Iconic Bridge: విశాఖ సిగలో మరో మణిహారం.. గోస్తనీ నదిపై ఐకాన్ బ్రిడ్జి నిర్మాణానికి ప్రణాళికలు..
Iconic Bridge: సాగర తీర నగరం విశాఖ సిగలో మరో మణిహారం కొలువుతీరనుంది. పవిత్ర గోస్తనీ సంగమం వద్ద ఐకాన్ బ్రిడ్జి..
Iconic Bridge: సాగర తీర నగరం విశాఖ సిగలో మరో మణిహారం కొలువుతీరనుంది. పవిత్ర గోస్తనీ సంగమం వద్ద ఐకాన్ బ్రిడ్జి నిర్మాణానికి ప్రణాళికలు సిద్ధం అవుతున్నాయి. సి పోర్ట్ నుండి భోగాపురం ఎయిర్పోర్ట్‌కు వెళ్లేందుకు ఆరు లైన్ల కోస్టల్ హైవే నిర్మాణానికి రంగం సిద్ధమైంది. ఈ రహదారిపై భీమిలి వద్ద గోస్తనీ నది పై నిర్మించనున్న బ్రిడ్జి ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. దీని కోసం అధికార యంత్రాంగం డిపిఆర్ రూపొందించే పనిలో నిమగ్నమై ఉంది.
విశాఖ సి పోర్ట్ నుంచి భోగాపురం ఎయిర్‌పోర్ట్‌కు..
విశాఖపట్నం పరిపాలన రాజధానిగా రూపొందుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం విశాఖపై మరింత ప్రత్యేక దృష్టి సారించింది. అవసరమైన అభివృద్ధి కార్యాచరణ అమలు చేసేందుకు సిద్ధమవుతోంది. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ఏర్పాటుకు అడుగులుపెడుతున్న నేపథ్యంలో ప్రస్తుతం ఉన్న 16వ నెంబర్ జాతీయ రహదారికి ప్రత్యామ్నాయంగా విశాఖ సి పోర్ట్ నుంచి భోగాపురం ఎయిర్పోర్ట్‌కు వెళ్లేందుకు ప్రత్యేక రహదారి నిర్మాణానికి ప్రతిపాదనలు రెడీ అవుతున్నాయి.
కేంద్రం నిధుల కోసం..
ఓ వైపు సాగరతీర అందాలను, మరోవైపు వాటిని ఆనుకుని ఉన్న గిరుల సిరులను వీక్షిస్తూ బీచ్ రోడ్డుగా సాగిపోయే ఈ రహదారిని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. 50 కిలోమీటర్ల పొడవునా కొనసాగే ఆరు లైన్ల ఈ కోస్టల్ హైవే నిర్మాణంలో భాగంగా భీమిలి వద్ద ఉన్న గోస్తనీ నదిపై సుందరమైన వంతెన నిర్మించాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రతిపాదించారు. గోస్తని నదిపై నిర్మించే ఈ వంతెన విశాఖకు ఓ ఐకాన్ గా ఉండాలని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి భావిస్తున్నారు. ఈ మేరకు ఇటీవల అధికారులతో జరిగిన సమీక్షలో ముఖ్యమంత్రి తన ఆలోచనను బయటపెట్టారు. ఈ కోస్టల్ హైవే నిర్మాణానికి అవసరమయ్యే కేంద్ర నిధులు కోసం కేంద్ర హోంమంత్రి అమిత్ షా వద్ద ప్రతిపాదనలు కూడా పెట్టినట్లు తెలుస్తోంది.
అన్ని పరిస్థితులను తట్టుకునేలా..
మరోవైపు నూతనంగా నిర్మించతలపెట్టిన ఆరు లైన్ల కోస్టల్ హైవే తో పాటు గోస్తని నదిపై నిర్మించతలపెట్టే ఐకాన్ వంతెన నిర్మాణం పైన ప్రత్యేక దృష్టి పెట్టింది జిల్లా అధికార యంత్రాంగం. వీటి కోసం అవసరమైన డిపిఆర్ లను రూపొందిస్తోంది. బంగాళాఖాతం వెంబడి వీటి నిర్మాణాలు జరగనున్న నేపథ్యంలో వాతావరణ పరిస్థితులు, వాటిని తట్టుకోవడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలపైన నిపుణులతో అధ్యయనం జరుగుతోంది. గోస్తనీ నది బంగాళాఖాతంలో కలుస్తున్న సంగమం మీదుగా ఈ గ్రీన్‌ఫీల్డ్ రహదారి వెళ్తుంది.
ప్రత్యేక ఆకర్షణగా ఉండేలా..
ఈ నేపథ్యంలో నదిపై నిర్మించబోయే వంతెన భారీగా, ప్రత్యేక ఆకర్షణగా ఉండేలా డీపీఆర్ రూపొందుతోంది. ఈ ప్రాంతంలో గోస్తనీ నది 500 మీటర్ల వెడల్పు ఉంటుంది. దీనికి మరో 500 మీటర్ల కలిపి మొత్తం కిలోమీటర్లకు పైగా పొడవునా ఈ వంతెనను నిర్మించనున్నారు. ఆ ప్రాజెక్టుకు ఇరువైపులా పచ్చదనం కూడా ఉండేలా డిజైన్లు సిద్ధం చేస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించ తలపెట్టిన ఈ భారీ వంతెన పట్ల విశాఖ వాసులు ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు.
Also read:
ఆస్ట్రేలియా ప్రభుత్వంకు గూగుల్ బెదిరింపులు.. ప్రధాని స్కాట్ మారిసన్ కౌంటర్