగత కక్షల వల్లే జరిగాయని ఆ ప్రాంత ప్రజలే చెపుతున్నారని రాష్ట్ర హోంమంత్రి సుచరిత అన్నారు. పాణ్యం నియోజకవర్గం గడివేముల మండలం పెసరవాయిలో హత్యకు గురైన టిడిపి నాయకులు వడ్డు నాగేశ్వర రెడ్డి, వడ్డు ప్రతాప్ రెడ్డిల హత్యలతో నారా లోకేశ్ శవ రాజకీయాలు చేస్తున్నారని ఆమె మండిపడ్డారు. తెలుగుదేశం పార్టీ ప్రజా విశ్వాసాన్ని కోల్పోయిందని.. అందుకే ఏం చేయాలో అర్థంకాక సీఎం వైయస్ జగన్మోహన్ రెడ్డిపై ఏకవచన ప్రయోగం చేసే సాహసాన్ని లోకేష్ చేశారని ఆమె చెప్పుకొచ్చారు.
వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 30 మంది టీడీపీ కార్యకర్తలను హత్య చేశారంటూ నారా లోకేశ్ చేసిన వ్యాఖ్యలపై హోం మంత్రి మండిపడ్డారు. గత టీడీపీ ప్రభుత్వ హయాంలో 30కి పైగా రాజకీయ హత్యలు జరిగాయని.. అప్పుడు ఏపీలో ఏ రాజ్యాంగం నడిచిందో చంద్రబాబు, నారా లోకేశ్ చెప్పాలని సుచరిత డిమాండ్ చేశారు.
ఇలాఉండగా, ఇంతకు ముందెన్నడూ లేని రీతిలో టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ జగన్ ప్రభుత్వంపై నిన్న తీవ్ర స్థాయిలో కామెంట్లు చేసిన సంగతి తెలిసిందే. కర్నూలు జిల్లా పాణ్యం నియోజకవర్గం గడివేముల మండలం పెసరవాయిలో హత్యకు గురైన టిడిపి నాయకులు వడ్డు నాగేశ్వర రెడ్డి, వడ్డు ప్రతాప్ రెడ్డిల పార్థివదేహాలకు నివాళులర్పించి, వారి కుటుంబ సభ్యులను పరామర్శించి, అంత్యక్రియల్లో పాల్గొన్న అనంతరం లోకేష్ మీడియాతో మాట్లాడారు. వడ్డు ఫ్యామిలీకి పార్టీ అన్నీ విధాలా అండగా ఉంటుందని చెప్పారు.