Kurnool district: ఏపీలోని కర్నూలు జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. జిల్లాలోని డోన్ మండలం ఉడుములపాడు గ్రామంలో కుటుంబ కలహాలతో వివాహిత నెల రోజుల చంటి బిడ్డతో సహా ఆత్మహత్య చేసుకుంది. ఊరి చివరలో ఉన్న బావిలో దూకి బలవన్మరణానికి పాల్పడింది. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. సోమవారం ఇంటి దగ్గర తల్లీబిడ్డ కనబడక పోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు. వెంటనే బంధువుల ఇళ్ల దగ్గర ఆరా తీశారు. అయినప్పటికీ ప్రయోజనం లేకపోవడంతో ఊరు మొత్తం గాలించారు. ఈ క్రమంలో చెరువు ప్రాంతంలోని బావిలో చూడగా ఇద్దరూ నీటిలో విగతజీవులుగా కనిపించారు. గ్రామస్థులు, కుటుంబసభ్యులు అక్కడికి చేరుకొని బావిలో నుంచి మృత దేహాలను బయటకు తీశారు.
అనంతరం బేతంచెర్లలోని భర్త ఇంటికి తరలించారు. తల్లి బిడ్డ ఆత్మహత్య పై కుటుంబ సభ్యులు ఎవరూ కూడా స్పందించకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది డోన్ పట్టణ పోలీసులు పేర్కొన్నారు. భర్త వేధింపులతోనే ఆమె ఆత్మహత్య చేసుకుందా..? లేక ఇంకేదేమైనా కారణం ఉందా అనే దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. మృతదేహాలను స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చరసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. చంటిబిడ్డతో మహిళ ఆత్మహత్య చేసుకోవడంతో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.
-నాగిరెడ్డి, టీవీ9 తెలుగు రిపోర్టర్, కర్నూలు
Also Read: