Rayalaseema Upliftment Project: ఆంధ్రప్రదేశ్ – తెలంగాణ రాష్ట్రాల మధ్య కృష్ణా జలాల వివాదం రోజురోజుకీ తీవ్రమవుతున్న నేపథ్యంలో ఏపీ బీజేపీ రంగంలోకి దిగబోతోంది. ఇరు తెలుగు రాష్ట్రాల మధ్య వివాదాస్పదంగా మారిన రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టు విషయానికి సంబంధించి రేపు కర్నూలులో సీమ బీజేపీ నేతలు సమావేశం కాబోతున్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు నేతృత్వంలో ఈ సమావేశం జరుగనుంది. రాయలసీమ నీటి వాటా, రెండు రాష్ట్రాల్లో నిర్మితమవుతున్న ప్రాజెక్టులు, నిరుద్యోగ సమస్యపై ఈ సమావేశంలో బీజేపీ నేతలు చర్చించనున్నారు.
రాయలసీమ బీజేపీ నేతల సమావేశానికి సంబంధించిన వివరాలను ఏపీ బీజేపీ రాష్ట్ర కార్యదర్శి రమేష్ నాయుడు వెల్లడిస్తూ పనిలో పనిగా రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలపై విమర్శలు గుప్పించారు. “సీఎం కేసీఆర్‌ను ఆలింగనం చేసుకుని రెండు రాష్ట్రాల మధ్య సమస్యలు లేకుండా చూస్తాం అని జగన్ చెప్పారు. రాయలసీమ వారికి అన్యాయం జరగదని కేసీఆర్ చెప్పినందుకు ఆనందించాం. కానీ.. కేసీఆర్ రాయలసీమకు నీటి వాటా దక్కకూడదని వ్యవహరిస్తున్నారు. ప్రజలంతా కేసీఆర్ వైఖరి చూసి అవక్కవుతున్నారు.” అని రమేష్ నాయుడు చెప్పుకొచ్చారు.
కేసీఆర్, జగన్ రెండు గంటలు కూర్చుంటే సమస్య పరిష్కారమవుతుందని.. రాజకీయ ప్రయోజనాల కోసం నీటి పంచాయితీ తీసుకువచ్చారని రమేష్ నాయుడు విమర్శించారు. జగన్ తన ఆస్తులను కాపాడుకోవడం కోసం.. షర్మిల రాజకీయ జీవితం కోసం రాయలసీమ ప్రయోజనాలు తాకట్టు పెడుతున్నారని రమేష్ ఆవేదన వ్యక్తం చేశారు. వీటన్నిటితో దివంగత వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆత్మఘోషిస్తుందని ఆయన వ్యాఖ్యానించారు.
హైదరాబాద్‌కు వెళ్లే అంబులెన్స్ అడ్డుకుంటే సీఎం జగన్ మాట్లాడలేదు.. నీటి వాటా అడ్డుకుంటే మాట్లాడటం లేదు అని రమేష్ నాయుడు విమర్శించారు. రాష్ట్ర సమస్యలు, రాయలసీమ సమస్యలపై బీజేపీ పోరాడుతుందన్న ఆయన, సొంత ప్రయోజనాల కోసం కాకుండా రాష్ట్ర ప్రయోజనాల కోసం జగన్ పనిచేయాలన్నారు. (జూలై 8) ఇవాళ రాజశేఖర్ రెడ్డి జయంతి సందర్భంగా బీజేపీ తరపున వైఎస్ఆర్‌కు అంజలి ఘటించామని రమేష్ నాయుడు తెలియజేశారు.
Read also: Murder mystery: నెల్లూరులో దారుణహత్యకు గురైన సునీల్ మర్డర్ కేసు మిస్టరీ బయటపెట్టిన పోలీసులు