Andhra Prtadesh: ఏపీలో విస్తారంగా వర్షాలు.. జలాశయాలకు పోటెత్తిన వరద నీరు

ఏపీ వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో వర్షాలు పడుతున్నాయి. దీంతో వరద నీరు పోటెత్తింది. జలాశయాలు నిండుకుండల్లా మారాయి.

Andhra Prtadesh: ఏపీలో విస్తారంగా వర్షాలు.. జలాశయాలకు పోటెత్తిన వరద నీరు
Ap Floods

Updated on: Oct 16, 2022 | 1:53 PM

శ్రీ సత్యసాయి జిల్లాను రికార్డ్ స్థాయిలో వరదలు ముంచెత్తాయి. దశాబ్ద కాలంలో ఎన్నడూ లేనంత స్థాయిలో వాగులు, వంకలు ఉప్పొంగుతున్నాయి. చిత్రావతి నదికి వరద పోటెత్తడంతో.. బుక్కపట్నం చెరువు సముద్రాన్ని తలపిస్తోంది. జిల్లా వ్యాప్తంగా కుంభవృష్టిగా వర్షాలు కురుస్తున్నాయి. చుక్క నీరు లేక వట్టిపోయిన నదులు, వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ఈ వరదతో ధర్మవరం చెరువు కూడా జలకళను సంతరించుకుంది. తూర్పుగోదావరి, అల్లూరి జిల్లాల్లో వర్షాలు తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. ఉప్పొంగి ప్రవహిస్తున్న వాగులకు.. రోడ్లు, బ్రిడ్జిల పైనుంచి వరద ప్రవహిస్తోంది. అసలే వీకెండ్ కావడంతో ఎంతో మంది ప్రకృతి ప్రేమికులు మారేడుమిల్లి బాట పట్టారు. కానీ మన్యం ప్రాంతం వెళ్లే రోడ్లపైన నీరు ప్రవహిస్తుండటంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. భద్రాచలం, రంపచోడవరం, అడ్డతీగల, మారేడుమిల్లి వెళ్లే ప్రధాన రహదారిపై నీటి ప్రవాహానికి పలు చోట్ల గోతులు పడ్డాయి. దీంతో ఆ రోడ్డులో వెళ్లడం కష్టంగా మారింది.

అంబేద్కర్ కోనసీమ జిల్లాలో తుఫాన్‌ హెచ్చరికలతో అధికార యంత్రాంగం అప్రమత్తం అయింది. జిల్లా, డివిజన్, మండల కేంద్రాల్లో కంట్రోల్ రూమ్స్ ఏర్పాటు చేశారు అధికారులు. సముద్రంలో చేపల వేటకు వెళ్లకూడదని జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా సూచించారు. తుఫాను సమయంలో అవసరమైన ఏర్పాట్లు చేయాలని అధికారులకు కలెక్టర్‌ ఆదేశాలు జారీ చేశారు. కంట్రోల్ రూమ్స్ 24గంటలు పనిచేసేలా చర్యలు తీసుకోవాలన్నారు కలెక్టర్‌. కోనసీమ జిల్లాలో వారం రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు వరద ఉధృతి పెరిగిందని నల్గొండ జిల్లా అధికారులు చెప్పారు. 22 క్రస్ట్ గేట్లు 10 అడుగుల మేర ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ఇన్ ఫ్లో :4,42,323 క్యూసెక్కులు కాగా ఔట్ ఫ్లో 3,93,776క్యూసెక్కులు ఉంది. ప్రాజెక్ట్‌ పూర్తిస్దాయి నీటి మట్టం 590 అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం 588.80 అడుగులు ఉంది. పూర్తిస్థాయి నీటి నిల్వ 312 టీఎంసీలు కాగా ప్రస్తుతం 308టీఎంసీల నీరు ఉంది.

ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం ఫెర్రీ ఘాట్ వద్ద కృష్ణానది ప్రవాహ నీటి మట్టం పెరిగింది. ఫెర్రీ ఘాట్ మెట్లు దాటి పరిసర ప్రాంతాల్లోకి వరద నీరు చేరింది. బడ్డీ కొట్లు, పిండ ప్రదానాలు చేసే ప్రాంతం నీట మునిగాయి. దీంతో పంచాయితీ అధికారులు ప్రమాద హెచ్చరికను ఏర్పాటుచేశారు. విజయవాడ ప్రకాశం బ్యారేజ్‌ దగ్గర వరద ఉధృతి పెరుగుతోంది. దీంతో మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. 70 గేట్లను పూర్తిగా ఎత్తేసి వరద నీటిని వదులుతున్నారు అధికారులు. సముద్రంలోకి 4,87,508 క్యూసెక్కులు విడుదల చేశారు. కాలువలకు 2,827 క్యూసెక్కులు విడుదల చేశారు. మొత్తం ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో 4,90,335 క్యూసెక్కులుగా ఉంది. ప్రస్తుతం బ్యారేజి వద్ద నీటిమట్టం 13.6 అడుగులు ఉంది.

ఏలూరు జిల్లాలో కొల్లేరు కు భారీగా వరద వస్తోంది. భారీ వర్షాలకు ఎగువ నుంచి నీరు వస్తోంది. వరద నీరు ఉప్పుటేరు లోకి వెళ్లకపోవడంతో కొల్లేరు లంక గ్రామాలు
ముంపు బారిన పడ్డాయి. దీంతో వరద నీరు రోడ్లపై ప్రవహిస్తోంది. పెదయడ్లగాడి నుంచి పెనుమాక లంక, నందిగాం లంక, ఇంగులపాక , రుద్రపాక, పోరు కొండలకు రాకపోకలు నిలిచిపోవడంతో పది రోజులుగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

మహబూబ్ నగర్ జిల్లాలోని జూరాల ప్రాజెక్టుకు వరద గంట గంటకు భారీగా పెరుగుతూనే ఉంది. దీంతో కృష్ణమ్మ ఉగ్రరూపంతో ఉరకలేస్తోంది.ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు ఆల్మట్టి, నారాయణ పూర్ ప్రాజెక్ట్ ల నుండి 2 లక్షల 45 వేల క్యూసెక్కుల భారీ వరద జూరాలకు వరద వచ్చి చేరుతోంది. అప్రమత్తమైన అధికారులు జూరాల ప్రాజెక్ట్ 43 గేట్లు ఎత్తివేసి 2 లక్ష 67 వేల క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నారు. శ్రీశైలం వైపు కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతూ ప్రవహిస్తోంది. తీర ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.

నెల్లూరు జిల్లాలోని సోమశిల జలాశయానికి వరద పోటెత్తుతోంది. రాయలసీమ, కర్ణాటకలో భారీగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో వరద నీటితో సోమశిల నిండుకుండలా మారింది. జలాశయానికి 74 వేల క్యూసెక్కుల వరద ప్రవాహం వస్తుండగా 8 క్రస్ట్‌ గేట్లను ఓపెన్‌ చేసి పెన్నా నది దిగువకు 85వేల క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. వరద కాల్వ ద్వారా కండలేరు జలాశయానికి 1300 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. జలాశయం పూర్తి నిల్వ సామర్థ్యం 77.9 టీఎంసీలు కాగా ప్రస్తుతం 67.1 టీఎంసీల నీరు ఉందని అధికారులు తెలిపారు. నీటి విడుదల నేపథ్యంలో పెన్నా పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలంటూ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం చూడండి..