
Pawan Kalyan: ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయిన ఆంధ్రప్రదేశ్‌ను కాపాడే శక్తి జనసేన పార్టీకి ఉందని ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan)తెలిపారు. బలమైన ప్రతిపక్షం, బలమైన వ్యక్తుల సమూహాం ప్రజాస్వామ్యానికి అవసరమని ఆయన పేర్కొన్నారు. ఆ బలాన్ని భరోసాగా ఇవ్వాలని తూర్పు గోదావరి జిల్లా మండపేట రైతు భరోసా సభలో కోరారు. ఇవ్వడమే తనకు తెలుసని, అడగడం తనకు జీవితంలో ఇంత వరకు తెలియదని అన్నారు. ఓట్లు అడగటం కూడా తనకు ఇబ్బందిగా ఉంటుందని తెలిపారు. జనసేన ప్రభుత్వం ఏర్పాటయ్యేలా చూడాలని ప్రజలను ఈ సందర్భంగా కోరారు. తనకు ప్రాణం ఉన్నంత వరకు జనసేన పార్టీని నడిపిస్తానని పవన్ మరోసారి స్పష్టం చేశారు. ఎట్టిపరిస్థితుల్లోనూ తన పార్టీని విలీనం చేయడం జరగదన్నారు. తననేమి గుడ్డిగా నమ్మొద్దని కోరారు. వచ్చే ఎన్నికల్లో జనసేన ప్రభుత్వం ఏర్పాటు అయ్యేందుకు సహకరించాలని పిలుపునిచ్చారు.
అమలు చేయలేని హామీలెందుకు?
కాగా ఈ సందర్భంగా మరోసారి వైసీపీ ప్రభుత్వంపై మరోసారి నిప్పులు కురిపించారు జనసేనాని. అమలు చేయలేని హామీలు ఎందుకు ఇస్తారని వైసీపీ నాయకులను పవన్ ప్రశ్నించారు. రాజకీయం చేయమని చెప్పే YCP నాయకులు చేస్తున్నదేంటని నిలదీశారు. సీఎం జగన్ నేడు బయటకు వచ్చే పరిస్థితి లేదని విమర్శించారు. నిజంగా ఆయనకు బయటకి పరిస్థితులు తెలిసి ఉంటే రాష్ట్రంలో రోడ్లు ఇలా ఎందుకు ఉంటాయని అని ప్రశ్నించారు. ఎమ్మెల్సీ అనంతబాబు వ్యవహారాన్ని మభ్యపెట్టేందుకు ప్రభుత్వం కోనసీమ జిల్లాలో కుల వివాదాలు తీసుకువచ్చిందని పవన్ ఆరోపించారు. అంబేడ్కర్ అంటే ప్రభుత్వానికి నిజంగా గౌరవం ఉంటే ముందే కోనసీమ జిల్లాకు ఆ పేరు ఎందుకు పెట్టలేదని ప్రశ్నించారు. రాష్ట్రంలో మార్పు అన్నది గోదావరి జిల్లాల నుంచి ప్రారంభం కావాలని పవన్ పిలుపునిచ్చారు. మరోసారి వైసీపీని గెలిపిస్తారా? కొత్త ప్రభుత్వాన్ని కోరుకుంటారా అన్నది నిర్ణయించే శక్తి గోదావరి జిల్లాలకు ఉందని పవన్ తెలిపారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..