తెలుగు రాష్ట్రాల్లో వడగాల్పుల తీవ్రత కొనసాగుతోంది. ఆంధ్రప్రదేశ్‌లో దాదాపు 478 మండలాల్లో వడగాల్లులు వీస్తున్నాయి. విజయనగరం, తూర్పుగోదావరి, విశాఖపట్నం సహా పలు జిల్లాలో 40 డిగ్రీలకు పైగా గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదైనట్లు అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. అలాగే.. సోమవారం నుంచి రాయలసీమ ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు తగ్గే అవకాశం ఉందన్నారు వాతావరణ అధికారులు చెప్పారు. జూన్ 19 నుంచి 21 మధ్య నైరుతి రుతుపవనాలు విస్తరించేందుకు అనుకూల పరిస్థితులు కనిపిస్తున్నాయని.. ఆ రోజుల్లో రాయలసీమలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పింది.
ముఖ్యంగా గోదావరి జిల్లాల్లో ఎండలు మండిపోతున్నాయి. రాజమహేంద్రవరంలో అత్యధికంగా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రాజమహేంద్రవరంలో ఉదయం నుంచి కాస్త వాతావరణం చల్లగా ఉన్నప్పటికీ మధ్యాహ్నం నుంచి ఎండ తీవ్రత పెరిగింది. ఉష్ణోగ్రత గరిష్ఠంగా 44.0, కనిష్ఠంగా 31.0 డిగ్రీలు నమోదైంది. అనపర్తిలో 38.9 డిగ్రీలు, బిక్కవోలులో 39.4 డిగ్రీలు, చాగల్లులో 40.4 డిగ్రీలు, దేవరపల్లిలో 43.3 డిగ్రీలు, గోకవరంలో 42.3 డిగ్రీలు, గోపాలపురంలో 44.1 డిగ్రీలు ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి.
ఇదిలా ఉంటే.. తెలంగాణలోని ఖమ్మం, కొత్తగూడెం జిల్లాల్లో తీవ్రమైన వడగాల్పులు వీచే అవకాశం ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. రాబోయే మూడు రోజుల్లో నిర్మల్, భూపాలపల్లి, వరంగల్ సహా పలు జిల్లాల్లో తీవ్రంగా వడగాల్పులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. అలాగే కొన్ని చోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. మరో రెండు, మూడు రోజులు పలు రాష్ట్రాల్లో వడగాల్పలు కొనసాగుతాయని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. తమిళనాడు, ఒడిశా, ఉత్తరప్రదేశ్, బిహార్, మధ్యప్రదేశ్ రాష్ట్రాలు సహా విదర్భ ప్రాంతాల్లో తీవ్రమైన వడగాల్పులు వీచే పరిస్థితులు ఉన్నాయని వాతావరణ శాఖ హెచ్చరించింది.