Kondaveedu Museum: అలనాటి రాజులకు చెందిన జ్ఞాపకాలను.. వారి చరిత్రను భావి తరాలకు అందించే దిశగా కొంతమంది ప్రయత్నాలు చేస్తున్నారు. మ్యూజియం ఏర్పాటు చేసి.. వారి వస్తువులను, అప్పుడు వాడిన పరికరాలను, పనిముట్లను ఇలా అనేక వాటిని ప్రదర్శన శాలలో పెట్టి.. ప్రస్తుతం తరానికి తెలిసేలా చేస్తున్నారు. తాజాగా కొండవీడు రెడ్డి రాజుల వారసత్వ ప్రదర్శనశాలలో రెండు ఫిరంగి గుండ్లు, ఒక ఖడ్గం, దారు కుంభం లాను ఏపీ మద్య విమోచన ప్రచార కమిటీ రాష్ట్ర చైర్మన్ వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి ప్రదర్శనకు ఉంచారు. ఇటీవల నరసరావుపేటకు చెందిన శ్రీ వెంకట్ రెడ్డి ప్రాచీన ఖడ్గాన్ని, చెక్క కుండను ప్రదర్శన శాలకు అందించారు. కొండవీడు కోట సమీపంలో ఉన్న పుట్టకోటకి చెందిన రైతు శ్రీ పల్నాటి గురవయ్య ప్రాచీన కాలపు రెండు రాతి ఫిరంగి గుళ్ళు లభ్యమవగా వాటిని కొండవీడు కోట అభివృద్ధి కమిటీ కన్వీనర్ కల్లి శివారెడ్డి కి అందజేశారు. ఈ మూడు పురాతన వస్తువులను ఏపీ మద్య విమోచన ప్రచార కమిటీ రాష్ట్ర చైర్మన్ వల్లంరెడ్డి లక్ష్మణరెడ్డి చేతుల మీదుగా ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా లక్ష్మణరెడ్డి మాట్లాడుతూ ప్రాచీన శిల్పకళా సంపదను ఎవరి దగ్గర ఉన్న వాటిని వస్తు ప్రదర్శనశాలకు అందజేస్తే.. వాటిని కలకాలం భద్రపరచి భవిష్యత్ తరాలకు మన వారసత్వ సంపదను అందించగలమని తెలిపారు. వస్తు ప్రదర్శనశాల మొత్తం 30 వేల చదరపు అడుగుల తో మూడు అంతస్తులుగా, ఒక్కొక్క అంతస్తు10 వేల చదరపు అడుగులతో నిర్మించబడింది. మొదటి అంతస్తులో శిలా విగ్రహాల గ్యాలరీ, కొండవీడు కోట మోడల్ పోర్టు ను ఏర్పాటు చేశామని తెలిపారు. ఈ గ్యాలరీకి ప్రోలయ వేమారెడ్డి గ్యాలరీ అని పేరు పెట్టారు. రెండవ అంతస్తులో తెలంగాణ ప్రాంతంలో అనేక సంస్థానాల చరిత్రను నాటి రాజులు నిర్మించిన బృహత్తర కోటలు, కోటగోడలు, బురుజులు ఏర్పాటు చేశామని చెప్పారు. నాటి రాజులు జారీ చేసిన ప్రముఖ శాసనాల నమూనాలను వాటిలో ప్రాచీన శిలాశాసనాలు, తామ్ర శాసనాలను, నగలను ఏర్పాటు చేయడమైనదని పేర్కొన్నారు
భవనం మూడో అంతస్తులో ఆంధ్ర రాష్ట్రంలోని ప్రముఖ దేవాలయాలు, తెలంగాణ రాష్ట్రంలోని ప్రముఖ నిర్మాణాలను హోల్డింగ్స్ రూపంలో ఏర్పాటు చేయబడ్డాని చెప్పారు. మోటుపల్లి ఓడరేవు దృశ్యం, కుమారగిరి నృత్య దృశ్యములు, వసంతోత్సవ దృశ్యం మురల్ రిలీఫ్ లు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా లక్ష్మణరెడ్డి కొండవీడు కోట అభివృద్ధికి తన పూర్తి సహకారం అందిస్తానని తెలిపారు. కొండవీడు కోట అభివృద్ధి కమిటీ కన్వీనర్ కల్లి శివారెడ్డి మాట్లాడుతూ ఈ వస్తు ప్రదర్శనశాల అఖిల భారత రెడ్ల సంక్షేమ సమాఖ్య శ్రీశైలం వారు ఏర్పాటు చేశారని దీని వ్యయం సుమారు తొమ్మిది కోట్ల అయిందని ఇంకా కొన్ని వస్తువులు సేకరించవలసి ఉందని, వస్తు సేకరణ విషయంలో తాము అనేక ప్రయత్నాలు చేస్తున్నామని కల్లి శివారెడ్డి తెలిపారు.
Also Read: ఏపీకి ఈరోజు కూడా తప్పని వాన గండం.. ఈ మూడు జిల్లాలో నేడు అతి భారీ వర్షాలు కురిసే అవకాశం