Andhra Pradesh: ప్రజాదర్బార్‌కు భారీ స్పందన.. 50 రోజుల్లో 53 వేల ఫిర్యాదులు.. ఎక్కువగా ఆ సమస్యలపైనే..
ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక... ప్రజా ఫిర్యాదులు పోటెత్తాయి. 50 రోజుల్లో.. 53 వేల ఫిర్యాదులు అందడం హాట్ టాపిక్‌గా మారింది. ఇంతకీ ఈ కంప్లైంట్స్‌కి సొల్యూషన్ ఎలా ఉండబోతోంది..? ప్రజా సమస్యల పరిష్కారానికి సీఎం చంద్రబాబు యాక్షన్ ప్లాన్ ఏంటి..?
ఏపీలో టీడీపీ, జనసేన, బీజేపీ (ఎన్డీఏ) కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే.. సీఎం చంద్రబాబు నాయుడు ప్రజాదర్భార్ మొదలు పెట్టారు. ప్రజా సమస్యలను నేరుగా తెలుసుకునేందుకు.. వారి నుంచే ఫిర్యాదులను స్వీకరిస్తున్నారు. అందులో భాగంగానే మంత్రులు మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో వారానికి రెండ్రోజులు… టైమ్ టేబుల్ వేసుకుని మరీ ఉంటున్నారు. సీఎం చంద్రబాబు సైతం తనవంతుగా వెళ్లి ప్రజల నుంచి పెద్ద ఎత్తున ఫిర్యాదులు స్వీకరించారు. ఇక కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి నడుస్తున్న ఈ ప్రజాదర్భార్‌కు పెద్ద ఎత్తున ఫిర్యాదులు పోటెత్తాయి. రాష్ట్ర నలుమూల నుంచి 50 రోజుల్లో 53 వేల ఫిర్యాదులు రావడం చర్చనీయాంశమైంది.
ఇక ఈ ఫిర్యాదుల్లో ఎక్కువశాతం రెవెన్యూ సంబంధిత సమస్యలే ఉన్నట్లు తెలుస్తోంది. భూ ఆక్రమణ కేసులు, భూ కబ్జా కేసులే అధికంగా ఉన్నట్లు సమాచారం. అలాగే గ్రామాల్లోని త్రాగునీటి సమస్యలపైనా పెద్ద ఎత్తున ఫిర్యాదులందినట్లు తెలుస్తోంది. మరోవైపు గత ప్రభుత్వంలో అక్రమ కేసులు, పెండింగ్‌లో ఉన్న అభివృద్ధి పనులపైనా అర్జీలు అందినట్లు అధికారులు చెబుతున్నారు.
ప్రజాదర్భార్‌లో ప్రజల నుంచి అందిన ఫిర్యాదుల పరిష్కారానికి ప్రత్యేక వ్యవస్థను తీసుకొచ్చింది ఏపీ ప్రభుత్వం. ప్రజల నుంచి అందిన అర్జీని తక్షణమే ఆన్‌లైన్ చేసి.. సంబంధిత శాఖలకు వెంటనే పంపి సమస్య పరిష్కారం దిశగా అడుగులేస్తోంది. ఈ వ్యవస్థ కోసం పార్టీ కేంద్ర కార్యాలయంలోని సెకండ్ ఫ్లోర్‌లో ఓ ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేశారు. మరోవైపు సీఎం ఆదేశాలతో మంత్రులు సైతం ప్రజా ఫిర్యాదులను చాలా సీరియస్‌గా తీసుకుంటున్నారు. వెంటనే పరిష్కారమయ్యే సమస్యలను గంటల్లోనే పూర్తి చేస్తున్నారు.
మొత్తంగా.. ప్రజా ఫిర్యాదుల పరిష్కారానికి ప్రత్యేక వ్యవస్థనే తీసుకొచ్చారు సీఎం చంద్రబాబు. ఇక ప్రతి ఫిర్యాదును క్షుణ్ణంగా పరిశీలిస్తున్న అధికారులు… సాధ్యమైన వాటిని వెంటనే పరిష్కరిస్తున్నారు. టెక్నికల్‌గా ఉన్న వారిని సంబంధిత శాఖలకు పంపిస్తున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..