MLC Appireddy – Agri Gold: టిడిపి సహకారంతో నడిపిన అగ్రిగోల్డ్ మూసివేస్తే చంద్రబాబు నోరు మెదపలేదని వైసీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి విమర్శించారు. అగ్రిగోల్డ్ బాధితులకు సీఎం జగన్ అండగా నిలిచారని ఆయన అన్నారు. 20 వేలు లోపు చెల్లించిన అగ్రిగోల్డ్ బాధిత డిపాజిట్ దారులందరికీ సొమ్ములు ఏపీ ప్రభుత్వం చెల్లిస్తుందని అప్పిరెడ్డి చెప్పారు. ఆగస్టు 24 న డిపాజిట్ దారులకు సొమ్ములు చెల్లిస్తామని ఆయన పేర్కొన్నారు.
తాడేపల్లిలో ఇవాళ అగ్రిగోల్డ్ బాధితుల బాసట కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్సీ అప్పిరెడ్డి బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. అగ్రిగోల్డ్ బాధితులు ఎలాంటి ఆందోళనా చెందాల్సిన అవసరం లేదని అభయమిచ్చారు. అగ్రిగోల్డ్ సమస్య పరిష్కారం కోసం పాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేయాలనే ఆలోచన చేస్తున్నామని చెప్పిన అప్పిరెడ్డి.. అగ్రిగోల్డ్ బాధితులు పూర్తి పరిహారం అందుకుంటారని హామీ ఇచ్చారు.
ఏపీ ప్రభుత్వం అగ్రిగోల్డ్ బాధితులకు అన్ని విధాల ఆదుకుంటుందని చెప్పిన ఆయన, కొన్ని పార్టీలు, సంఘాలు దుష్ప్రచారం చేస్తున్నాయని అప్పిరెడ్డి విమర్శించారు. వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అగ్రిగోల్డ్‌కి చెందిన 267 ఎకరాల భూమి స్వాధీనం చేసుకుందని అప్పిరెడ్డి చెప్పారు. బాధితులందరికీ ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసే బాధ్యత జగన్ సర్కారుదని ఎమ్మెల్సీ స్పష్టం చేశారు.