Ap Municipalities: ఏపీలో మున్సిపాలిటీల పరిధి పెంపు.. మరో కొత్త మున్సిపాలిటీ.. ఐదు నగర పంచాయతీలు

|

Jan 05, 2021 | 5:53 AM

Ap Municipalities: ఏపీ ప్రభుత్వం కొత్తగా ఒక పురపాలక సంఘం, ఐదు నగర పంచాయతీలను ఏర్పాటు చేస్తూ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. దీనిపై గవర్నర్‌ నోటిఫికేషన్‌ ....

Ap Municipalities: ఏపీలో మున్సిపాలిటీల పరిధి పెంపు.. మరో కొత్త మున్సిపాలిటీ.. ఐదు నగర పంచాయతీలు
Follow us on

Ap Municipalities: ఏపీ ప్రభుత్వం కొత్తగా ఒక పురపాలక సంఘం, ఐదు నగర పంచాయతీలను ఏర్పాటు చేస్తూ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. దీనిపై గవర్నర్‌ నోటిఫికేషన్‌ కూడా జారీ చేశారు. వివిధ జిల్లాల్లోని 13 మున్సిపాలిటీల పరిధిని విస్తరించారు. పశ్చిమగోదావరి జిల్లాలోని అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రమైన చింతలపూడి, విజయనగరం జిల్లాలోని నియోజకవర్గ కేంద్రమైన రాజాంలతో పాటు చిత్తూరు జిల్లాలో బి. కొత్తకోట, కర్నూలు జిల్లాలోని ఆలూరు, ప్రకాశం జిల్లాలోని పొదిలి పంచాయతీలు ఇక నుంచి నగర పంచాయతీలుగా మారనున్నాయి.

ఇక విజయవాడ నగరంలో అంతర్భాగంలో ఉన్న కానూరు, పోరంకి, యనమలకుదురు, తాడిగడప గ్రామాలను కలిపి వైఎస్సార్‌ తాడిగడప అనే కొత్త మున్సిపాలిటీగా ఏర్పాటు చేశారు. అలాగే రాజధాని గ్రామాలను కుదించారు. ఇప్పటి వరకు అమరావతి రాజధాని పరిధిలో ఉండవల్లి, నవులూరు, పెనుమాక, చేతపూడి, ఎర్రుబాలెం, నిండమర్రు పంచాయతీలను ప్రభుత్వం మంగళగిరి తాడేపల్లి మున్సిపాలిటీ పరిధిలో చేర్చేసింది. దీంతో ఇప్పటి వరకు 29గా ఉన్న రాజధాని గ్రామాల సంఖ్య 23కు తగ్గించింది ప్రభుత్వం.

మున్సిపాలిటీల పరిధి పెంపు

కాగా, రాజమహేంద్రవరం, శ్రీకాకుళం మున్సిపాలిటీ కార్పొరేషన్‌లలో మరిన్ని గ్రామాలను చేర్చారు. తాడేపల్లి, మంగళగిరితో పాటు మొత్తం 13 మున్సిపాలిటీల పరిధిని ప్రభుత్వం విస్తరింపజేసింది. పశ్చిమగోదావరి జిల్లాలోని పాలకొల్లు, తాడేపల్లి గూడెం పురపాలక సంఘాల చుట్టుపక్కల ఉన్న ఐదేసి గ్రామాలను, భీమవరం, తణుకు మున్సిపాలిటీలను అనుకుని ఉన్న నాలుగేసి గ్రామాలను, అలాగే గుంటూరు జిల్లాలోని బాపట్ల మున్సిపాలిటీ చుట్టు పక్కల ఉన్న ఎనిమిది గ్రామాలను, పొన్నూరు మున్సిపాలిటీ చుట్టుపక్కల ఉన్న ఐదు గ్రామాలను, ప్రకాశం జిల్లాలోని కందూకూరు పురపాలక సంఘం చుట్టు పక్కల ఉన్న పది గ్రామాలను ఆయా మున్సిపాలిటీల్లో విలీనం చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇక నెల్లూరు జిల్లా కావలి, గూడురు, చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి, కృష్ణా జిల్లా గుడివాడ మున్సిపాలిటీల పరిధిని పెంచుతున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది.

Also Read:

AP Sand Tenders: ఇసుక టెండర్ల బాధ్యత ఎంఎస్‌టీసీకి అప్పగించిన ఏపీ ప్రభుత్వం.. జోన్‌ల వారీగానే టెండర్లు

Jagananna Amma Vodi : ఏపీ సర్కార్ గుడ్ న్యూస్… జనవరి 11న ‘జగనన్న అమ్మఒడి’ రెండో విడత నగదు పంపిణీ..