AP Weather: బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీలోని ఈ ప్రాంతాలకు వర్షసూచన

|

Jan 27, 2023 | 10:38 AM

ఈ నెల 27న ఏర్పడిన ఉపరితల ఆవర్తనంగా, 28న అల్ప పీడనంగా మారుతుందని వాతావరణ విభాగం అధికారులు తెలిపారు. ఫలితంగా ఏపీలో 2 రోజులు చిరు జల్లులు పడనున్నాయి.

AP Weather: బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీలోని ఈ ప్రాంతాలకు వర్షసూచన
Andhra Weather Report
Follow us on

ఇన్నాళ్లు చలి పులి భయపెట్టింది. కాగా త్వరలో చల్లని జల్లులు పలకరించబోతున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. ఆగ్నేయ బంగాళాఖాతంలో తూర్పు భూమధ్య రేఖా ప్రాంతానికి ఆనుకుని ఉపరితల ఆవర్తనం కొనసాగుతుంది. అదే ప్రాంతంలో శనివారం అల్పపీడనం ఏర్పడనుంది. అనంతరం ఈ అల్పపీడనం పశ్చిమ వాయవ్య దిశగా మూడు రోజులపాటు నెమ్మదిగా పయనించనుంది. దీని ప్రభావంతో ఈ నెల 29, 30 తేదీల్లో దక్షిణ కోస్తాంధ్రలో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. తెలంగాణపై దీని ఎఫెక్ట్ ఉండకపోవచ్చని వెల్లడించింది.

మాములుగా జనవరి తొలి వారం తర్వాత.. బంగాళాఖాతంలో అల్పపీడనాలు ఏర్పడటం చాలా అరుదు. ఈశాన్య రుతుపవనాల నిష్క్రమణ కూడా అప్పటికే కంప్లీట్ అయిపోయి ఉంటుంది. దీంతో వర్షాలు కురవడానికి దాదాపు అవకాశం ఉండదు. కానీ ప్రజంట్ సముద్రంపై తేమ అధికంగా ఉండడం వల్ల ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

కాగా ఏపీ, యానాం మీదుగా దిగువ ట్రోపో ఆవరణ ప్రాంతంలో తూర్పు, ఆగ్నేయం దిశల నుంచి గాలులు వీస్తున్నాయి. దీని ఎఫెక్ట్‌తో ఇటు ఉత్తర కోస్తాతో పాటు అటు యానాంలోని కొన్ని ప్రాంతాల్లో పొగమంచు అధికంగా ఏర్పడే అవకాశం ఉంటుందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. ఇక రాష్ట్రంలోని ఏజెన్సీ ప్రాంతాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతూనే ఉన్నాయి.  అల్లూరి సీతారామరాజు (ఏఎస్‌ఆర్‌), శ్రీకాకుళం, అనకాపల్లి, చిత్తూరు, కాకినాడ, అన్నమయ్య, పార్వతీపురం మన్యం, విజయనగరం, ప్రకాశం జిల్లాల్లో రాత్రి ఉష్ణోగ్రతలు గణనీయంగా తగ్గుతున్నాయి. రాత్రి ఉష్ణోగ్రతలు 4 నుంచి 12 డిగ్రీల వరకు నమోదవుతున్నాయి. రాష్ట్రంలోని అల్లూరి సీతారామరాజు జిల్లా జి.మడుగులో గురువారం ఉదయం 4.3 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. ఇదిలావుండగా, ఉత్తర కోస్తా ఆంధ్ర, రాయలసీమల్లో రానున్న రెండు రోజులపాటు కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుంచి 3 డిగ్రీలు తక్కువగా నమోదవుతాయని ఐఎండీ తెలిపింది

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..