విశాఖపట్నంలో హైటెన్షన్ నెలకొంది. విశాఖ ఎయిర్‌పోర్ట్ దగ్గర జనసైనికులు మంత్రుల కార్లపై దాడికి దిగారు. దీంతో ఎయిర్ పోర్ట్ ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది. జనసేన అధినేత పవన్ కల్యాణ్ విశాఖ పర్యటన నేపథ్యంలో జనసైనికులు విమానాశ్రయం వద్దకు భారీగా చేరుకున్నారు. ఇదే సమయంలో రాజధాని వికేంద్రీకరణకు మద్దతుగా.. వైసీపీ ఆధ్వర్యంలో విశాఖ గర్జన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి హాజరైన మంత్రులు తిరిగి వెళుతుండగా.. అక్కడే ఉన్న జనసేన కార్యకర్తలు మంత్రుల కార్లపై దాడికి దిగారు.
జోగిరమేష్, రోజా, వైవీ సుబ్బారెడ్డి కార్లపై జనసేన కార్యకర్తలు విరుచుకుపడ్డారు. కార్లపై దాడి చేసి.. మంత్రులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కర్రలు, రాళ్లతో దాడి చేశారు. దీంతో తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది. జనసేన కార్యకర్తల దాడిలో జోగి రమేష్ కారు అద్దాలు ధ్వంసం అయ్యాయి. పలువురికి తీవ్రగాయాలైనట్లు పేర్కొంటున్నారు.
కాగా.. ఈ ఘటనపై మంత్రి జోగి రమేష్ స్పందించారు. ఇది మంచి పద్దతి కాదంటూ పేర్కొన్నారు. జనసేన దాడిలో తమ కార్యకర్తలకు గాయాలయ్యాయని తెలిపారు.
ఇదిలాఉంటే.. పవన్ కల్యాణ్ కూడా విశాఖకు చేరుకున్నారు. మరికాసేపట్లో భారీ ర్యాలీ కూడా ప్రారంభం కానుంది. తాజా ఘటనతో విశాఖలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
పవన్ క్షమాపణలు చేప్పాలి..
వైవి సుబ్బారెడ్డి, జోగి రమేష్ లపై విశాఖ ఎయిర్పోర్టులో జనసైనికుల దాడిపై తక్షణమే పవన్ కళ్యాణ్ సమాధానం చెప్పాలని మంత్రి అంబటి రాంబాబు డిమాండ్ చేశారు.
మరిన్ని ఏపీ వార్తల కోసం..