Janasena: ‘ధనాన్ని, సమయాన్ని వెచ్చించినా గుర్తింపు లేదు’.. నిర్వేదంలో బొలిశెట్టి

దశాబ్డం సమయాన్ని, ధనాన్ని వెచ్చించాను, నాకు పోటీ చేసే అవకాశం ఇవ్వలేదు, కనీసం పిలిచి మాట్లాడ లేదు అని కొందరి వ్యధ అంటూ తన బాధను బయటపెట్టారు జనసేన నేత బొలిశెట్టి సత్యనారాయణ. మరోవైపు.. మన ప్రభుత్వం వస్తుంది అందరికీ న్యాయం చేస్తుందని కార్యకర్తలను ఊరడించే ప్రయత్నం చేశారు.

Janasena: 'ధనాన్ని, సమయాన్ని వెచ్చించినా గుర్తింపు లేదు'.. నిర్వేదంలో బొలిశెట్టి
Satyanarayana Bolisetty
Follow us
Ram Naramaneni

|

Updated on: Mar 14, 2024 | 10:17 AM

ఎన్నికల సమయం దగ్గర పడటంతో.. ఆంధ్రాలో పార్టీల అధినేతలు తమ పార్టీల అభ్యర్థులను ప్రకటిస్తున్నారు. పొత్తులో భాగంలో ఈసారి ఏపీలో టీడీపీ – జనసేన – బీజేపీ పోటీ చేస్తున్నారు. ఈ క్రమంలో టికెట్ దక్కని నేతలు తమ ఆక్రోషాన్ని వెళ్లగక్కుతున్నారు. కొందరు అగ్రెసీవ్‌గా నిరసనలకు దిగుతుంటే.. మరికొందరు సాఫ్ట్‌గా తమ బాధను వ్యక్తపరుస్తున్నారు. తాజాగా సోషల్ మీడియాలో జనసేన సీనియర్ నేత బొలిశెట్టి సత్యనారాయణ పోస్ట్ పెట్టారు. దశాబ్ద సమయం, ధనాన్ని వెచ్చించినా.. తనకు పోటీ చేసే అవకాశం ఇవ్వలేదంటూ అసంతృప్తి వ్యక్తం చేశారు. కనీసం పిలిచి మాట్లాడలేదని ఆవేదన వ్యక్తం చేశారు.

సంపాదనను, కుటుంబాన్ని వదిలి పార్టీ సిద్ధాంతాల కోసం దశాబ్దం పాటు శ్రమించినా గుర్తింపు లేదన్నారు. ఇప్పుడు కావలసింది సంయమనం.. చేయాల్సింది యుద్ధం అని పేర్కొన్నారు. మన ప్రభుత్వం వస్తుంది అందరికీ న్యాయం చేస్తుందంటూ పోస్ట్ పెట్టారు. ఓవైపు నిర్వేదం, మరోవైపు ఆశావహ దృక్పథంతో బొలిశెట్టి చేసిన పోస్ట్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతుంది. పార్టీ అంటే కొన్ని త్యాగాలు తప్పవని.. అందుకు సరైన సమయంలో ప్రతిఫలం ఉంటుందని జనసేన కార్యకర్తలు కామెంట్స్ పెడుతున్నారు. పార్టీ వాయిస్ బలంగా వినిపించిన బొలిశెట్టి లాంటి వారికి సీటు ఇవ్వకపోవడం దారుణమని మరికొందరు అంటున్నారు.

జనసేనకు 40 అసెంబ్లీ, 5 ఎంపీ సీట్లు అయితేనే గౌరవప్రదం అంటూ గతంలోనే బొలిశెట్టి సత్యనారాయణ తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. 40కి తగ్గకుండా సీట్లు ఇవ్వడమే కాకుండా పవర్ షేరింగ్ కూడా ఇవ్వాలంటూ గతంలో బొలిశెట్టి సత్యనారాయణ డిమాండ్ చేశారు. టీవీ9లో పాల్గొన్న అనేక డిబేట్లలోనూ ఈ అంశంపై తన వాదనను స్పష్టంగా తెలియజేశారు. గౌరవప్రదమైన సీట్లు తీసుకుంటాం.. పవర్ షేరింగ్‌ కూడా ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేశారాయన. తొలి చర్చల్లో భాగంగా తీసుకున్న 24 సీట్లకే బొలిశెట్టి అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇప్పుడు 21 సీట్లకే జనసేన పరిమితమవడంతో.. బొలిశెట్టి కొంత నిరాశకు గురైనట్టుగా తెలుస్తోంది. అందులో ఆయనకు సీటు లేకపోవడం మరింత బాధ పెట్టినట్లుగా ఆ పోస్ట్‌ను బట్టి తెలుస్తోంది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..