Pawan Kalyan: దూకుడు పెంచిన పవన్ కల్యాణ్.. ఆ స్థానాల్లో పోటీకి కసరత్తు ప్రారంభం.. భేటీ వెనుక ప్లాన్ అదే..

|

Dec 25, 2023 | 7:34 AM

సార్వత్రిక ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న వేళ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ దూకుడు పెంచారు. టిడిపి- జనసేన పొత్తులో ఇప్పటికే తాము పోటీ చేసే స్థానాలకు సంబంధించి పవన్ కళ్యాణ్ ఒక అంచనాకు వచ్చేశారు. వారం రోజులుగా మంగళగిరి కేంద్ర కార్యాలయంలో మకాం వేసిన పవన్ కళ్యాణ్ ప్రత్యేకించి నియోజకవర్గాల ఇన్‌ఛార్జ్‌లు, పార్టీ ముఖ్య నేతలతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు.

Pawan Kalyan: దూకుడు పెంచిన పవన్ కల్యాణ్.. ఆ స్థానాల్లో పోటీకి కసరత్తు ప్రారంభం.. భేటీ వెనుక ప్లాన్ అదే..
Pawan Kalyan
Follow us on

సార్వత్రిక ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న వేళ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ దూకుడు పెంచారు. టిడిపి- జనసేన పొత్తులో ఇప్పటికే తాము పోటీ చేసే స్థానాలకు సంబంధించి పవన్ కళ్యాణ్ ఒక అంచనాకు వచ్చేశారు. వారం రోజులుగా మంగళగిరి కేంద్ర కార్యాలయంలో మకాం వేసిన పవన్ కళ్యాణ్ ప్రత్యేకించి నియోజకవర్గాల ఇన్‌ఛార్జ్‌లు, పార్టీ ముఖ్య నేతలతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఆయా నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితి, ఆయా నియోజవర్గాల పరిధిలో అభ్యర్థుల సామాజిక, ఆర్థిక, రాజకీయ స్థితిగతులు అడిగి తెలుసుకున్నారు. ఈ సమావేశాల్లో తాను ఎంపిక చేసిన నియోజకవర్గాల ఇన్‌ఛార్జ్‌లతో పవన్ ప్రత్యేకంగా భేటీ అయ్యారు. టీడీపీతో పొత్తులో భాగంగానే పోటీ చేయబోయే స్థానాల పరిధిలోని నియోజకవర్గాలను ఎంచుకొని పవన్ సమీక్ష జరిపారని జనసేన పార్టీ వర్గాలు తెలిపాయి. టీడీపీతో పొత్తులో భాగంగా ఎన్ని స్థానాల్లో పోటీ చేస్తారనే అంశంపై ఒక స్పష్టత ఇవ్వనప్పటికీ పార్టీలోని ముఖ్య నేతలతో పలు అంశాలపై చర్చిస్తున్నారు పవన్‌. ఏపీలోని మొత్తం 175 నియోజకవర్గాలకుగాను ఉమ్మడి పోరులో భాగంగా 25 నుంచి 40 స్థానాల్లో జనసేన తరపున అభ్యర్థులు నిలిపేందుకు పవన్‌ కసరత్తు చేస్తున్నారు. అందులో భాగంగానే ఇప్పటివరకు 16 నియోజకవర్గాల ఇంచార్జులతో పవన్ కళ్యాణ్ చర్చలు జరిపారు. వాటిలో అభ్యర్థులను నిలపాలన్న ఆలోచనలో ఉన్న పవన్ వారితో ప్రత్యేకంగా భేటీ అయ్యారని పార్టీ నేతలు అంటున్నారు. ఇప్పటికే చంద్రబాబుతో సీట్ల పంపకాలకు సంబంధించిన అంశంలో పవన్ కళ్యాణ్ ఒక స్పష్టతకు రాగా పార్టీ పరిస్థితిపై గత వారం రోజులుగా సమీక్షిస్తున్నారు.

