ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ రెండో సంవత్సర ఫలితాలు మరికాసేట్లో రానున్నాయి. శుక్రవారం సాయంత్రం 4 గంటలకు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేశ్ ఫలితాలను విడుదల చేయనున్నారు. పరీక్ష ఫలితాలను ఈ వెబ్‌సైట్లలో అందుబాటులో ఉంచనున్నట్లు మంత్రి ఇప్పటికే వెల్లడించారు.
10th తరగతి, ఇంటర్ ఫస్ట్ ఇయర్‌లో సాధించిన మార్కులను ఆధారంగా చేసుకొని ఇంటర్ సెకండియర్ ఫలితాలను విడుదల చేయనున్నారు. థియరీ పేపర్ మార్కుల కోసం.. ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఫలితాల నుంచి 70 శాతం వేయిటేజ్, 10వ తగరతిలో వచ్చిన మార్కుల నుంచి 30 శాతం వెయిటేజ్‌గా తీసుకొనున్నారు. ఇక ప్రాక్టికల్ పరీక్షలకు విషయానికొస్తే ఫస్ట్ ఇయర్‌లో వచ్చిన మార్కులను ప్రాతిపదికగా తీసుకోనున్నట్లు ఇంటర్మిడియట్ బోర్డు ఇప్పటికే వివరణ ఇచ్చింది.
కాగా, ఆంధ్రప్రదేశ్‌లో ఇంటర్, టెన్త్ పరీక్షల నిర్వహణపై పెను దుమారం రేగిన విషయం తెలిసిందే. కరోనా వ్యాప్తి నేపథ్యంలో పరీక్షలు నిర్వహించొద్దని ప్రతిపక్షాలు, ప్రజా సంఘాలు డిమాండ్ చేయగా.. పరీక్షలు నిర్వహించి తీరుతామంటూ ప్రభుత్వం భీష్మించుకు కూర్చుంది. దాంతో ఆ వివాదం కాస్తా.. సుప్రీంకోర్టుకు చేరింది.
సుప్రీంకోర్టు వార్నింగ్ ఇవ్వడంతో ప్రభుత్వం తన నిర్ణయాన్ని మార్చుకుంది. పరీక్షలు రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ఫలితాలను త్వరలోనే ప్రకటిస్తామంది. ఆ నేపథ్యంలోనే ఫలితాల ప్రకటనకు అనుసరించాల్సిన విధానంపై సూచనలు, సలహాల కోసం రిటైర్డ్ ఐఏఎస్ అధికారిణి ఛాయారతన్ నేతృత్వంలో హైపవర్ కమిటీని రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ కమిటీ సూచనల మేరకు ఇంటర్ సెకండర్ ఇయర్ ఫలితాలను ఇవాళ ప్రకటించేందుకు సిద్ధమయ్యారు.