Andhra Pradesh: సరిగ్గా ఒక కుటుంబానికి సైతం సరిపోని చిన్న రేకుల షేడ్ అది. మహా అయితే, వందలలో ఆ ఇంటికి పన్ను విధిస్తారు. కానీ, మున్సిపల్ అధికారులు విధించిన ఇంటి పన్ను చూసి యజమాని షాక్ అయ్యాడు. దీనికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. ఎన్టీఆర్ కృష్ణా జిల్లా కొండపల్లి గీతామందిర్ రోడ్డులోని రాపాని అంకరాజుకు చెందిన చిన్న రేకుల షేడ్ ఇంటికి మున్సిపల్ అధికారులు ఏకంగా రూ. 77,900 రూపాయల ఇంటిపన్ను వేశారు. ఇంత బిల్లు ఇవ్వడమే ఓ తప్పయితే.. ఆ బిల్లు చెల్లించకపోతే జప్తు చేస్తామని మున్సిపల్ అధికారులు బెదిరింపులకు పాల్పడుతున్నారు. గతంలో తాము ఇంటి పన్ను 264 రూపాయలు చెల్లించామని ఆ ఇంటి యజమాని చెప్పినా మున్సిపల్ అధికారులు ససేమిరా అంటున్నారు. పన్ను కట్టాల్సిందేనని తేల్చి చెప్పేశారు. మున్సిపల్ అధికారుల హెచ్చరికలతో బాధిత కుటుంబం లబోదిబోమంటోంది.