Srikalahasti: జగనన్న నవరత్నాల గుడి ధ్వంసం.. విగ్రహాలు, నిర్మాణాలు కూడా
తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో నవరత్నాల గుడిని గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేయడం కలకలం రేపింది. ఇంతకీ.. ఏంటీ నవరత్నాలు గుడి?.. దాని స్పెషల్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం...
ఎన్నికల తర్వాత కూడా ఏపీ రాజకీయాల్లో కాక కొనసాగుతూనే ఉంది. ఎన్నికల తర్వాత పలు ప్రాంతాల్లో టీడీపీ, వైసీపీ వర్గాల మధ్య దాడులు కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. ఇటీవల హోరాహోరీగా జరిగిన ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో కూటమి ఘన విజయం సాధించింది. దాంతో.. కూటమి శ్రేణులు సంబరాల్లో మునిగితేలుతున్నాయి. అయితే.. గత ప్రభుత్వంలో ఇబ్బందులు ఎదుర్కొన్న కొన్ని జిల్లాల కూటమి నేతలు, కార్యకర్తల్లో ఆవేశం కట్టలు తెంచుకుంటోంది. కొందరు అత్యుత్సాహంతో వైసీపీ ప్రభుత్వ హయాంలోని శిలాఫలకాలు ధ్వంసం చేయడం, పేర్లు తొలిగించడం, పార్టీ దిమ్మెలు పగలగొట్టడం లాంటి పనులు చేస్తున్నారు. తాజాగా.. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ నిర్మించిన వైసీపీ నవరత్నాలు గుడిని గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేయడం రాజకీయంగా హీట్ పెంచింది.
శ్రీకాళహస్తి మున్సిపాలిటీ పరిధిలోని రాజీవ్‌నగర్‌లో వైయస్ విగ్రహంతో పాటు వైసీపీ నవరత్నాల పథకాలను గుర్తు చేస్తూ గుడిని నిర్మించారు మధుసూదన్‌రెడ్డి. అయితే.. రాత్రి వేళలో నవరత్నాల ఆలయాన్ని నేలమట్టం చేయడంతోపాటు.. విగ్రహాలను, శిలాఫలకాలను సైతం ధ్వంసం చేశారు కొందరు గుర్తు తెలియని వ్యక్తులు. ఆ తర్వాత అక్కడి నుంచి పరారయ్యారు. దాంతో.. స్థానిక వైసీపీ నాయకులు ఘటనపై పోలీసులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు.. ఆలయం దగ్గర్లోని సీసీ పుటేజీని స్వాధీనం చేసుకుని నిందితుల కోసం గాలిస్తున్నారు. ఈ సందర్భంగా.. చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని అరాచకాలు సృష్టిస్తే సహించేదిలేదని పోలీసులు వార్నింగ్ ఇచ్చారు. దాడులకు దిగితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇక.. నవరత్నాల ఆలయంలోని శిథిలాలను తొలగించారు అధికారులు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..