Andhra Pradesh: ఐలవరం టీచర్‌కు అంతర్జాతీయ అవార్డ్‌.. ఆయన సాధించిన ఘనత ఏంటంటే..

తమ సంస్కృతి, వాతావరణ పరిస్థితులు, విద్యా విధానం, ఆహారపు అలవాట్లపై ఈ లేఖలు రాసేవారు. విదేశాల్లోని విద్యార్థులను సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్ ద్వారా ఎంపిక చేసుకునే వారు. ప్రస్తుతం హరికృష్ణ నిర్వహిస్తున్న సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్ ద్వారా అరవై దేశాల్లోని వందల మంది...

Andhra Pradesh: ఐలవరం టీచర్‌కు అంతర్జాతీయ అవార్డ్‌.. ఆయన సాధించిన ఘనత ఏంటంటే..
English Teacher

Edited By:

Updated on: Jan 27, 2024 | 8:09 PM

ఆయన బోధించేది ఆంగ్లం. బాపట్ల జిల్లా భట్టిప్రోలు మండలం ఐలవరం ప్రభుత్వ జిల్లా పరిషత్ పాఠశాలలో టీచర్‌గా పని చేస్తున్నారు. పేరు హరికృష్ణ… ఆయన తీసుకున్న రెండు నిర్ణయాలతో అంతర్జాతీయ అవార్డు రేస్ మొదటి స్టేజ్‌కు ఎంపిక అయ్యారు‌. కరోనా తర్వాత పెన్ పాల్, వర్చువల్ మీటింగ్స్ ద్వారా తన పాఠశాలలోని విద్యార్థులతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న వివిధ దేశాల్లో పాఠశాలల్లోని విద్యార్థులతో ఇంగ్లీష్‌లో మాట్లాడించేవారు. పెన్ పాల్ ప్రోగ్రామ్ ద్వారా పాఠశాలల్లోని విద్యార్థులు విదేశాల్లోని విద్యార్థులకు లెటర్స్ రాసేవారు.

తమ సంస్కృతి, వాతావరణ పరిస్థితులు, విద్యా విధానం, ఆహారపు అలవాట్లపై ఈ లేఖలు రాసేవారు. విదేశాల్లోని విద్యార్థులను సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్ ద్వారా ఎంపిక చేసుకునే వారు. ప్రస్తుతం హరికృష్ణ నిర్వహిస్తున్న సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్ ద్వారా అరవై దేశాల్లోని వందల మంది విద్యార్థులున్నారు. పెన్ పాల్ ప్రోగ్రామ్ తర్వాత వర్చువల్ సమావేశాలు నిర్వహించేవారు. దీంతో విద్యార్థుల్లో ఇంగ్లీష్ పై మక్కువ పెరిగి చక్కటి ఆంగ్లం మాట్లాడటం అలవాటైంది‌.

హరికృష్ణ చేపట్టిన ఈ ప్రోగ్రామ్స్‌ను అమెరికా ప్రభుత్వం గుర్తించింది. 2022లో పుల్ బ్రైట్ టీచర్ అవార్డుకు ఎంపికయ్యారు. ఈ అవార్డు కు ఇండియా ఆరుగురు ఎంపిక కాగా అందులో హరికృష్ణ ఒకరు. ఈ అవార్డ్ కు ఎంపికైన ఉపాధ్యాయుడు నలభై రోజుల పాటు అమెరికాలోని వివిధ పాఠశాలల్లోని బోధనా విధానాలను పరిశీలించవచ్చు. హరికృష్ణ కూడా 2022 లో అమెరికా వెళ్లి వచ్చారు. ఆ తర్వాత ఆయన తీసుకొచ్చిన విధానాలను యునెస్కో సహకారంతో నడిచే వార్కి ఫౌండేషన్ గుర్తించింది. వార్కి ఫౌండేషన్ గ్లోబల్ టీచర్ అవార్డును అందిస్తుంది.

ఈ అవార్డు ద్వారా ఏడు కోట్ల రూపాయలను అందిస్తుంది. ఈ అవార్డు కోసం మొదటి స్టేజ్ లో ప్రపంచ వ్యాప్తంగా ఎనిమిది వేల మంది పోటీ పడగా యాభై మందిని ఎంపిక చేశారు. యాభై మందిలో ఇండియా నుంచి ఇద్దరు టీచర్లు ఉండగా ఒకరు హరికృష్ణ. మరొకరు వెస్ట్ బెంగాల్ నుంచి ఎంపికయ్యారు‌. ఐలవరం గ్రామానికి చెందిన హరికృష్ణ అంతర్జాతీయ అవార్డులకు ఎంపికవ్వటంపై స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

తమ పాఠశాలలోని విద్యార్థులు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న విదేశీ విద్యార్థులతో మాట్లాడుతూ అక్కడ సంస్కృతి, వాతావరణ పరిస్థితులు తెలుసుకోవడంతో గ్లోబల్ కాంపిటీటర్స్‌గా తయారవుతున్నారన్నారు. మన రాష్ట్రంలో కొత్త కొత్త విధానాలతో ప్రభుత్వ పాఠశాలలు కార్పోరేట్ పాఠశాలలతో పోటీ పడుతున్నాయని హర్షం వ్యక్తం చేస్తున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..