నర్సు దాష్టీకం.. డబ్బు ఇవ్వలేదన్న అక్కసుతో.. లేని జబ్బును ఉన్నట్టు అంటగట్టి

కాన్పు చేసినందుకు డబ్బులు ఇవ్వలేదనే కోపంతో ఓ ఎఫ్ఎన్ఓ దారుణానికి పాల్పడింది. లేని జబ్బును ఉందని చెప్పి ఆమెను కుటుంబం నుంచి వేరు చేసింది. ఆడబిడ్డకు జన్మనిచ్చిన తల్లికి ఆ ఆనందం క్షణమైనా...

నర్సు దాష్టీకం.. డబ్బు ఇవ్వలేదన్న అక్కసుతో.. లేని జబ్బును ఉన్నట్టు అంటగట్టి
Proddutur Hospital
Follow us
Ganesh Mudavath

|

Updated on: Mar 01, 2022 | 4:58 PM

కాన్పు చేసినందుకు డబ్బులు ఇవ్వలేదనే కోపంతో ఓ ఎఫ్ఎన్ఓ దారుణానికి పాల్పడింది. లేని జబ్బును ఉందని చెప్పి ఆమెను కుటుంబం నుంచి వేరు చేసింది. ఆడబిడ్డకు జన్మనిచ్చిన తల్లికి ఆ ఆనందం క్షణమైనా లేకుండా చేసింది. డబ్బు ఇవ్వలేదనే అక్కసుతో బాలింతకు ఎయిడ్స్ ఉందని నమ్మించింది. విషయం తెలుసుకున్న బాధితురాలి భర్త.. భార్యా బిడ్డలను వదిలేసి అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఈ ఘటనతో హతాశురాలైన మహిళ రోదిస్తూ ఉండిపోయింది. ఘటనను చూస్తూ ఉండిపోయిన నర్సు.. ఆమె వద్దకు వచ్చి నీకు ఏ జబ్బూ లేదు. డబ్బులు ఇవ్వలేదనే కారణంతో ఇలా చెప్పాను అని చెప్పడం గమనార్హం. దీంతో బాధితురాలు షాక్ కు గురైంది. డబ్బు కోసం ఇంతటి దారుణానికి ఒడిగడతారా అని రోదించింది. ఇక తనకు, తన బిడ్డకు దిక్కెవరని కన్నీరుమున్నీరైంది. లేని మాటలు చెప్పి తన జీవితాన్ని అంధకారం చేసిన నర్సుపై చర్యలు తీసుకోవాలని బాధితురాలు కోరుతోంది. ఈ ఘటన కడప జిల్లా ప్రొద్దుటూరు జిల్లా ఆస్పత్రిలో జరిగింది.

కడప జిల్లా చాపాడు మండలంలోని సోమాపురం గ్రామానికి చెందిన సుభాషిణి.. ప్రసవం కోసం జిల్లా ఆస్పత్రికి వచ్చింది. అదే రోజు రాత్రి ఆమెకు సాధారణ ప్రసవమై ఆడపిల్లకు జన్మనిచ్చింది. కొంత సమయం తర్వాత ఎఫ్‌ఎన్‌ఓ లత వారి వద్దకు వచ్చి రూ. 2 వేలు ఇవ్వాలని అడిగింది. ప్రస్తుతానికి తన వద్ద డబ్బులు లేవని, ఉదయం భర్త రాగానే ఇస్తానని సుభాషిణి చెప్పింది. ఈ సమయంలో సుభాషిణి, శిశువును చూసేందుకు ఆమె భర్త గురప్రసాద్ సోమవారం ఆస్పత్రికి వచ్చారు. భార్య ఆరోగ్యం గురించి ఆరా తీయగా.. సుభాషిణికి ఎయిడ్స్ ఉన్నట్లు ఎఫ్ఎస్ఓ లత తెలిపింది. భార్యకు ఎయిడ్స్‌ ఉందని తెలియడంతో గురుప్రసాద్ తీవ్ర ఆవేదనకు లోనయ్యాడు. తనకు భార్యాబిడ్డ వద్దని ఆస్పత్రి నుంచి వెళ్లిపోయాడు. ఈ ఘటనపై చోద్యం చూస్తున్న లత.. సుభాషిణి వద్దకు వచ్చి, తనకు డబ్బు ఇవ్వనందు వల్ల లేని రోగాన్ని ఉన్నట్లు చెప్పానని వివరించింది. ఈ విషయం గురుప్రసాద్ కు చెప్పాలని సూచించి అక్కడి నుంచి పరారైంది.

అయితే లతపై గతంలోనూ పలు ఆరోపణలు ఉన్నాయి. పలు మార్లు ఆస్పత్రి ఉన్నతాధికారులకు ఫిర్యాదులు కూడా వెళ్లాయి. ఆరోపణలు వచ్చిన ప్రతిసారి అధికారులు చర్యలు తీసుకోకుండా మందలించడంతో ప్రస్తుతం ఈ దుశ్చర్యకు పాల్పడింది. మరోవైపు సుభాషిణి గర్భం దాల్చినప్పటి నుంచి జిల్లా ఆస్పత్రిలోనే పరీక్షలు చేయించుకుంది. ‘డబ్బులు కావాలంటే ఇస్తాం కదా.. రూ. 2 వేల కోసం తన జీవితాన్ని నాశనం చేస్తారా.. ఇప్పుడు తన పరిస్థితి ఏంటీ’ అని సుభాషిణి రోదించింది. డబ్బు ఇవ్వలేదనే అక్కసుతో ఉదయం నుంచి ఎఫ్‌ఎన్‌ఓ దుర్భాషలాడుతోందని ఆవేదన వ్యక్తం చేసింది. తనపై ఇంతటి నింద వేసి కుటుంబాన్ని దూరం చేసిన లతపై చర్యలు తీసుకోవాలని కోరింది.

ఇవీ చదవండి.

Russia Ukraine War: రష్యా దాడుల నుంచి తృటిలో తప్పించుకున్నాం.. మా ఫ్యామిలీ అంతా సేఫ్: ఇంగ్లండ్ మాజీ క్రికెటర్

Shivaratri 2022: రెండేళ్ల తర్వాత శివరాత్రికి వెల్లంగిరి కొండలలో మహాశివరాత్రి యాత్ర.. దేశ, విదేశీయుల భక్తులతో కిటకిట

Russia Ukraine War News: ఉక్రెయిన్‌లో అమాయక పౌరులపై రష్యా దాడులు.. ఇదిగో సాక్ష్యం