Andhra Pradesh Rains: వరుణుడు రెండు రాష్ట్రాలను వణికిస్తున్నాడు. ఎడతెరిపిలేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు రెండు రాష్ట్రాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇక ఏపీలోని కొన్ని లంక గ్రామాల ప్రజల దీన పరిస్థితి మరీ వర్ణనాతీతం. కాగా భారీ వర్షాలు, వరదలతో ఓవైపు లంక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతుంటే.. ఇవేవీ తమకేమీపట్టనట్లు వ్యవహరిస్తున్నారు కొందరు యువకులు. వరదలొస్తే మాకేంటీ అంటున్నారు. కొందరేమో చేపలు పట్టుకుని ఆ ఫొటోలను, వీడియోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. ఇంకొందరైతే కాజ్‌వేలపై నిలిచిన వరదనీటితో బైక్‌లను వాష్ చేస్తున్నారు. ఒకటి, రెండు కాదు..పదుల సంఖ్యలో వాహనాలు బారులు తీరాయి. కింది విజువల్స్ చూస్తే మీకే అర్థమవుతుంది. ఏదో పార్కింగ్ ప్లేస్‌లో వాహనాలను పార్కింగ్ చేసినట్టు కనిపిస్తోంది. లంక ప్రాంతాల నుంచి పడవలపై బైకులను ఒడ్డుకు చేర్చి మరీ వరదనీటిలో బైకులను కడుగుతున్నారు. ఓ వైపు భారీ వర్షాలతో ప్రజలు అల్లాడుతుంటే.. వరదనీటిలో ఇలా బైకులను కడగడమేంటని నోరెళ్లబెడుతున్నారు స్థానికులు.
నాటు పడవలపై రాకపోకలు..
ఇక భారీ వర్షాల కారణంగా ఏపీలోని పలు జిల్లాలోని గ్రామాలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. భారీగా వస్తున్న వరద నీటితో ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్ద అధికారులు రెండో ప్రమాద హెచ్చరికను కొనసాగిస్తున్నారు. బ్యారేజీ నీటి మట్టం 15.10 అడుగులకు చేరగా ముందు జాగ్రత్తగా అధికారులు 15 లక్షల క్యూసెక్కులు నీటిని సముద్రంలోకి విడుదల చేస్తున్నారు. కోనసీమ జిల్లాలోని లంక గ్రామాలు జలదిగ్బంధంలో బిక్కుబిక్కుమంటూ కాలం వెల్లదీస్తున్నాయి. వరద నీరు రహదారులు, కాజ్‌వేలపై పొంగి ప్రవహిస్తుండటంతో రాకపోకలు నిలిచిపోయాయి. పి.గన్నవరం మండలం శివాయిలంక, చినకందాల పాలెం, వాడ్రేవుపల్లి, నాగుల్లంక గ్రామాల్లోకి వరదనీరు చేరాయి. అయినవిల్లి లంక కాజ్‌వే పూర్తిగా నీట మునిగిపోవడంతో నాలుగు లంక గ్రామాల ప్రజలు నాటు పడవలపై రాకపోకలు సాగిస్తున్నారు.
మరిన్ని ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి..