Andhra Pradesh: అడవిలోనే గంజాయి ఫ్యాక్టరీ.. పోలీసులకే షాకిచ్చిన లిక్విడ్ గ్యాంగ్..

గతంలో కిలోల కొద్దీ ఎండు గంజాయిని గుట్టుగా తరలించిన స్మగ్లర్లు.. ఇప్పుడు పోలీసుల కళ్లుగప్పి లిక్విడ్ అవతారమెత్తారు. ఆంధ్ర-ఒడిశా సరిహద్దుల్లో పోలీసులు ఉక్కుపాదం మోపడంతో పట్టుబడకుండా ఉండేందుకు ఏకంగా అడవిలోనే ఒక మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్‌ను ఏర్పాటు చేసి హ్యాష్ ఆయిల్ తయారు చేస్తున్నారు. పోలీసులకు ఎలా చిక్కారనేది ఇప్పుడు తెలుసుకుందాం..

Andhra Pradesh: అడవిలోనే గంజాయి ఫ్యాక్టరీ.. పోలీసులకే షాకిచ్చిన లిక్విడ్ గ్యాంగ్..
Liquid Ganja Smuggling Aob

Edited By:

Updated on: Feb 14, 2026 | 10:16 PM

గంజాయి సాగు.. రవాణాపై కూటమి ప్రభుత్వలు ఉక్కుపాదం మోపడంతో స్మగ్లర్లు తమ రూటు మార్చారు. ఎండు గంజాయి రవాణా చేస్తున్న క్రమంలో పట్టుబడుతుండడంతో వ్యూహాన్ని మార్చేశారు. ఏకంగా లిక్విడ్‌ గంజాయిపై దృష్టి సారిస్తు.. దాన్ని గుట్టుగా తయారు చేసేస్తున్నారు. ఇందుకోసం ఏకంగా ఏవోబిలో ఓ మ్యాను ఫ్యాక్చరింగ్ యూనిట్‌నే పెట్టేసారు. ఏపీలో పట్టుబడిన స్మాగ్లర్లతో కూపీ లాగితే ఒడిశాలో ఆ లిక్విడ్ గంజాయి తయారీ గుట్టు బయటపడింది. అల్లూరి జిల్లా సీలేరులో ఈనెల మొదటివారంలో లిక్విడ్ గంజాయి పట్టుబడింది. ఐస్ గెడ్డ జంక్షన్ వద్ద కాపు కాసిన పోలీసులు.. ఒడిశా వైపు నుంచి వస్తున్న రెండు బైకులను ఆపి ప్రశ్నించారు. వారు పొంతన లేని సమాధానాలు చెప్పడంతో తనిఖీ చేయగా ఏడు లిక్విడ్ గంజాయి ప్యాకెట్లు బయటపడ్డాయి. దీంతో ముగ్గురిని అరెస్ట్ చేసి విచారణ చేపట్టారు. అరెస్ట్ అయినవారిని ఒడిశాలోని ధబల్ పహాడ్‌కు చెందిన బి కునుతో పాటు అల్లూరి జిల్లా జీకే వీధి మండలం రింతాడ గ్రామానికి చెందిన వీరయ్య, దారకొండకు చెందిన బంగారు రాజుగా గుర్తించ్చారు.

ఒడిశా మల్కాన్‌‌గిరి జిల్లా బోర్డర్ నుంచి లిక్విడ్ గంజాయి కొనుగోలు చేసినట్టు గుర్తించి అక్కడి పోలీసులు అలర్ట్ అయ్యారు. వెరిఫై చేస్తే బోడ పొదర్‌లో లిక్విడ్ గంజాయి తయారీ జరుగుతున్నట్టు ఒడిశా పోలీసులు తెలుసుకున్నారు. దాడులు చేస్తే ఒక కుటీర పరిశ్రమగా లిక్విడ్ గంజాయి తయారీ సాగుతున్నట్టు గుర్తించారు. అక్కడ మ్యాను ఫ్యాక్చరింగ్ యూనిట్ చూసి పోలీసులే అవాక్కయ్యారు. ఏవోబీలో గత కొంతకాలంగా గుట్టుగా లిక్విడ్ గంజాయి తయారీ కేంద్రం నడుస్తున్నట్టు గుర్తించారు. హాష్ ఆయిల్ తయారు చేస్తున్న నలుగురిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. వారిలో ఏపీకి చెందిన ఇద్దరు ఉన్నారు. 25 లక్షల విలువ చేసే 2 లీటర్ల లిక్విడ్ గంజాయిని ఒడిశా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

అంతే కాకుండా ఆయిల్ తయారీకి సిద్ధం చేసిన 30 కిలోల గంజాయి, తయారీ కోసం వినియోగించే గ్యాస్ సిలిండర్, కంప్రెసర్, ప్రెసర్ కుక్కర్, డ్రమ్ములు, స్టవ్ సీజ్ చేశారు.‘‘ గంజాయి మ్యానుఫ్యాక్చర్ యూని‌ట్‌ను గుర్తించి దాడులు చేశాం. గంజాయి రవాణాను పోలీసులు అడ్డుకోవడంతో స్మగ్లర్లు రూట్ మార్చారు. గంజాయిని లిక్విడ్ గా తయారుచేసి స్మగ్లింగ్ చేస్తున్నారు. 50 కిలోల గంజాయితో ఒక కిలో హాషిష్ ఆయిల్ తయారు చేస్తున్నారు. గంజాయి కార్యకలాపాలపై ఉక్కు పాదం మోపుతున్నాం’’ అని అన్నారు మల్కన్ గిరి జిల్లా ఎస్పీ వినోద్ పాటిల్.