
కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలం ఎర్రకోట గ్రామ శివారులో ఉన్న ఓ పొలంలో ఈ నెల 23 వ తేదీ ఓ మృతదేహం లభ్యం కాగా,ఆ హత్య కేసును ఇటీవల పోలీసులు ఛేదించారు. వివరాల్లోకి వెళితే.. ఎమ్మిగనూరు పట్టణంకు చెందిన పద్మకు పెద్దనెలాటూరు గ్రామానికి చెందిన నరేంద్రకు తొమ్మిది సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. వీరికి ముగ్గురు సంతానం ఉన్నారు. అయితే భర్త నరేంద్ర పని కోసం వేరే ప్రాంతానికి వెళ్లడంతో.. అదే గ్రామానికి చెందిన వంశీ అనే యువకుడుతో భార్య వివేహతర సంబంధం పెట్టుకుంది. ఈ విషయం తెలుసుకున్న భర్త నరేంద్ర ఎన్నో సార్లు భార్య పద్మను మందలించినా, పెద్దల సమక్షంలో పంచాయతీ చేసినా, భార్య ప్రవర్తనలో మాత్రం ఎలాంటి మార్పు రాలేదు. దీంతో నరేంద్ర భార్యతో పాటు తన కాపురాన్ని ఎమ్మిగనూరుకు మార్చారు.
అయితే అక్కడికి వెళ్లినా భార్య తన ప్రియుడితో సంబంధాన్ని కొనసాగిస్తూనే ఉంది. భర్త పనికి వెళ్లిన వెంటనే ప్రియుడిని ఇంటికి పిలిపించుకోవడం చేసేది. ఇదే విషయంపై భార్యభర్తల మధ్య గొడవలు మొదలయ్యాయి. చివరకు అవి విడాకుల వరకు వెళ్లారు. అయితే నరేంద్ర మాత్రం తాను కాపురం చేయాలని భార్యను కోరగా.. భర్త ఉన్నంత కాలం తన ప్రియుడితో సుఖంగా ఉండలేమని భావించిన భార్య భర్తను హత్య చేసేందుకు ప్రియుడితో కలిసి ప్లాన్ చేసింది. చంపిన ఆనవాళ్లు కనపడకుండా ఎలా చేయాలో వెబ్‌సిరీస్ చూసి ప్లాన్ చేసుకుంది.
ఇక పథకం ప్రకారం ప్రియుడితో కలిసి నిద్రిస్తున్న భర్తను గొంతునులిమి హత్య చేసింది. తర్వాత మృతదేహాన్ని ఊరి శివారులో ఉన్న పోలాల్లోకి తీసుకెళ్లి పెట్రోల్ పోసి కాల్చేసింది. మరుసటి ఉదయం పొలంలో కాలిన స్థితిలో ఉన్న మృతదేహాన్ని గుర్తించిన గ్రామస్తులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. వివాహేతర సంబంధం కారణంగా భార్యే ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసినట్టు పోలీసులు నిర్దారణకు వచ్చారు. దీంతో ఇద్దరిని అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.