జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ చేపట్టనున్న వారాహి యాత్రకు ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. అధినేత చేయనున్న ఈ యాత్రను విజయవంతం చేసేందుకు పార్టీ కార్యకర్తలు అహర్నిశలు శ్రమిస్తున్నారు. ఈ నెల 14న తూర్పుగోదావరి జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం కత్తిపూడిలో పవన్ కల్యాణ్ భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. కత్తిపూడి బస్టాండ్ సెంటర్ లో సాయంత్రం 4 గంటలకు ఈ సభ జరగనుంది. సభ విజయవంతం చేయడానికి జనసేన కార్యకర్తలు రంగంలోకి దిగారు. కత్తిపూడిలో వారాహి యాత్ర ప్రచార రధాలు ప్రారంభించారు. పవన్ సభను విజయవంతం చేయాలని పది ప్రచార రథాల ద్వారా ప్రచారం చేస్తున్నారు. ప్రత్తిపాడు నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో ప్రచారం నిర్వహిస్తున్నారు. మరోవైపు ముందస్తు ఎన్నికలు వచ్చినా రాకపోయినా జనంలోనే ఉండేందుకు పవన్ కల్యాణ్ రెడీ అయ్యారు. వారాహి యాత్ర కోసం ఇప్పటికే నియోజకవర్గాల వారీగా ఇంచార్జులను ప్రకటించారు. వారు ఏర్పాట్లలో తనమునకయ్యారు. జనసేన పార్టీకి ఉభయగోదావరి జిల్లాల్లో ఉండే అడ్వాంటేజ్ ఏమిటంటే.. జన సమీకరణ చేయాల్సిన అవసరం లేదు. ఫలానాతేదీన పవన్ వస్తున్నారంటే.. ఫ్యాన్స్ వెల్లువలా వస్తారు. అందుకే గోదావరి జిల్లాల్లో యాత్ర హోరెత్తిపోతుదంని గట్టిగా నమ్ముతున్నారు.
కాగా ఇప్పటికే పార్టీ కార్యకర్తలు వారాహి యాత్ర ప్రచార రథాలు ప్రారంభించి ఆ ఉత్సాహం చూపిస్తున్నారు. పవన్ వారాహి ఎక్కి కత్తిపూడి జంక్షన్ వద్దకు రావడమే తరువాయి అన్నట్లుగా ఆ పార్టీ కార్యకర్తలు హోరెత్తిస్తున్నారు. ఇక ఈ నెల 14 నుంచి ప్రారంభం కానున్న వారాహి యాత్రలో ఉమ్మడి జిల్లాలో 8 నియోజకవర్గాలు కవర్ చేయనున్నారు. మొత్తం ఐదు బహిరంగ సభలలో పవన్ కళ్యాణ్ పాల్గొనున్నారని పార్టీ నాయకులు చెబుతున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..