ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా ఐటీ నోటిసుల అంశం.. చంద్రబాబుకు మరిన్ని తిప్పలు తప్పవా..?

|

Sep 02, 2023 | 8:47 AM

Andhra Pradesh: తెలుగు దేశం పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఐటీ నోటీసుల అంశం ఏపీ రాజకీయాల్లో హాట్‌ టాపిక్‌గా మారింది. సబ్ కాంట్రాక్ట్‌ల పేరుతో ముడుపులు తీసుకున్నారంటూ ఆయనపై అభియోగాలు రావడం ఇప్పుడు పెను దుమారం రేపుతోంది. రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ చంద్రబాబుకు ఇలాంటి నోటీసులు రావడం అయన్ను చిక్కుల్లో పడేసేలా ఉంది.  

ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా ఐటీ నోటిసుల అంశం.. చంద్రబాబుకు మరిన్ని తిప్పలు తప్పవా..?
Chandrababu
Follow us on

ఆంధ్రప్రదేశ్, సెప్టెంబర్ 2: ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబుపై అక్రమ మార్గంలో ముడుపులు తీసుకున్నారనే ఆరోపణలు పెను సంచలనంగా మారాయి. చంద్రబాబు తన పాలన సమయంలో ఓ కంపెనీ నుంచి 118 కోట్ల రూపాయలు ముడుపులు తీసుకున్నట్లు తాజాగా ఆరోపణలు వచ్చాయి. ఆ డబ్బులకు సంబంధించిన లెక్కల పైనే ఇప్పుడు ఐటీ ఫోకస్‌ పెట్టినట్టుగా తెలుస్తోంది. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు కొన్ని బోగస్ సబ్-కాంట్రాక్టర్ల ద్వారా ఆదాయం సృష్టించి చివరికి అదంతా చంద్రబాబుకు చేరిందని తాజా ఆరోపణ సారాంశం. 2017లో షాపూర్‌జీ పల్లోంజీ కంపెనీ తరపున కొన్ని ప్రాజెక్టులకు టెండర్ ప్రక్రియలో మనోజ్ వాసుదేవ్ పరద సామి అనే వ్యక్తి పాల్గొన్నారు. 2019లో పరదసామి కార్యాలయాలు, నివాసాల్లో ఐటీ శాఖ సోదాలు చేసింది. అప్పుడు కొన్ని బోగస్ కాంట్రాక్టుల గుట్టు విప్పారని ప్రచారం జరుగుతోంది. షాపూర్‌జీకి వచ్చిన పనులను సబ్-కాంట్రాక్ట్‌కి ఎలా ఇచ్చారు.. ఆ నిధులు ఎక్కడికి చేరాయో ఒప్పకున్నారని వార్తలు వచ్చాయి.

ఈ నేపథ్యంలోనే ఆ డబ్బులను చంద్రబాబుకు చేరినట్టు సాక్ష్యాధారాలను ఐటీ శాఖ సేకరిస్తోంది. చంద్రబాబు పీఏ శ్రీనివాస్‌కు డబ్బులు ఇచ్చినట్లు వాంగ్మూలంలో పరదస్వామి చెప్పినట్టు సమాచారం. మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల ద్వారానే ఈ డబ్బుల్ని బ్లాక్‌ మనీ రూపంలో శ్రీనివాస్‌కు అందించినట్లు వాంగ్మూలంలో పరదస్వామి పేర్కొన్నారనే వార్తలు ఇప్పుడు సంచలనంగా మారాయి. ఆదాయ పన్ను శాఖ నుంచి చంద్రబాబు నాయుడికి నోటీసు వచ్చిన మాట వాస్తవమా..? కాదో చెప్పాలని డిమాండ్‌ చేశారు మాజీ మంత్రి పేర్ని నాని. రాజధాని అమరావతి పేరుతో ముడుపులు తీసుకున్నది నిజం కాదా అని ప్రశ్నించారు. ఓ ప్రముఖ ఇంగ్లిష్‌ పత్రికలో వచ్చిన కథనాన్ని పేర్ని నాని ఈ సందర్భంగా ప్రస్తావించారు. గతేడాది సెప్టెంబర్‌లోనే నోటీసు ఇచ్చినా ఎందుకు దాని గురించి ఇప్పటి వరకు మాట్లాడలేదని ప్రశ్నించారు. చంద్రబాబు లంచాల బాగోతం బట్టబయలైందని విమర్శించారు.

ఇదిలా ఉంగా అవినీతికి ప్యాంట్ షర్ట్ వేస్తే చంద్రబాబు లాగా వుంటుందన్నారు మంత్రి గుడివాడ అమర్‌నాథ్. అవినీతి కేసుల్లో కాపాడమని కాళ్లు మొక్కేందుకే చంద్రబాబు ఢిల్లీకి వెళ్తున్నారని మంత్రి ఆరోపించారు. తల్లిని ఎవరు తిట్టక పోయినా కేసులు పెట్టిన లోకేష్.. ఇప్పుడు ఆయన తండ్రి మీద వచ్చిన కథనంపై కేసులు వేస్తారా అని ప్రశ్నించారు. అయితే ఈ నోటీసుల వ్యవహారంపై అటు చంద్రబాబు కానీ ఇటు టీడీపీ కానీ స్పందించకపోవడం చర్చనీయాంశంగా మారింది. ఈ కేసు దర్యాప్తు ఎన్నికల సమయంలో వేగవంతంగా కావడం రాజకీయాల్లో ఏం జరుగుతుందోనన్న ఉత్కంఠ నెలకొంది.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..