విచిత్రంగా నవంబర్ లో కూడా గతంలో ఎన్నడూ లేని విధంగా భరించలేని స్థాయిలో వేడి గాలులు వీయడం మనందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. దీనికి గల కారణాలను అన్వేషించే పనిలో పడ్డారు
సెంటర్ ఫర్ సైన్స్ అండ్ ఎన్విరాన్‌మెంట్ అండ్ డౌన్ టు ఎర్త్ కి చెందిన ‘ఇండియాస్ అట్లాస్ ఆన్ వెదర్ డిజాస్టర్స్’ అనే సంస్థ. దీని నివేదిక ప్రకారం 2023లో అన్ని దక్షిణ భారత రాష్ట్రాలలో ఆంధ్రప్రదేశ్‌లోనే అత్యధిక హీట్‌వేవ్ రోజులు నమోదయ్యాయి. ఆంధ్రాతో పోలిస్తే తెలంగాణలో కొన్ని రోజులు వేడిగాలులు తక్కువగా ఉండగా, కర్ణాటకలో కొన్ని రోజులు అసాధారణంగా వేడి వాతావరణం నెలకొంది. ఈ విపరీత వాతావరణ సంఘటనలు ఆంధ్రప్రదేశ్‌లో పలు ప్రాణాలను బలిగొనగా కొన్ని పంటల ఉత్పత్తిపైనా ప్రభావితం చేశాయి. సాధారణంగా ఆంధ్రప్రదేశ్ దక్షిణాదిలో మిగతా రాష్ట్రాలతో పోలిస్తే ఎక్కువ హీట్‌వేవ్‌లకు గురవుతుంటుంది. ప్రతి వేసవిలో ఒకటి లేదా రెండు స్పెల్స్ ఉంటాయి. అయితే గతంలో కంటే భిన్నంగా 2023 రికార్డు స్థాయిలో అత్యధిక ఉష్ణోగ్రతలను చూసింది.
రాష్ట్రంలో విస్తృతంగా విపరీతమైన వడగాల్పులకు కారణాలు అనేకం ఉన్నాయి. ప్రధానంగా రుతుపవనాల రాక ఆలస్యంగా రావడం. దానివల్ల గాలిలో పెరిగిన తేమ ఉష్ణోగ్రత పరిస్థితులను మరింత దిగజార్చాయి. ఈ ఏడాది జనవరి నుంచి సెప్టెంబరు మధ్య 45 రోజుల పాటు ఆంధ్రప్రదేశ్ తీవ్రమైన వాతావరణ పరిస్థితులను ఎదుర్కొంది. ఈ ప్రతికూల వాతావరణ రోజులలో 22 హీట్‌వేవ్ రోజులు ఉన్నాయి. ఇది 2023లో దక్షిణ భారత అన్ని రాష్ట్రాల్లో అత్యధికం కావడం ఇప్పుడు ఆందోళన కలిగిస్తోంది. పొరుగున ఉన్న తెలంగాణలో 2023లో 13 హీట్‌వేవ్ రోజులు నమోదయ్యాయి. అయితే కర్ణాటకలో నాలుగు రోజులు అసాధారణంగా వేడి వాతావరణం నమోదైంది.
భారతదేశంలో జనవరి నుండి సెప్టెంబరు వరకు 273 రోజులలో 235 రోజుల్లో తీవ్రమైన వాతావరణ సంఘటనలను చవిచూసింది. గత ఏడాది 241 రోజులతో పోలిస్తే ఇది కాస్త తక్కువే కానీ ఈ ఉష్ణోగ్రతతో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు ఆంధ్రప్రదేశ్ ప్రజలు. మధ్యప్రదేశ్‌లో అత్యధికంగా 138 రోజులు అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. దీని తర్వాత స్థానాల్లో ఉత్తరప్రదేశ్ లో 113 రోజులు, హిమాచల్ ప్రదేశ్ లో 112 రోజులు అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
ఒకవైపు సాధారణం కంటే అత్యధిక ఉష్ణోగ్రతతో హీట్ వేవ్ పెరుగుతున్న ఆంధ్రప్రదేశ్‌లో చలి రోజుల సంఖ్య కూడా తగ్గుముఖం పట్టడం విశేషం. 2022వ సంవత్సరంలో ఒక్కరోజు మాత్రమే పూర్తి స్థాయిలో చలిగాలులు నమోదయ్యాయి. ఇది ఆంధ్రప్రదేశ్ లో గత 12 ఏళ్లలో కనిష్టం. ఈ నవంబర్‌లో కూడా ఇలాంటి పరిస్థితులు నెలకొని శీతాకాలంలో సాధారణ ఉష్ణోగ్రతల కంటే ఎక్కువగా నమోదవుతున్నాయి.
