Andhra Pradesh: చిత్తూరు జిల్లా కాణిపాకంలో టెన్షన్ నెలకొంది. బీజేపీ, వైసీపీల ప్రమాణాల ఛాలెంజ్ ఉద్రిక్తతకు కారణం అయ్యే అవకాశం కనిపిస్తోంది. ప్రొద్దుటూరులో టిప్పుసుల్తాన్ విగ్రహం ఏర్పాటు వ్యవహారంపై సవాళ్లు ప్రతిసవాళ్లు విసురుకున్న బీజేపీ, వైసీపీ నేతలు.. అవినీతి ఆరోపణలు, వ్యక్తిగత దూషణలకు దిగారు. బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్ రెడ్డి, ప్రొద్దుటూరు వైసీపీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదొడ్డిల మధ్య కొనసాగిన మాటల యుద్ధం సత్యప్రమాణాల క్షేత్రం కాణిపాకం ఆలయానికి చేరుకుంది.
అవినీతిపై స్వయంభు వరసిద్ధి వినాయకుడి ఆలయంలో సత్యప్రమాణానికి సిద్ధమని బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి సవాలు విసిరారు. ఆ సవాల్ మేరకు మంగళవారం నాడు ఉదయం కాణిపాకం ఆలయంలో ప్రమాణానికి సిద్ధం అని ప్రకటించారు. ఈ సవాల్ మేరకు జిల్లాలోని బీజేపీ కేడర్ కూడా ఏర్పాట్లలో నిమగ్నమై ఉంది. అయితే, ఇప్పటి వరకు వైసీపీ రెస్పాండ్ రాలేదు. బీజేపీ నేత విష్ణు ప్రమాణానికి సిద్ధం కాగా.. వైసీపీ నుంచి ఎలాంటి స్పందన లేకపోవడంతో సత్యప్రమాణం వ్యవహరం కాణిపాకం ఆలయంలో హీట్ పుట్టించింది. జిల్లా పోలీసు యంత్రాంగం కూడా ఈ వ్యవహారంలో ఆచీతూచీ వ్యవహరిస్తున్నారు.
ఆలయంలో రోజూ సాయంత్రం 5 గంటల నుంచి 6 గంటల వరకు మాత్రమే సత్యప్రమాణాలు చేయాల్సి ఉంది. కానీ, బీజేపీ నేత విష్ణు మాత్రం మంగళవారం ఉదయం 11 గంటలకు కాణిపాకం ఆలయంలో ప్రమాణం చేస్తానని ప్రకటించారు. దీనిపై ఆలయ యంత్రాంగం, పోలీసు అధికారులను వివరణ కోరగా.. సత్యప్రమాణాలకు అనుమతి లేదని తేల్చి చెబుతున్నారు. దైవదర్శనానికి వస్తే అనుమతిస్తామంటున్నారు. దీంతో మంగళవారం నాడు కాణిపాకం సత్యప్రమాణాల వ్యవహారం ఎలాంటి పరిస్థితులకు దారితీస్తుందో అనే టెన్షన్ అందరిలో నెలకొంది. మరి ఇంతకీ ఏం జరుగుతుందో తెలియాలంటే వేచి చూడాల్సిందే.
(ఎంపీఆర్ రాజు, టీవీ9 తెలుగు)
Also read:
YSR Nethanna Nestham: ఏపీ సర్కార్ మరో కీలక నిర్ణయం.. రేపే లబ్ధిదారుల అకౌంట్‌లో రూ.24 వేలు..
Gardening: ఇంటితోట కోసం మొక్కలు కొంటున్నారా? ఈ విషయాలు జాగ్రత్తగా పరిశీలించండి..