Pawan Kalyan: జనసేనలోకి మరో వైసీపీ నేత.. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌తో భేటీ
జనసేనలోకి చేరికల జోరు పెరిగింది. కొద్దిసేపటి క్రితం పవన్ కల్యాణ్‌తో మాజీ ఎమ్మెల్యే కిలారు రోశయ్య భేటీ అయ్యారు. పార్టీలో చేరికపై పవన్‌తో చర్చించారు. ఆయనతోపాటు వియ్యంకుడు రవిశంకర్ కూడా జనసేన గూటికి చేరనున్నారు.

జనసేనలోకి సీనియర్ నేతల చేరికలు జోరందుకున్నాయి. రోజుకో నేత జనసేన పార్టీ అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ను కలుస్తున్నారు. మొన్న మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, జగ్గయ్యపేట మాజీ ఎమ్మెల్యే సామినేని ఉదయభాను భేటీ అయ్యారు. కొద్దిసేపటి క్రితమే జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ను పొన్నూరు మాజీ ఎమ్మెల్యే కిలారు రోశయ్య కలిశారు. పార్టీలో చేరికపై సుదీర్ఘంగా చర్చించారు. ఆదివారం ఆయన జనసేన పార్టీలో చేరనున్నట్లు సమాచారం. ఆయనతోపాటు వియ్యంకుడు రవిశంకర్ కూడా జనసేన గూటికి చేరనున్నారు. 2019 ఎన్నికల్లో పొన్నూరు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన రోశయ్య.. 2024 సార్వత్రిక ఎన్నికల్లో గుంటూరులోక్‌సభ స్థానానికి పోటీ చేసి ఓటమి పాలయ్యారు.

Kilari Roshaiah
ఇప్పటికే జనసేనలో చేరేందుకు ముహుర్తం ఫిక్స్ చేసుకున్నారు ఉదయభాను, బాలినేని. ఆదివారం సామినేని ఉదయభాను జనసేనలో చేరుతుండగా.. అక్టోబర్ 4న ఒంగోలులో భారీ బహిరంగ సభ నిర్వహించి.. పవన్ సమక్షంలో మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి చేరుతున్నట్లు తెలుస్తోంది. బాలినేనితో పాటు జిల్లాలోని పలువురు ప్రజాప్రతినిధులు కూడా చేరతారని ఇప్పటికే శ్రీనివాసరెడ్డి చెప్పారు. జనసేనలోకి ఇంకా చాలామంది నేతలు చేరతారనే టాక్ నడుస్తోంది.
బాలినేని శ్రీనివాస్ రెడ్డి, సామినేని ఉదయభాను వైసీపీని వీడటం పై మాజీ మంత్రి అంబటి రాంబాబు స్పందించారు. పార్టీ మారే వారి నైతికత దెబ్బతింటుంది తప్ప వైసీపీకి ఏం కాదన్నారు. అధికారం పోయాక జగన్ పద్ధతి నచ్చలేదని కొందరు అంటున్నారని, అధికారంలో ఉన్నప్పుడు ఈ విషయం తెలియదా అని ఆయన ప్రశ్నించారు. వైసీపీని వీడిన వారికి రాజకీయ భవిష్యత్ ఉండదని అంబటి స్పష్టం చేశారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