పోటీ చేయాలని భావిస్తున్న ఉమ్మడి చిత్తూరు జిల్లా పరిధిలోని తిరుపతి, ఉమ్మడి ప్రకాశం జిల్లా పరిధిలోని ఒంగోలు, ఉమ్మడి గుంటూరు జిల్లా పరిధిలోని గుంటూరు వెస్ట్, తెనాలి ఉమ్మడి కృష్ణా జిల్లా పరిధిలో మచిలీపట్నం అవనిగడ్డ, ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా పరిధిలో కొత్తపేట, అమలాపురం, రాజోలు, రాజానగరం, కాకినాడ రూరల్, ముమ్మడివరం, ఉమ్మడి విశాఖ జిల్లా పరిధిలోని భీమిలి, ఎలమంచిలి, పెందుర్తి, ఉమ్మడి విజయనగరం జిల్లా పరిధిలో నెలిమర్ల నియోజక వర్గాల పరిధిలో పార్టీ తరపున అభ్యర్థులను నిలిపేందుకు పవన్ కళ్యాణ్ ఒక అంచనాకు వచ్చేశారు. అయితే ఈ నియోజకవర్గాల పరిధిలో టీడీపీ బలం, జనసేన పార్టీ పరిస్థితి, వైసీపీ బలహీనతలు ఏంటన్న దానిపై పవన్ ఆరా తీశారు. గెలుపు ఓటముల విషయంలో టీడీపీ ఓటు బ్యాంక్ కలిసి వస్తుందన్న ఆలోచనలో ఉన్నారు పవన్ కళ్యాణ్. ఇప్పటి వరకు ప్రాథమికంగా ఈ స్థానాల్లో అభ్యర్థులను బరిలో నిలపాలని కసరత్తు చేస్తున్న పవన్ త్వరలో అధికారిక ప్రకటన చేయనున్నారు. అయితే ప్రస్తుతం సమీక్ష చేసిన ఈ నియోజవర్గానికి చెందిన కొందరు నేతల్ని కొందరిని పార్టీ కార్యాలయాలు ఆయా నియోజకవర్గాల్లో ఓపెన్ చేసి క్షేత్ర స్థాయిలో ఎన్నికల గ్రౌండ్ వర్క్ చేసుకోవాలని సూచించారు పవన్. టీడీపీ నేతలతో కలిసి పని చేయాలని ఆదేశించారు.

రెండు లేదా మూడు రోజుల తర్వాత ఎన్నికల్లో పోటీ చేసే మిగతా స్థానాలపై పవన్ సమీక్ష చేయనున్నారు. ఉమ్మడి కృష్ణ, పశ్చిమగోదావరి, శ్రీకాకుళం నెల్లూరు, కర్నూలు, కడప, అనంతపురంతో పాటు ఇప్పటికే ప్రకటించిన కొన్ని జిల్లాల పరిధిలో మరికొన్ని నియోజక వర్గాలపై క్లారిటీ ఇవ్వనున్నారు. ఇప్పటికే కడపతో పాటు రైల్వే కోడూరు నియోజకవర్గాల్లో అభ్యర్థులను నిలపాలని పవన్ కళ్యాణ్ భావిస్తున్నారు. అయితే టిడిపి తరఫున గతంలో గెలిచిన అభ్యర్థులు ప్రస్తుతం సీటు ఆశిస్తున్న నేతలు కూడా తమకు ఆయా నియోజకవర్గాల పరిధిలో పోటీ చేసేందుకు అవకాశం కల్పించాలని పట్టు బడుతున్నారు. ఈ నేపథ్యంలో చంద్రబాబుతో మాట్లాడాక ఆయా నియోజకవర్గాల అభ్యర్థులకు క్లియర్ కట్ డైరెక్షన్ ఇవ్వనున్నారు పవన్ కళ్యాణ్. ప్రస్తుతం ఏపీలో నెలకొన్న రాజకీయ పరిణామాలు, సామాజిక సమీకరణాలను ఆధారంగా చేసుకొని గతానికంటే భిన్నంగా అభ్యర్థుల ఎంపిక విషయంలో అడుగులు వేస్తున్నారు పవన్‌.

ఇప్పటికే 16 నియోజకవర్గాల సమీక్ష పూర్తైన నేపథ్యంలో మరో 20 స్థానాలపై రెండ్రోజుల్లో సమీక్ష చేయనున్నారు పవన్‌. మిగతా నియోజకవర్గాలకు సంబంధించి స్పష్టత రావడానికి కొంత సమయం పట్టొచ్చని జనసేన వర్గాలు చెబుతున్నాయి.

మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..