సత్తెనపల్లి, ఆగష్టు 02: సత్తెనపల్లి టీడీపీలో నోటీసులు కల్లోలం రేపుతున్నాయి. కన్నా లక్ష్మీనారాయణ ఇంఛార్జ్‌గా బాధ్యతలు చేపట్టాక.. పార్టీ కార్యక్రమాల్లో కోడెల శివరామ్ ఆయన వర్గీయులు యాక్టివ్‌గా లేరని, అందుకు తగిన కారణాలు చెప్పాలంటూ మంగళవారం నాడు 16మందికి నోటీసులిచ్చింది టీడీపీ అధిష్టానం. ఈ నోటీసులపై ఇవాళ స్పందించిన కోడెల శివరామ్.. హైకమాండ్‌కి చురకలతో పాటు కౌంటర్లు ఇచ్చారు.
సత్తనెపల్లి టీడీపీ ఇంఛార్జ్‌గా కన్నా లక్ష్మీనారాయణ నియామకంతో రగడ మొదలైంది. అప్పటి నుంచి ఆగ్రహంతో రగిలిపోతున్న కోడెల శివరామ్.. ఆత్మీయ సమ్మేళనాలతో హీట్ పుట్టించారు. అంతటితో ఆగకుండా ఇంటింటికి వెళ్లి ప్రజల్ని పలకరించే ప్రయత్నం చేశారు. రాజకీయాలకు అతీతంగా ప్రజలకు ఉండగా ఉంటానన్నారు శివరామ్. ఇంత జరుగుతున్నా చంద్రబాబు పట్టించుకోవడం లేదన్నది శివరామ్ ఆవేదనగా కనిపిస్తోంది. మరోవైపు శివరామ్ ఇంటికెళ్లి టీడీపీ నేతలు చర్చలు కూడా జరిపారు. ఆ తర్వాత ఏం జరిగిందో తెలియదు.. అధిష్టానం నోటీసులివ్వడం కలకలం రేపింది.
దశాబ్దాలుగా పార్టీ అభివృద్దికి కష్టపడిన వాళ్లకు నోటీసులివ్వడం ఏంటని ప్రశ్నించారు కోడెల శివరామ్. చిలకలూరిపేట, నర్సరావుపేట, గురజాలలో చాలామంది టికెట్స్ ఆశిస్తున్నారు. వాళ్లంతా లోకేష్ ఎదుటే కొట్టుకున్నారు. వాళ్లకు ఇవ్వకుండా తనకు నోటీసులివ్వడమేంటని నిలదీశారు. టీడీపీ ఆఫీస్ ప్రారంభించినప్పటి నుంచి కన్నా లక్ష్మీనారాయణ అందులోకి వెళ్లనే లేదు. ఆయనకు నోటీసులివ్వకుండా తనకు ఇవ్వడంలో మతలబేంటంటున్నారు శివరామ్.
మొన్నటిదాకా సత్తెనపల్లి టీడీపీ ప్రశాంతంగా ఉంది. అయితే ఒక్కసారిగా నోటీసులివ్వడం శివరామ్ వర్గీయుల్ని ఉలిక్కిపడేలా చేసింది. మరి శివరామ్ అండ్ కో పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటారా? కన్నా లక్ష్మినారాయణకు సహకరిస్తారా? ఒకవేళ సహకరించకుంటే అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుంది అనేది ఆసక్తికరంగా మారింది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..