AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

భార్యను చంపి ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు యత్నం.. భర్తకు జీవితఖైదు..!

దుర్వ్యసనాలకు బానిసైన ఓ వ్యక్తి.. కుటుంబ ఆస్తిని విక్రయించి జల్సాలు చేయాలనుకున్నాడు. అందుకు భార్య అడ్డుపడటంతో ఆమెపై కక్ష పెంచుకున్నాడు. చివరకు నిద్రిస్తున్న భార్యను కత్తితో దారుణంగా హత్య చేసి, ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు ప్రయత్నించాడు. అయితే పోలీసుల దర్యాప్తులో అసలు నిజం బయటపడింది. శాస్త్రీయ ఆధారాలు, కీలక సాక్ష్యాలతో నిందితుడి నేరాన్ని నిరూపించిన పోలీసులు.. కోర్టులో జీవితఖైదు పడేలా చేశారు.

భార్యను చంపి ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు యత్నం.. భర్తకు జీవితఖైదు..!
Man Sentenced To Life
B Ravi Kumar
| Edited By: |

Updated on: Aug 08, 2026 | 8:36 AM

Share

దుర్వ్యసనాలకు బానిసైన ఓ వ్యక్తి.. కుటుంబ ఆస్తిని విక్రయించి జల్సాలు చేయాలనుకున్నాడు. అందుకు భార్య అడ్డుపడటంతో ఆమెపై కక్ష పెంచుకున్నాడు. చివరకు నిద్రిస్తున్న భార్యను కత్తితో దారుణంగా హత్య చేసి, ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు ప్రయత్నించాడు. అయితే పోలీసుల దర్యాప్తులో అసలు నిజం బయటపడింది. శాస్త్రీయ ఆధారాలు, కీలక సాక్ష్యాలతో నిందితుడి నేరాన్ని నిరూపించిన పోలీసులు.. కోర్టులో జీవితఖైదు పడేలా చేశారు.

ఏలూరు జిల్లా కలిదిండి మండలం ఎస్సార్పీ అగ్రహారం పంచాయతీ పరిధిలోని కట్టావానిపాలెం గ్రామానికి చెందిన కట్టా పెద్దిరాజు జూదం, ఇతర దుర్వ్యసనాలకు బానిసయ్యాడు. దీంతో సంపాదించిన డబ్బుతో పాటు కుటుంబ ఆస్తిని కూడా క్రమంగా కోల్పోయాడు. అనారోగ్యంతో పనులు చేయలేని పరిస్థితికి చేరడంతో మిగిలిన ఆస్తిపై దృష్టి సారించాడు. కుటుంబానికి ఉన్న 30 సెంట్ల భూమిని విక్రయించి వచ్చిన డబ్బుతో జల్సాలు చేయాలని నిర్ణయించుకున్నాడు. అయితే భార్య జయలక్ష్మి అందుకు తీవ్రంగా వ్యతిరేకించింది. కుటుంబ భవిష్యత్తు, పిల్లల భద్రతను దృష్టిలో ఉంచుకుని భూమిని విక్రయించేందుకు అంగీకరించలేదు. దీంతో ఆమెపై పెద్దిరాజు కక్ష పెంచుకున్నాడు.

2025 ఆగస్టు 10న రాత్రి కుటుంబ సభ్యులు నిద్రిస్తున్న సమయంలో పెద్దిరాజు తన పథకాన్ని అమలు చేశాడు. గాఢ నిద్రలో ఉన్న భార్య జయలక్ష్మిపై కత్తితో దాడి చేసి హత్య చేశాడు. అనంతరం ఈ ఘటనను ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు ప్రయత్నించాడు. తాను కూడా ఆత్మహత్యకు ప్రయత్నించినట్లు నమ్మించేందుకు నాటకం ఆడాడు. జయలక్ష్మి కుమారుడు రాము ఇచ్చిన ఫిర్యాదుతో అప్పటి ఎస్సై వేంకటేశ్వరరావు కేసు నమోదు చేశారు. సీఐ రవికుమార్ దర్యాప్తు చేపట్టి ఘటనకు సంబంధించిన ఆధారాలను సేకరించారు. నిందితుడు చెప్పిన విషయాల్లో పొంతన లేకపోవడంతో పోలీసులు అనుమానించారు. శాస్త్రీయ ఆధారాలు, కీలక సాక్ష్యాలను సేకరించి పక్కాగా ఛార్జిషీట్ దాఖలు చేశారు.

ఈ కేసును మచిలీపట్నంలోని 9వ అదనపు జిల్లా కోర్టు, మహిళలపై నేరాల విచారణ ప్రత్యేక న్యాయస్థానం విచారించింది. నిందితుడిపై మోపిన అభియోగాలు రుజువు కావడంతో న్యాయమూర్తి కట్టా పెద్దిరాజుకు జీవితఖైదుతో పాటు రూ.10 వేల జరిమానా విధించారు. జరిమానా చెల్లించకపోతే అదనంగా నెల రోజుల సాధారణ జైలు శిక్ష అనుభవించాలని తీర్పు వెలువరించారు. దుర్వ్యసనాలకు బానిసై కుటుంబాన్ని నాశనం చేసుకున్న పెద్దిరాజు.. చివరకు కట్టుకున్న భార్య ప్రాణాలు తీసి జైలుపాలైన ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us