ఈ విపరీతమైన ఉష్ణోగ్రతలతో ఆంధ్రప్రదేశ్‌లో 45 మంది ప్రాణాలు కోల్పోయారు. మరోవైపు 9,000 హెక్టార్లలో పంటలు దెబ్బతిన్నాయి. కోస్తా తీర రాష్ట్రంగా ఉన్నందున..ఆంధ్రప్రదేశ్ లో చోటు చేసుకుంటున్న వాతావరణ మార్పులు పంటల ఉత్పత్తులపైనా చాలా హాని చూపిస్తాయి. ప్రతి వేసవిలో ఒకటి లేదా రెండు హీట్‌వేవ్ స్పెల్ లు అత్యధిక ఉష్ణోగ్రతలను నమోదు చేస్తుండగా ముఖ్యంగా మే నెల సెకండ్ ఆఫ్ లో ఒక స్పెల్ వారం పాటు ఉంటుంది. గత దశాబ్ద కాలంలో దేశంలోనే అత్యధికంగా వడదెబ్బ వల్ల ఏపీ లో మృతుల సంఖ్య పెరిగింది.
2023 జూన్‌లో రాష్ట్రంలో రికార్డు ఉష్ణోగ్రతలు నమోదవడంతో పూర్తిగా భిన్నమైన దృశ్యం ఆవిష్కరింపబడింది. ఉదాహరణకు వాల్తేరు సెంటర్ లో ఈ ఏడాది జూన్ 10న 43.4 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత నమోదు అయింది. ఇది వైజాగ్ నగరంలో ఆల్ టైమ్ రికార్డు. అత్యధిక గరిష్ట ఉష్ణోగ్రత 1978 లో నమోదైన 42 డిగ్రీల సెల్సియస్‌ని అధిగమించింది. జూన్ 17న శ్రీకాకుళంలోని ఎచ్చెర్లలో ఈ సీజన్‌లో అత్యధికంగా 46.8 డిగ్రీల సెల్సియస్ నమోదైంది.
జూన్‌లో హీట్‌వేవ్ పరిస్థితులతో విద్యాసంస్థలు కొత్త విద్యా సంవత్సరం ప్రారంభాన్ని సైతం వాయిదా వేయవలసి వచ్చింది. ప్రతికూల వాతావరణం కారణంగా వేసవి సెలవల తర్వాత తిరిగి తెరిచినా చాలా రోజుల తర్వాత కూడా రాష్ట్ర ప్రభుత్వం పాఠశాలలను కొద్ది రోజుల పాటు ఉదయం 7:30 నుండి 11:30 వరకు మాత్రమే నిర్వహించింది.
ఆంధ్రా యూనివర్శిటీ వాతావరణ, సముద్ర శాస్త్ర మాజీ విభాగాధిపతి ప్రొఫెసర్ ఒఎస్‌ఆర్‌యు భాను కుమార్ టీవీ9 తో మాట్లాడుతూ.. గత ఎనిమిదేళ్లు భూమిపై అత్యంత అత్యధిక ఉష్ణోగ్రతలు కలిగిన సంవత్సరాలుగా నమోదయ్యాయన్నారు. గ్లోబల్ వార్మింగ్ కారణంగా ఉష్ణోగ్రతలు వేగంగా పెరుగుతున్నాయనీ, గ్లోబల్ వార్మింగ్ వాస్తవాన్ని అర్దం చేసుకుని తదనుగుణంగా వ్యవహరించాల్సిన సమయం ఇదన్నారు ప్రొఫెసర్ భాను కుమార్ అన్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..