AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నల్లమలకు ‘ఇండియన్‌ గౌర్‌’లు.. పులులకు సాయంగా.. అసలు విషయం ఏంటంటే..?

Indian Gaur to Andhra Pradesh: నల్లమల అడవుల్లో దశాబ్దాల క్రితం అంతరించిపోయిన ఇండియన్ గౌర్ (అడవి దున్నలు)లను తిరిగి ప్రవేశపెట్టేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రణాళిక రూపొందించింది. మధ్యప్రదేశ్ నుంచి మూడేళ్లలో 50 గౌర్‌లను తీసుకొచ్చి గుండ్ల బ్రహ్మేశ్వరం అభయారణ్యంలో విడిచిపెట్టనున్నారు. ఈ చర్యతో జీవ వైవిధ్యం పెరగడంతో పాటు పులుల సంరక్షణకు కూడా బలమైన మద్దతు లభించనుంది.

నల్లమలకు 'ఇండియన్‌ గౌర్‌'లు.. పులులకు సాయంగా.. అసలు విషయం ఏంటంటే..?
Indian Gaur To Return To Nallamala Forests
Rajashekher G
|

Updated on: Jul 20, 2026 | 1:38 PM

Share

ఆంధ్రప్రదేశ్‌లోని నల్లమల అటవీ ప్రాంతంలో జీవ వైవిధ్యాన్ని మరింత బలోపేతం చేసేందుకు రాష్ట్ర అటవీ శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. దశాబ్దాల క్రితమే ఈ ప్రాంతం నుంచి అంతరించిపోయిన ‘ఇండియన్ గౌర్ (అడవి దున్నలు-Wild Bisons)’ను తిరిగి నల్లమల అడవుల్లో ప్రవేశపెట్టేందుకు సమగ్ర కార్యాచరణ ప్రారంభించింది. ఈ ప్రాజెక్ట్ ద్వారా పర్యావరణ సమతుల్యతను కాపాడడంతో పాటు నల్లమల-శ్రీశైలం టైగర్ రిజర్వులో పులుల సంరక్షణకు కూడా బలమైన మద్దతు లభించనుంది.

వందేళ్ల తర్వాత మళ్లీ అడవి దున్నలు

వందేళ్ల క్రిత వరకు నల్లమల అడవుల్లో పెద్ద సంఖ్యలో సంచరించిన ఇండియన్ గౌర్‌లు కాలక్రమేణా కనుమరుగయ్యాయి. అడవుల విస్తీర్ణం తగ్గడం, మానవ జోక్యం పెరగడం, ఆవాసాలు దెబ్బతినడం వంటి కారణాలతో ఈ భారీ శాకాహార జంతువులు ఈ ప్రాంతాన్ని విడిచిపెట్టాయి. ఇప్పుడు వాటిని తిరిగి తీసుకొచ్చి పూర్వ వైభవాన్ని పునరుద్ధరించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోంది. 2024 జులై నుంచి అక్టోబర్ మధ్యకాలంలో నల్లమలలోని బైర్లూటి, ఆత్మకూరు, వెలుగోడు అటవీ ప్రాంతాల్లో ఒక ఇండియన్ గౌర్ సంచరిస్తున్నట్లు అటవీ అధికారులు గుర్తించారు. ఈ జంతువు కర్ణాటక అడవుల నుంచి కృష్ణానదిని దాటి నల్లమలకు చేరి ఉండవచ్చని అధికారులు అంచనా వేశారు. దీంతో ఈ ప్రాంతం గౌర్‌లకు అనువైన ఆవాసమని మరోసారి స్పష్టమైంది.

