Godavari Floods: గోదావరికి మరింత పెరిగిన వరద ఉధృతి.. ఏజెన్సీలో 250 గ్రామాలను చుట్టుముట్టిన వరద..
Andhra Pradesh News: ధవళేశ్వరం వద్ద గోదావరి నీటిమట్టం 15 అడుగులకు చేరుకుంది. వరద ఉధృతితో ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద రెండవ ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. ఇవాళ వరద మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయి. అయితే.. మూడవ ప్రమాద హెచ్చరిక జారీ చేసే పరిస్థితులు రాకపోవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. ధవళేశ్వరం బ్యారేజ్ నుంచి ప్రస్తుతం 14లక్షలకు పైగా క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి
ఏలూరు, జులై 30: వర్షాలు తగ్గుముఖం పట్టినా గోదావరికి వరద ఉధృతి ఇంకా కొనసాగుతూనే ఉంది. ఎగువ నుంచి వరదతో ధవళేశ్వరం దగ్గర గోదావరి నీటిమట్టం పెరుగుతుండటం ఆందోళన కల్గిస్తోంది. అటు.. లంక గ్రామాలు జలదిగ్బంధం నుంచి బయటపడటం లేదు. వరద ముంపులో చిక్కుకుని అల్లాడుతున్నాయి. పదిరోజులుగా ప్రమాదకర పరిస్థితుల్లో పడవలపైనే ప్రయాణాలు సాగిస్తూ కాలం వెల్లదీస్తున్నారు ముంపు బాధితులు.
తెలంగాణ సహా ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో ఏపీలోనూ గోదావరికి వరద పోటెత్తుతోంది. రోజురోజుకూ వరద పెరుగుతుండటంతో ధవళేశ్వరం వద్ద గోదావరి నీటిమట్టం 15 అడుగులకు చేరుకుంది. వరద ఉధృతితో ధవళేశ్వరం బ్యారేజ్ వద్ద రెండవ ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. ఇవాళ వరద మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయి. అయితే.. మూడవ ప్రమాద హెచ్చరిక జారీ చేసే పరిస్థితులు రాకపోవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. ధవళేశ్వరం బ్యారేజ్ నుంచి ప్రస్తుతం 14లక్షలకు పైగా క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి వదులుతున్నారు. వరద ప్రవాహం మరింత ఎక్కువ కావడంతో అల్లూరి సీతారామరాజు, ఏలూరు జిల్లాలోని ముంపు మండలాలు, ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాల్లోని పలు లంక గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి.
తూర్పుగోదావరి జిల్లా నరసాపురంలో వశిష్ట గోదావరికి వరద కొనసాగుతోంది. దాంతో.. ఆచంట, యలమంచిలి మండలాల్లోని లంక గ్రామాలు జలదిగ్బంధంలోనే అల్లాడుతున్నాయి. పదిరోజులుగా ప్రమాదకర పరిస్థితుల్లో పడవలపైనే ప్రయాణాలు సాగిస్తున్నారు లంక గ్రామాల ప్రజలు. అయితే.. అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని లంక గ్రామాల ప్రజలు అధికారుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నో ఏళ్లుగా అధికారులు వచ్చి మునిగిపోయిన కాజ్‌వేలను చూసి వెళ్ళిపోవడం తప్ప చేసిందేంలేదని టీవీ9తో వాపోయారు. అయినవిల్లి-ఎదురుబిడియం కాజ్ వే నిర్మించాలని నాయకులకు ఎన్నో ఏళ్లుగా మొరపెట్టుకుంటున్నా పట్టించుకున్నవారే లేరంటున్నారు. అయినవిల్లి మండలంలో అయినవిల్లిలంక, వీరవిల్లిపాలెం, పల్లపులంక, అద్దంకివారిలంకతోపాటు పలు లంక గ్రామాల ప్రజలు వరదల సమయాల్లో చాలా ఇబ్బందులు పడుతున్నామని చెప్తున్నారు.
అల్లూరి జిల్లా చింతూరులో శబరి నది ప్రవాహం క్రమంగా పెరుగుతోంది. నీటిమట్టం 42 అడుగులు దాటడంతో.. చింతూరు ఏజెన్సీ నాలుగు మండలాల్లో 250 గ్రామాలను వరద చుట్టుముట్టింది. గోదావరి, శబరి ప్రవాహాలు పెరగడంతో వందల గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. తాగునీటికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు లంక గ్రామాల ప్రజలు. అప్రమత్తమైన జిల్లా అధికార యంత్రాంగం ముంపు గ్రామాల ప్రజలను బోట్ల ద్వారా పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. ఇక.. అంబేద్కర్ కోనసీమ జిల్లా పాశర్లపూడి-అప్పనపల్లి కాజ్వే, సఖినేటిపల్లిలంక-అప్పనిరాముని లంక కాజ్వేపై వరద నీరు ప్రవహిస్తుండడంతో మూడు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. చాకలిపాలెం-కనకాయలంక కాజ్వేపై తొమ్మిది రోజులుగా వరద పారుతుండడంతో నాటు పడవులపైనే ప్రయాణాలు చేస్తున్నారు ప్రజలు.
ఏలూరు జిల్లాలోని కుక్కునూరు, వేలేరుపాడు మండలాల్లోనూ అత్యధిక గ్రామాలు వరద ముంపులో చిక్కుకున్నాయి. ఇప్పటికే 31కుపైగా గ్రామాలను వరద నీరు చుట్టుముట్టింది. 2,700 కుటుంబాలు పునరావాస కేంద్రాలకు, గుట్టలు, కొండలపైకి తరలివెళ్లారు. వరద పెరుగుతుండడంతో ప్రధాన రహదారులపైకి నీరు చేరి 47 గ్రామాల మధ్య రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. వేలేరుపాడు మండలంలో 15 గ్రామాలకు బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయ్. ఇక.. పోలవరం కాఫర్ డ్యాం వద్ద మరో రెండు మీటర్ల వరద పెరిగితే కుక్కునూరు, వేలేరుపాడు మండలాల్లోని అత్యధిక గ్రామాలు వరద ముంపులో చిక్కుకోనున్నాయి. మొత్తంగా… గోదావరి వరద ప్రవాహంతో లంక గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకుని మరోసారి అల్లాడిపోతున్నాయి.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..