భార్యను ఎరగా వేసి.. వీడు చేసిన పని తెలిస్తే నివ్వెరపోవాల్సిందే..

సోషల్ మీడియా ద్వారా పరిచయం పెంచుకుని యువకుడిని హనీట్రాప్‌లోకి దించి దాడి చేసి బంగారు చైన్ దోచుకున్న ఘటన విజయనగరం జిల్లాలో వెలుగుచూసింది. బాధితుడి ఫిర్యాదుతో కేసు నమోదు చేసిన పోలీసులు దంపతులతో పాటు మరికొందరిని అరెస్ట్ చేశారు. .. ..,

భార్యను ఎరగా వేసి.. వీడు చేసిన పని తెలిస్తే నివ్వెరపోవాల్సిందే..
Honey Trap Case (representative image)

Edited By:

Updated on: Mar 07, 2026 | 9:43 PM

సోషల్ మీడియా ద్వారా పరిచయం పెంచుకుని ఓ యువకుడిని హనీట్రాప్‌లోకి దించి దోచుకున్న ఘటన విజయనగరం జిల్లాలో సంచలనంగా మారింది. ఈ ఘటనలో ఓ దంపతులతో పాటు మరికొందరిని పోలీసులు అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. విశాఖపట్నం జిల్లా పెందుర్తి మండలం పురుషోత్తమపురానికి చెందిన పాండ్రంకి కిరణ్, అతని భార్య ఉష సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారు. మొదట సోషల్ మీడియా పోస్టుల ద్వారా ఆదాయం పొందాలని ప్రయత్నించినప్పటికీ పెద్దగా లాభం రాకపోవడంతో వారు కొత్త మార్గాన్ని ఎంచుకున్నారు. ముందుగా సోషల్ మీడియా ప్రొఫైల్స్‌ను పరిశీలించి పరువు, గౌరవం, అమాయకత్వం ఉన్న యువకులను లక్ష్యంగా ఎంచుకునేవారు. భర్త కిరణ్ సూచనలతో భార్య ఉష ఫేస్‌బుక్ ద్వారా యువకులతో పరిచయం పెంచుకుని వారిని వలలో పడేసేది. తీయగా మాట్లాడుతూ వాట్సాప్ కాల్స్, చాటింగ్ ద్వారా వారితో సన్నిహితంగా మెలిగేది. ఈ క్రమంలో భీమిలి ప్రాంతానికి చెందిన వెలవలపల్లి సాయి రమేష్ అనే యువకుడితో ఫేస్‌బుక్ ద్వారా పరిచయం పెంచుకుంది. తరచూ వాట్సాప్ కాల్స్, చాటింగ్ చేస్తూ అతనితో దగ్గరైంది. యువకుడు పూర్తిగా నమ్మిన తర్వాత అతడిని దోచుకోవాలని కిరణ్, ఉష ప్లాన్ చేశారు.వాలెంటైన్స్ డే రోజున ఫిబ్రవరి 14న జామి మండలం అలమండ సంత వద్ద కలుద్దామని యువకుడిని ఉష పిలిచింది. ఆమె మాటలు నమ్మి అక్కడికి చేరుకున్న సాయి రమేష్‌పై పాండ్రంకి కిరణ్, అతని సోదరుడు పాండ్రంకి ప్రసాద్, జామి గ్రామానికి చెందిన బోని ఎర్నిబాబు కలిసి దాడి చేశారు. తన భార్యకు మెసేజ్‌లు చేస్తున్నాడని గొడవ సృష్టించి యువకుడిని బలవంతంగా బైక్‌పై భీమసింగి వైపు తీసుకెళ్లి చేతులతో కొట్టారు. కత్తితో బెదిరించి అతని మెడలో ఉన్న సుమారు 18 గ్రాముల బంగారు చైన్‌ను లాక్కొన్నారు. అదనంగా రూ.70 వేల రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అంతేకాకుండా యువకుడి ఫేస్‌బుక్ ఖాతా, మొబైల్‌లో ఉన్న వాట్సాప్ చాట్స్, కాల్స్, మెసేజ్‌లను డిలీట్ చేయించి ఎక్కడా ఫిర్యాదు చేయవద్దని బెదిరించి చివరకు అతడిని విడిచిపెట్టారు.

తనపై దాడి చేసి బంగారు చైన్ దోచుకున్నారని బాధితుడు మార్చి 3న జామి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు పోలీసులు. విచారణలో ఫేస్‌బుక్ ఖాతా వివరాల ఆధారంగా నిందితులను గుర్తించి అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి బంగారు చైన్, మొబైల్ ఫోన్, పల్సర్ బైక్‌ను స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా అదనపు ఎస్పీ పి. సౌమ్యలత మాట్లాడుతూ సోషల్ మీడియాలో పరిచయమైన వ్యక్తులను గుడ్డిగా నమ్మవద్దని ప్రజలకు సూచించారు. గుర్తు తెలియని వ్యక్తుల ప్రలోభాలకు గురికాకుండా అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.

Follow Us