విశాఖలో ఇంటి ఓనర్లకు పోలీసుల హెచ్చరికలు జారీ చేశారు. ఇళ్లు అద్దెకు ఇచ్చే ముందు రెంట్‌కు తీసుకునే వ్యక్తుల పూర్తి వివరాలు తీసుకోవాలని సూచించారు. వస్త్ర వ్యాపారుల ముసుగులో ఇళ్లను నేరగాళ్లు అద్దెకు తీసుకుంటున్నట్లు పోలీసులు గుర్తించారు. అద్దె ఇళ్లను గంజాయి డెన్‌లుగా మార్చేస్తూ కొత్త పంథాలో దందాలు చేస్తున్నారు కొందరు కేటుగాళ్లు. ఇంకొందరు అయితే ఏకంగా ఇళ్లలోనే గంజాయి సాగు చేస్తున్నారు. వరుసగా వెలుగులోకి వస్తున్న ఘటనలతో అప్రమత్తమయ్యారు పోలీసులు. రూట్‌మార్చిన గంజాయి మాఫియాపై పోలీసుల స్పెషల్ ఫోకస్ పెట్టారు. గంజాయి రవాణాకు వినియోగించే అద్దె భవనాలను సీజ్ చేస్తామని హెచ్చరించారు. అయితే ఇది కేవలం వైజాగ్‌లో ఉన్న సమస్య మాత్రమే కాదు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో గంజాయి వినియోగం, రవాణా విపరీతంగా పెరిగింది. సిటీల్లో మాత్రమే కాదు.. పట్టణాల్లో, గ్రామాల్లో గంజాయి విపరీతంగా దొరుకుతుంది. పోలీసుల నుంచి తప్పించుకునేందుకు కొందరు ఇంటి పెరట్లోనే ఈ మత్తు మొక్కలను పెంచుతున్నారు.
గంజాయి రవాణాలో ఒడిశా నుంచి జరిగే స్మగ్లింగ్ మొత్తం విజయవాడ మీదుగానే సాగుతుంది. దీంతో విజయవాడ కేంద్రంగా గంజాయి రవాణా పై చాలా కాలంగా దృష్టి పెట్టారు ఏపీ పోలీసులు. అలాగే ఏజెన్సీ ప్రాంతం నుంచి నుంచి వచ్చే గంజాయి ఎన్ని మార్గాలలో వస్తున్నా… వేటాడి పట్టుకుంటున్నారు. బోర్డర్ చెక్ పోస్టుల దగ్గర ద్ద చెకింగ్ పైన దృష్టి పెట్టారు… ఎటు నుంచీ గంజాయి వచ్చినా సీజ్ చేస్తున్నారు.. పట్టుబడిన లక్షల కేజీల గంజాయి సీజ్ చేసి, దహనం చేస్తున్నారు.. ప్రస్తుతం ఆపరేషన్ పరివర్తన్ లో భాగంగా గంజాయి దహనం చేస్తున్నారు.
ఏపీని గంజాయి రహిత రాష్ట్రంగా మార్చడమే లక్ష్యమంటున్నారు పోలీసులు. ఏపీ వ్యాప్తంగా లక్షల కేజీల గంజాయి ధ్వంసం చేస్తున్న ఏపి పోలీసులు, ఎక్కడ గంజాయి కనిపించినా కఠినమైన చర్యలుంటాయంటున్నారు. దేశంలో చాలా చోట్లు పట్టుబడ్డ గంజాయి నిల్వలకు లింక్ ఆంధ్రా-ఒడిశా సరిహద్దు లోనే ఉంటుంది. అందుకే గట్టి నిఘా పెట్టిన పోలీసులు ఆ నెట్‌వర్క్‌ను చేధిస్తున్నారు. కొంతమంది అక్రమార్కులు కేసులు పెట్టి.. జైల్లకు పంపినా.. చిప్ప కూడు తిని వచ్చి మళ్లీ ఇదే దందా చేయడంతో పోలీసులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. మరింత ఫోకస్ పెంచాల్సిన ఆవశ్యకత కనిపిస్తుంది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..