ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ ఇన్‌చార్జ్‌ల థర్డ్ లిస్ట్ అభ్యర్థుల్లో టెన్షన్ పుట్టిస్తోంది. తనకు టికెట్ వస్తుందో రాదో సీఎం జగనే చెప్పాలని శింగనమల ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి ఫేస్‌బుక్ లైవ్‌లో సంచలన వ్యాఖ్యలు చేశారు. బయట పబ్లిక్ టాక్ గురించి తానేమీ చెప్పలేదనన్నారు.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చెప్పిన ప్రతి కార్యక్రమాన్ని చేపట్టామని ఎమ్మెల్యే పద్మావతి అంటున్నారు. హైకమాండ్ చెప్పిన ప్రతి ప్రోగ్రామ్ చేసుకుంటూ వెళ్లానని వివరించారు. గడపగడపకూ మన ప్రభుత్వం కార్యక్రమం చేపట్టాలని చెబితే, అలా చేస్తే ఇమేజ్ పెరుగుతుందని జగన్ చెప్పారని, అందుకు అనుగుణంగానే నడుచుకున్నామన్నారు. ఇక బస్సుయాత్రల గురించి కూడా జొన్నలగడ్డ పద్మావతి ఫేస్‌బుక్ లైవ్‌లో వ్యాఖ్యానించారు. టికెట్ ఖరారు అయినవాళ్లకే బస్ యాత్రలో పాల్గొనేలా చేయాలని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అప్పట్లో చెప్పారని గుర్తుచేశారు.
ఫేస్ బుక్ లైవ్ ద్వారా ఆవేదన వ్యక్తం చేశారు ఎమ్మెల్యే జొన్నలగడ్డ. తమ వాటా నీళ్ల కోసం యుద్ధం చేయాల్సి వస్తోందని, ఈ విషయాన్ని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదన్నారు. ఏనాడు నీటి సమస్యను పరిష్కరించలేదు. 2024 ఎన్నికల్లో ఓట్లు ఎలా అడగాలి. ఎస్సీలకే ఎందుకు అన్యాయం జరుగుతోంది. ఎస్సీ నియోజకవర్గాల ఎమ్మెల్యేలు చేతులు కట్టుకుని ఉండాలా? అంటూ ప్రశ్నించారు. కులమతాలకు అతీతంగా సింగనమల ప్రజలు గెలిపించారని, కానీ నియోజకవర్గం అభివృద్ధికి సీఎం ఏమాత్రం సహకరించలేదని సంచలన ఆరోపణలు చేశారు. నా పట్ల, నా భర్త పట్ల మంత్రి పెద్దిరెడ్డి వివక్ష చూపారని ధ్వజమెత్తారు. ఎన్నికల్లో టికెట్ కేటాయించాలని సీఎంను అభ్యర్థించాం. కానీ తాడేపల్లి ప్యాలెస్ నుంచి ఎలాంటి స్పందన లేదన్నారు. నియోజకవర్గానికి ఏమీ చేయలేకపోయాను అంటూ ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి ఆవేదన వ్యక్తం చేశారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…