మధ్యప్రదేశ్ నుంచి 50 గౌర్‌ల తరలింపు

నల్లమలలో గౌర్‌ల పునరావాసానికి మధ్యప్రదేశ్ ప్రభుత్వం సహకారం అందిస్తోంది. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్‌తో జరిపిన చర్చల అనంతరం ఈ ప్రాజెక్టుకు మార్గం సుగమమైంది. ఈ ఒప్పందం ప్రకారం రాబోయే మూడు సంవత్సరాల్లో మొత్తం 50 ఇండియన్ గౌర్‌లను దశలవారీగా ఆంధ్రప్రదేశ్‌కు తరలించనున్నారు. తొలి విడతలో 15 నుంచి 20 గౌర్‌లను ఈ ఏడాది డిసెంబర్ నాటికి నల్లమల అడవుల్లో విడిచిపెట్టేలా అధికారులు ప్రణాళిక రూపొందించారు.

గుండ్ల బ్రహ్మేశ్వరం అభయారణ్యంలో తొలి విడత

మొదటి విడతలో తీసుకొచ్చే గౌర్‌లను గుండ్ల బ్రహ్మేశ్వరం వన్యప్రాణి అభయారణ్యం పరిధిలో విడుదల చేయనున్నారు. ఈ ప్రాంతానికి చుట్టుపక్కల దాదాపు 40 కిలోమీటర్ల వరకు జనావాసాలు లేకపోవడంతో గౌర్‌లకు అత్యంత అనుకూలమైన సహజ ఆవాసంగా అటవీ శాఖ గుర్తించింది. భవిష్యత్తులో కొంతమంది గౌర్‌లను పాపికొండల జాతీయ పార్కులో కూడా ప్రవేశపెట్టే అవకాశాన్ని అధికారులు పరిశీలిస్తున్నారు.

పులుల సంరక్షణకు గౌర్‌ల ప్రాధాన్యం

అడవిలో పులుల ఆహార గొలుసులో ఇండియన్ గౌర్‌ల పాత్ర ఎంతో కీలకం. ప్రస్తుతం పులులు ప్రధానంగా జింకలు, దుప్పులపైనే ఆధారపడుతుండటంతో వాటి సంఖ్య తగ్గే ప్రమాదం ఉంటుంది. గౌర్‌ల వంటి భారీ శాకాహార జంతువులు అందుబాటులో ఉంటే పులులకు ఎక్కువకాలం ఆహారం లభిస్తుంది. అలాగే గౌర్‌లు గడ్డి, పొదలను మేయడం వల్ల కొత్త పచ్చిక పెరిగి జింకలు, దుప్పుల సంఖ్య కూడా పెరుగుతుంది. దీంతో మొత్తం అటవీ జీవవ్యవస్థ సమతుల్యంగా కొనసాగుతుంది.

ప్రత్యేక బృందం మధ్యప్రదేశ్‌లో పరిశీలన

అటవీ శాఖ ప్రధాన ముఖ్య అటవీ సంరక్షణాధికారి చలపతిరావు తెలిపిన వివరాల ప్రకారం, ప్రస్తుతం నల్లమల-శ్రీశైలం టైగర్ రిజర్వులో 87 పులులు ఉన్నాయి. గౌర్‌ల ప్రవేశంతో ఈ ప్రాంతంలో పులుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని ఆయన తెలిపారు. ఇందుకోసం ఇప్పటికే ప్రత్యేక అధికారుల బృందాన్ని మధ్యప్రదేశ్‌లోని సత్పుర టైగర్ రిజర్వుకు పంపించి గౌర్‌ల ఎంపిక, తరలింపు ప్రక్రియపై అధ్యయనం ప్రారంభించినట్లు వెల్లడించారు.

అడవి దున్నల పునరావాసంతో నల్లమలలో జీవ వైవిధ్యం మరింత బలపడటమే కాకుండా, దేశంలోనే అత్యంత కీలకమైన టైగర్ రిజర్వుల్లో ఒకటైన నల్లమల-శ్రీశైలం అటవీ ప్రాంతం పర్యావరణపరంగా మరింత సమృద్ధిగా మారుతుందని అటవీ అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

Follow Us