Tirumala: బుసలు కొట్టే శబ్దం… చూస్తే అమ్మో ఎంత పెద్ద నాగు పాము…!
తిరుమలలో భారీ నాగుపాము కలకలం సృష్టించింది. 6 అడుగుల నాగుపామును స్థానికులు గుర్తించారు. భారీ నాగు కనిపించడంతో భక్తులు ఒక్కసారిగా ఉలిక్కపడ్డారు. వెంటనే టీటీడీకి చెందిన ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఉద్యోగి భాస్కర్‌నాయుడికి సమాచారం ఇవ్వడంతో ఆయన అక్కడకు చేరుకున్నారు. కింగ్ కోబ్రాను చాకచక్యంగా పట్టుకుని అవ్వాచారి కోనలో విడిచిపెట్టారు.

తిరుమల శ్రీ వెంకటేశ్వరుడు కొలువైన ఏడు కొండలు.. జీవ వైవిద్యం ఉట్టిపడే దట్టమైన అటవీ ప్రాంతం. బయో స్పియర్ రిజర్వ్ ఫారెస్ట్‌గా ఉన్న శేషాచలం అటవీ ప్రాంతం ఎన్నో జీవరాసులకు కూడా నిలయం. ఇక సాక్షాత్తు ఆదిశేషుడిని వాహనంగా చేసుకొని భక్తులకు దర్శనమిచ్చే కలియుగ శ్రీ వేంకటేశ్వరుడు కొలువైన చోట ఎన్నో విషసర్పాలకు తిరుమల కొండలు ఆవాసంగా ఉన్నాయి. అయితే తరచూ బయటకు వస్తూ..అలజడి సృష్టిస్తోన్న భారీ పాములు చూసి భక్తులు బెదిరిపోతున్న పరిస్థితి ఉంది. నడక మార్గంలో, తిరుమలలో పలుచోట్ల భక్తులకు కనిపిస్తూ పాములు బుసలు కొడుతూనే ఉన్నాయి.
తాజాగా తిరుమలలో టీటీడీ అధికారుల నివాసం ఉండే బి టైప్ క్వార్టర్స్‌లో నాగుపాము పడగ విప్పి కనిపించింది. 6 అడుగులకు పైగా ఉన్న పెద్ద నాగుపాము స్థానికుల కంటపడింది. అధికారులు నివాసముండే ప్రాంతంలో 60 నంబర్ గదికి సమీపంలోనే కనిపించిన పాము కలకలం రేపింది. హుషారుగా పడగవిప్పి పాము బుసలు కొడుతుండటాన్ని గమనించి వెంటనే స్థానికులు స్నేక్ క్యాచర్ భాస్కర్ నాయుడుకు సమాచారం ఇచ్చారు. టీటీడీ అటవీ శాఖలో పనిచేస్తున్న భాస్కర్ నాయుడు అక్కడికి చేరుకోవడంతో అందరూ ఊపిరి పించుకున్నారు. ఇక పాములు పట్టే భాస్కర్ నాయుడు ఈజీగానే ఆరు అడుగులకు పైగా ఉన్న పామును బంధించాడు. చేతిలో ఉన్న ఐరన్ కడ్డీ తో తయారుచేసిన ఆయుధాన్ని ఉపయోగించి పడగెత్తిన పామును కట్టడి చేశాడు. చేతిలో ఉన్న ఐరన్ రాడ్ తో నిటారుగా కొద్దిసేపు నిలబెట్టాడు. అందరూ చూస్తుండగానే పామును తన చేతుల్లోకి తీసుకున్న భాస్కర్ నాయుడు అక్కడి నుంచి తీసుకెళ్లి పోయాడు. సంచిలో పామును వేసుకొని బైక్ పై తీసుకెళ్లిన భాస్కర్ నాయుడు ఎప్పుడు పాములు పట్టిన వదిలే ప్రాంతానికి చేరుకున్నాడు. అవ్వచారి కోనలో పాము వదిలి పెట్టాడు. దాదాపు అరగంట పాటు బుసలు కొట్టిన పామును చూసి బిత్తర పోయిన స్థానికులు ఎట్టకేలకు ఊపిరి పీల్చుకున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..